Wyatt
-
బోధన్ స్కామ్‌లో ఐదుగురు నిందితుల గుర్తింపు
వీరి కోసం గాలిస్తున్నామన్న ఐజీ సౌమ్యామిశ్రా సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి ప్రతి నెలా వ్యాట్ రూపంలో రావాల్సిన కోట్ల రూపాయలను బినామీ ఖాతాలో్లకి మళ్లించిన బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కామ్ దర్యాప్తును సీఐడీ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని నిందితులుగా గుర్తిం చినట్లు ఐజీ సౌమ్యామిశ్రా శుక్రవారం తెలి పారు. వీరిలో ముగ్గురు కమర్షియల్ ట్యాక్స్ అధికారులుండగా... ఇద్దరు దళారులని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఇప్పటివరకు ఓ ఉదంతంలోనే రూ.3.39 కోట్లు స్వాహా అయినట్లు గుర్తించామని మిగిలిన ఉదంతాల్లో గుర్తించా ల్సుందని పేర్కొన్నా రు. ఈ కేసు దర్యాప్తులో అనేక ఖాతాలను సరిచూడాల్సి ఉందని, దీంతో కమర్షియల్ ట్యాక్స్ విభాగం నుంచి నోడల్ అధికారి, కొందరు సహాయకులను నియమించామని పేర్కొన్నారు. నమో ఫౌండేషన్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్న అంకిత్ మెహతాపై ఆశిష్ జైన్ న ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేశామని ఐజీ తెలి పారు. తన తల్లి సరోజ జైన్ నుంచి మెహతా రూ.12.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనకు ప్రధాన మంత్రి కార్యాలయంలోనూ (పీఎంఓ) పలుకుబడి ఉన్నట్లు బాధితులకు చెప్పాడని, దీంతో వారు సీఐడీలో ఫిర్యాదు చేయడంతో పాటు పీఎంఓకూ లేఖ రాశారన్నారు. ఈ మోసానికి, ఫౌండేషన్ కు సంబంధం లేదని, అయితే బాధితులు మాత్రం ఆ సంస్థ ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే మెహతాకు నగదు ఇచ్చినట్లు చెప్తున్నారని సౌమ్యామిశ్రా తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు కూడా దర్యాప్తు స్థితిలో ఉందని వివరించారు. ఎంసెట్ లీకేజ్ స్కామ్‌లో ఇప్పటికే అనేక మంది నిందితుల్ని అరెస్టు చేశామని చెప్పిన ఐజీ బీహార్ కేంద్రంగా జరిగిన ఈ స్కామ్‌లో కీలక నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. -
ఆవు మూత్రంపైనా పన్ను
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో 5% విధింపు సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం గోమూత్రంపై 5 శాతం పన్ను విధించింది. ఏపీ వ్యాట్‌చట్టం-2005లోని ఐదో షెడ్యూల్ ప్రకారం గోమూత్రంపై పన్ను విధించే అధికారం ఉందంటూ వాణిజ్య పన్నుల విభాగం రాష్ట్రంలోని వివిధ సంస్థలకు సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్, కాస్మొటిక్స్ చట్టం-1940 కింద లెసైన్స్ పొంది తయారు చేసే ఆయుర్వేద, హోమియోపతి మందులపై పన్ను వేస్తున్నట్టే గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధిస్తున్నట్టు పేర్కొంది. ఈమేరకు నోటీసులు అందుకున్న గోఉత్పత్తుల తయారీ సంస్థలు, గోసంరక్షణ శాలల నిర్వాహకులు ప్రభుత్వ తీరును నిరసిస్తున్నాయి. వాణిజ్య పన్నులశాఖ నోటీసుల్లో ఏముందంటే.. ఆయుర్వేద, హోమియోపతి మందుల మాదిరే గోమూత్రాన్నీ ఔషధంగా ఉపయోగిస్తున్నందున పన్ను విధించవచ్చని వాణిజ్య పన్నులశాఖ ఇటీవల గుంటూరు సహా వివిధ జిల్లాల్లోని గోఉత్పత్తుల తయారీ సంస్థలకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. గోమూత్రాన్ని కాచి వడపోసి ప్యాక్ చేసి అమ్ముతున్నందున పన్ను