- ఎస్‌బీఐ వద్ద సీపీఎం ఆందోళన
అనంతపురం : నల్లధనం బయటకు తీయడానికి ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం పెద్ద బూటకమేనని సీపీఎం నాయకులు విమర్శించారు. పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ, సామాన్యులు నగదు కోసం పడుతున్న కష్టాలపై సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సాయినగర్‌లోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుతో దేశంలోని నల్లధనాన్ని వెలికితీసి, అవినీతిని అంతం చేస్తామని ప్రధాని మోదీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెద్దనోట్ల రద్దు అనంతరం బ్యాంకుల వద్ద క్యూలో నిల్చుని 50 మంది, బ్యాంక్ పని ఒత్తిడితో 11మంది మరణించారని గుర్తుచేశారు. చిత్తూరులో స్వయానా సీఎం చంద్రబాబు తీసుకున్న టీటీడీ పాలకవర్గ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్‌రెడ్డి ఇంట్లో వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఈ సందర్బంగా పాతనోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లను ప్రింట్ చేసేంతవరకు పాతనోట్లను చలామణిలో ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే పింఛన్ల పంపిణీలో సైతం పాత పద్ధతిలోనే అమలు చేయాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర, నాగప్ప, బాబా ఫకృద్ధీన్ , ప్రకాష్, ముత్తుజాలతో పాటు అధిక సంఖ్యలో సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.