ఆవు మూత్రంపైనా పన్ను | The cow urine over tax | Sakshi
Sakshi News home page

ఆవు మూత్రంపైనా పన్ను

Published Fri, May 13 2016 3:40 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

ఆవు మూత్రంపైనా పన్ను - Sakshi

ఆవు మూత్రంపైనా పన్ను

దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 5% విధింపు
 
సాక్షి, హైదరాబాద్
: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గోమూత్రంపై 5 శాతం పన్ను విధించింది. ఏపీ వ్యాట్‌చట్టం-2005లోని ఐదో షెడ్యూల్ ప్రకారం గోమూత్రంపై పన్ను విధించే అధికారం ఉందంటూ వాణిజ్య పన్నుల విభాగం రాష్ట్రంలోని వివిధ సంస్థలకు సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం-1940 కింద లెసైన్స్ పొంది తయారు చేసే ఆయుర్వేద, హోమియోపతి మందులపై పన్ను వేస్తున్నట్టే గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధిస్తున్నట్టు పేర్కొంది. ఈమేరకు నోటీసులు అందుకున్న గోఉత్పత్తుల తయారీ సంస్థలు, గోసంరక్షణ శాలల నిర్వాహకులు ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాయి.


 వాణిజ్య పన్నులశాఖ నోటీసుల్లో ఏముందంటే..
ఆయుర్వేద, హోమియోపతి మందుల మాదిరే గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధించవచ్చని వాణిజ్య పన్నులశాఖ ఇటీవల గుంటూరు సహా వివిధ జిల్లాల్లోని గోఉత్పత్తుల తయారీ సంస్థలకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. గోమూత్రాన్ని కాచి వడపోసి ప్యాక్ చేసి అమ్ముతున్నందున పన్ను పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఆవు మూత్రాన్ని వేదకాలం నుంచే ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నప్పటికీ పన్ను నుంచి మినహాయించమని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. గోమూత్రాన్ని ఏయే రుగ్మతలకు వాడతారో కూడా పేర్కొంది.

అధిక బరువు, ఉదర సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, చక్కెర వ్యాధి, కాలేయ వ్యాధులు, ఉబ్బసం, పేగు సంబంధిత రుగ్మతలు, కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు తదితరాలకు వినియోగిస్తుంటారని వివరించింది. అందువల్ల గోమూత్రంపై ఏపీ వ్యాట్‌యాక్ట్ ప్రకారం 5 శాతం పన్ను విధించవచ్చంటూ సమర్థించుకుంది. గోమూత్రాన్ని కీటక నియంత్రణిగానూ ఉపయోగిస్తున్నందున క్రిమి సంహారక మందుల చట్టం కింద అమ్మకపు పన్ను కూడా విధించవచ్చునని తెలిపింది.


పది వేల లీటర్ల వ్యాపారం..: రాష్ట్రంలోని గోశాలలు, రైతుల నుంచి గోఉత్పత్తుల తయారీ సంస్థలు నిత్యం వేలాది లీటర్ల మూత్రాన్ని సేకరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశీ ఆవులకు, గోమూత్రానికి గిరాకీ పెరిగింది. దేశీ ఆవుల నుంచి తీసిన మూత్రాన్ని వైద్యంతోపాటు సేద్యానికీ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పది వేల లీటర్లకు పైగా గోమూత్రాన్ని అమ్ముతున్నారు. శుద్ధి చేసిన మూత్రాన్ని లీటర్‌కు రూ.50, సేద్యానికి వినియోగించే మూత్రాన్ని లీటర్‌ను రూ.25 నుంచి రూ.30 మధ్య విక్రయిస్తున్నారు. రైతులు లేదా గోశాలల నుంచి సేకరించే మూత్రానికి, తాగడానికైతే లీటర్‌కు రూ.25, 30 మధ్య, సేద్యానికైతే లీటర్‌కు రూ.20 వరకు చెల్లిస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేదు..
గోమూత్రాన్నీ, పేడను షాంపూలు, సబ్బులు, పెనాయిల్, అగర్ బత్తీలు, దూప్ బత్తీలు, దోమల నివారణ కాయిల్స్ తదితర ఉత్పత్తుల తయారీకి వినియోగిస్తారు. మనుషులు తాగేందుకు వీలుగా గోమూత్రాన్ని శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. దీనిపై ఇప్పటి వరకు ఎక్కడా పన్ను వేయలేదు. రాష్ట్రంలో మాత్రమే ఈ ఏడాది నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే జరిగితే గోశాలలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గోశాలలు విక్రయించే మూత్రంతో వచ్చే డబ్బును ప్రస్తుతం వాటి నిర్వహణకు వినియోగిస్తున్నారు. వ్యాట్‌ను ఎత్తివేయాలని, గోవుల ప్రేమతోనైనా కొత్త మార్కెట్ సృష్టించాలని గోశాలల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటే దేశీ ఆవులు అవసరమని, వాటి మూత్రంపై పన్ను ఏమిటని ప్రకృతిసాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement