
వేలం పర్యవేక్షణకు కమిటీ
♦ విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వం
♦ అగ్రిగోల్డ్ భూముల వేలంపై హైకోర్టు వెల్లడి
♦ మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తామన్న ధర్మాసనం
సాక్షి, హైదరాబాద్: డిపాజిట్లరకు తిరిగివ్వాల్సిన మొత్తాలను చెల్లించేందుకు వీలుగా తమ ఆదేశాల మేరకు జరగబోయే అగ్రిగోల్డ్ భూముల వేలం ప్రక్రియను పర్యవేక్షించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున ఒక్కొక్కరు ఉంటారని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల కమిటీ నుంచి ఒకరిని తాము ఎంపిక చేస్తామని, అలాగే ఆర్థిక వ్యవహారాల్లో నిపుణులైన ఐదుగురు వ్యక్తుల పేర్లను సూచిస్తే అందులో నుంచి ఒకరిని ఎంపిక చేస్తామని తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది.
తమ తరఫున కూడా కమిటీలో ఒక ప్రతినిధి ఉండేలా చూడాలని అగ్రిగోల్డ్ బాధితుల న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. అలాగే వేలం నిమిత్తం కోర్టుకు సమర్పించిన ఆస్తుల్లో వేటినీ తాకట్టు పెట్టలేదంటూ రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని అగ్రిగోల్డ్ సంస్థను ఆదేశించింది. ఈ అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాత ఈ మొత్తం వ్యవహారంలో మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి ఎస్.వి.భట్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వేలం విషయంలో ఎటువంటి షరతులు విధించాలో సీనియర్ న్యాయవాది హోదాలో తమకు సలహా ఇవ్వాలని అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డిని కోరింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల నుంచి రూ.6,350 కోట్లను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అగ్రిగోల్డ్ డిపాజిటర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ.రమేశ్‌బాబు గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు కోర్టు ముందు స్వయంగా హాజరయ్యారు.