వైద్యుల ఖాళీల భర్తీకి చర్యలు
వైద్యుల ఖాళీల భర్తీకి చర్యలు
Published Tue, Mar 7 2017 6:55 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM
తణుకు అర్బన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యుల ఖాళీలను భర్తీ చేయనున్నట్టు డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కె.శంకరరావు తెలిపారు. తణుకు ఏరియా ఆస్పత్రిని మంగళవారం ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఆస్పత్రితో పాటు ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 21 సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ల ఖాళీలు ఉన్నాయని చెప్పారు. ఏలూరులో నిర్మాణంలో ఉన్న మాతా శిశు విభాగంలో ప్రత్యేకంగా ఐదు గైనిక్ వైద్యులు, 10 స్టాఫ్ నర్సులు, రెండు అనస్తీషియా పోస్టులను భర్తీ చేయనున్నామన్నారు.
తణుకు ఏఆర్‌టీ సెంటర్‌లో సిబ్బందిని నియమిస్తాం
హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల సౌకర్యార్థం తణుకు ఏఆర్‌టీ సెంటర్‌లో అవసరమయ్యే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, కేర్ కో-ఆర్డినేటర్, డేటా మేనేజర్, కౌన్సిలర్ పోస్టులను తక్షణమే భర్తీ చేస్తామని డీసీహెచ్‌ఎస్ శంకరరావు చెప్పారు. ఏపీ శాక్స్ నుంచి ఇటీవల వచ్చిన ఆదేశాల మేరకు పీడీ రాజేంద్రప్రసాద్ సూచనలతో ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. తణుకు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెలగల అరుణ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వజావత్ కానరాజ్, సభ్యులు కంటిపూడి రాంబాబు, ఆత్మకూరి బులిదొరరాజు, కేవీ బాలకృష్ణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement