ఐదురోజులుగా అత్తారింట్లోనే మృతదేహం
పాపిరెడ్డిపాళెంలో టెన్షన్ టెన్షన్
పోలీసుల అదుపులో భర్త, అత్త ఆగిన మౌనిక అంత్యక్రియలు
తోటపల్లిగూడూరు: అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మౌనిక(23) దహన సంస్కారాల చిక్కుముడి ఐదవ రోజూ వీడలేదు. వివరాల్లోకి వెళ్తే.. తోటపల్లిగూడూరు మండలం పాపిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన దద్దోలు మౌనిక(23) ఈ నెల 14వ తేదీ అర్థరాత్రి మెట్టినింట్లో మృతిచెందింది. ఘటన అనంతరం మౌనిక భర్త అశోక్,అత్త సుభాషిణీలు పరారయ్యారు. భర్త, అత్తామామలే తమ బిడ్డను కొట్టి చంపి ఆపై పెట్రోలు పోసి తగలుబెట్టారంటూ మౌనిక తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వారి బంధువుల ఇళ్లపై దాడులకు దిగారు.
పరారీలో ఉన్న భర్త, అత్తలు ఇంటికి తిరిగి వస్తే కాని మౌనిక అంత్యక్రియలను నిర్వహించేదిలేదంటూ వారు పట్టుబట్టారు. అంతేకాక మౌనిక మృతదేహాన్ని అశోక్ ఇంట్లోనే ఉంచి వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ విషయం ఐదు రోజులుగా గ్రామంలో వివాదస్పదంగా మారిపోయింది. కాగా ఆమె భర్త అశోక్, అత్త సుభాషిణీలను ఎట్టకేలకు పోలీసులు శుక్రవారం సాయంత్రం అదుపులోకి తీసుకొన్నారు.
నిందితులు దొరకడంతో నాలుగు రోజులుగా నిలిచిన మౌనిక దహన సంస్కారాలు శనివారం జరుగుతాయనీ అందరూ భావించారు. కాని ఐదో రోజు కూడా మౌనిక దహన సంస్కారాల ఉత్కంట వీడలేదు. మౌనిక బిడ్డలకు న్యాయం జరిగేలా అస్తిపాస్తుల రిజిస్ట్రేషన్ పనులతో పెద్దలంతా శనివారం బిజీ ఆయిపోయారు. ఆదివారం ఉదయం మౌనిక అంత్యక్రియలను నిర్వహించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.