టెర్రరిస్ట్ @ ఆర్టీఐ.. | Terrorist @ RTI .. | Sakshi
Sakshi News home page

టెర్రరిస్ట్ @ ఆర్టీఐ..

Published Sat, Nov 7 2015 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

టెర్రరిస్ట్ @ ఆర్టీఐ..

టెర్రరిస్ట్ @ ఆర్టీఐ..

సాక్షి, హైదరాబాద్: ఐఎం ఉగ్రవాది ‘సమాచారం’ కోసం పోరాడుతున్నాడు... ఓ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసు వివరాల కోసం కర్ణాటక రాష్ట్ర సమాచార కమిషన్ మెట్లు ఎక్కాడు. అతడు మరెవరో కాదు... హైదరాబాద్‌లో జరిగిన 2007 జంట పేలుళ్ల కేసు నిందితుడు అక్బర్ ఇస్మాయిల్ చౌదరి. కర్ణాటకలోని ఉల్లాల్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసుకు సంబంధించి సమాచార హక్కు చట్టం కింద తాను కోరిన సమాచారం అందించలేదంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ముంబైలోని ఆథర్ రోడ్ జైల్లో ఉన్న అక్బర్ అక్కడ నుంచే బెంగళూరులో ఉన్న కర్ణాటక రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. దీని విచారణ మార్చిలో ప్రారంభం కావడంతో ముంబై పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇస్మాయిల్‌ను బెంగళూరుకు తీసుకువచ్చి, తిరిగి  తీసుకువెళ్తున్నారు. సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన దశాబ్ద కాలంలో ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

 వెంకటాద్రి థియేటర్ వద్ద బాంబు పెట్టింది ఇతడే..
 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లో చోటు చేసుకున్న జంట పేలుళ్ల కేసులో అక్బర్ నిందితుడిగా ఉన్నాడు. అప్పట్లో గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌ల్లో పెట్టిన బాంబులు పేల గా... దిల్‌సుఖ్‌నగర్‌లోని వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్ పక్కన మరో పేలని బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. ఈ బాంబును అక్కడ పెట్టింది అక్బర్ ఇస్మాయిల్ చౌదరీనే.

 ఉగ్రవాదులకు డ్రైవర్‌గా వ్యవహరించాడు..
 మహారాష్ట్రలోని పుణెకు చెందిన అక్బర్ వృత్తిరీత్యా కంప్యూటర్ మెకానిక్. దేశ వ్యాప్తంగా అనేక పేలుళ్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడు ఉగ్రవాదులకు డ్రైవర్‌గానూ వ్యవహరించాడు. కర్ణాటకలోని మంగుళూరు నుంచి పుణె మీదుగా అహ్మదాబాద్, ముంబై తదితర ప్రాంతాలకు పేలుడు పదార్థాలను రవాణా చేశాడు. 2008లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇతడిని అరెస్టు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మంగుళూరులో ఉన్న ఉల్లాల్ పోలీసుస్టేషన్‌లో ఇతడిపై ఓ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఉల్లాల్ పోలీసులకు కేసు వివరాలు కోరుతూ గత ఏడాది ఫిబ్రవరి 28న ఆథర్ రోడ్ జైలు అధికారుల ద్వారా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు.

అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్‌తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద తనపై ఉల్లాల్ పోలీసులు నమోదు చేసిన కేసుకు (ఎఫ్‌ఐఆర్ నెం.242/2008) సంబంధించిన సమాచారం అందించాల్సిం దిగా కోరాడు. ఈ కేసుల్లో ఆధారాలు లభిస్తే తనను అరెస్టు చేయాలని, లేకుంటే తన పేరును కేసు నుంచి తొలగించాలని అభ్యర్థించాడు. ఓ వ్యక్తి జీవితం, స్వేచ్ఛలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులపై అధికారులు 48 గంటల్లోనే సమాధానం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నా ఉల్లాల్ పోలీసులు అక్బర్ పిటిషన్‌పై స్పందించలేదు.

దీంతో ఆథర్ రోడ్ జైలు నుంచే గత ఏడాది మే 5న కర్ణాటక రాష్ట్ర సమాచార కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశాడు. దీని విచారణను మార్చిలో ప్రారంభించిన కమిషన్ ఇరు పక్షాలకు సమన్లు జారీ చేసింది. దీంతో అటు ఉల్లాల్ పోలీసులతో పాటు ఇటు అక్బర్ సైతం కమిషన్ ముందు హాజరవుతూ ఎవరి వాదనలు వారు వినిపించుకుంటున్నారు. తాను కోరిన సమాచారం కోసం అవసరమైతే సుప్రీం కోర్టునూ ఆశ్రయిస్తానంటూ కమిషన్ ముందు హాజరైన సమయంలో అక్బర్ స్పష్టం చేశాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement