రాయలసీమలో కరువు కరాళనృత్యం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరరావు చెప్పారు. రాయలసీమ కరువు, ప్రాజెక్టులపై సీమకు చెందిన భారతీయ జనతాపార్టీ నేతలు కడపలో ఆదివారం సమావేశమయ్యారు. కరువు, సీమ ప్రాజెక్టులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఈ సందర్బంగాబీజేపీ ఉపాధ్యక్షుడు కపిలేశ్వరరావు, బీజేపీ మహిళా నేత శాంతారెడ్డి మాట్లాడుతూ వలసలను ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పాలమూరు-దిండి ప్రాజెక్టుల వల్ల రాయలసీమ ఎడారిగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సీమ ప్రాజెక్టులపై సర్కార్ శ్వేతపత్రం విడుదలచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కరువుపై కైంద్ర ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని వారు ఆరోపించారు. పట్టిసీమను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసిన సర్కార్ గండికోట, హంద్రీ-నీవా పథకాలను ఎందుకు పూర్తి చేయట్లేదని ప్రశ్నించారు. తాము మిత్రపక్షమైనా ప్రజలపక్షాన పోరాడతామని వారు పేర్కొన్నారు. సీమ సమస్యలపై మండలస్థాయి నుంచి పోరాటానికి కార్యాచరణ రూపొందించామని చెప్పారు.