పరిధిలోకి వస్తుందని తెలిపింది. ఆవు మూత్రాన్ని వేదకాలం నుంచే ఆయుర్వేద వైద్యంలో వినియోగిస్తున్నప్పటికీ పన్ను నుంచి మినహాయించమని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. గోమూత్రాన్ని ఏయే రుగ్మతలకు వాడతారో కూడా పేర్కొంది. అధిక బరువు, ఉదర సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులు, చక్కెర వ్యాధి, కాలేయ వ్యాధులు, ఉబ్బసం, పేగు సంబంధిత రుగ్మతలు, కీళ్ల వాతం, కీళ్ల నొప్పులు తదితరాలకు వినియోగిస్తుంటారని వివరించింది. అందువల్ల గోమూత్రంపై ఏపీ వ్యాట్‌యాక్ట్ ప్రకారం 5 శాతం పన్ను విధించవచ్చంటూ సమర్థించుకుంది. గోమూత్రాన్ని కీటక నియంత్రణిగానూ ఉపయోగిస్తున్నందున క్రిమి సంహారక మందుల చట్టం కింద అమ్మకపు పన్ను కూడా విధించవచ్చునని తెలిపింది. పది వేల లీటర్ల వ్యాపారం..: రాష్ట్రంలోని గోశాలలు, రైతుల నుంచి గోఉత్పత్తుల తయారీ సంస్థలు నిత్యం వేలాది లీటర్ల మూత్రాన్ని సేకరిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దేశీ ఆవులకు, గోమూత్రానికి గిరాకీ పెరిగింది. దేశీ ఆవుల నుంచి తీసిన మూత్రాన్ని వైద్యంతోపాటు సేద్యానికీ వినియోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పది వేల లీటర్లకు పైగా గోమూత్రాన్ని అమ్ముతున్నారు. శుద్ధి చేసిన మూత్రాన్ని లీటర్‌కు రూ.50, సేద్యానికి వినియోగించే మూత్రాన్ని లీటర్‌ను రూ.25 నుంచి రూ.30 మధ్య విక్రయిస్తున్నారు. రైతులు లేదా గోశాలల నుంచి సేకరించే మూత్రానికి, తాగడానికైతే లీటర్‌కు రూ.25, 30 మధ్య, సేద్యానికైతే లీటర్‌కు రూ.20 వరకు చెల్లిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేదు.. గోమూత్రాన్నీ, పేడను షాంపూలు, సబ్బులు, పెనాయిల్, అగర్ బత్తీలు, దూప్ బత్తీలు, దోమల నివారణ కాయిల్స్ తదితర ఉత్పత్తుల తయారీకి వినియోగిస్తారు. మనుషులు తాగేందుకు వీలుగా గోమూత్రాన్ని శుద్ధి చేసి విక్రయిస్తుంటారు. దీనిపై ఇప్పటి వరకు ఎక్కడా పన్ను వేయలేదు. రాష్ట్రంలో మాత్రమే ఈ ఏడాది నుంచి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇదే జరిగితే గోశాలలు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గోశాలలు విక్రయించే మూత్రంతో వచ్చే డబ్బును ప్రస్తుతం వాటి నిర్వహణకు వినియోగిస్తున్నారు. వ్యాట్‌ను ఎత్తివేయాలని, గోవుల ప్రేమతోనైనా కొత్త మార్కెట్ సృష్టించాలని గోశాలల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలంటే దేశీ ఆవులు అవసరమని, వాటి మూత్రంపై పన్ను ఏమిటని ప్రకృతిసాగు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అద్దె బస్సులపై ‘వాణిజ్య’ కొరడా!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా వ్యాప్తంగా ఐదు ఆర్టీ సీ డిపోల పరిధిలో సుమారు 124 అద్దెబస్సులు నడుస్తున్నా యి. కండక్టర్ ఆర్టీసీకి చెంది, డ్రైవర్ ప్రైవేట్ వ్యక్తిగా కిలోమీటర్‌కు రూ.11 చొప్పున అద్దె బస్సుల నిర్వహకులు ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అయితే గూడ్స్ పర్సంటేజ్, హైర్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్స్ కింద అద్దెబస్సు యజమానులు వాణిజ్యపన్నుల శాఖకు నెలవారీ పన్ను చెల్లించాలి. ప్రభుత్వం నుంచి వసూలవుతున్న మొత్తంలో ఖర్చులు పోనూ టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) పేరిట లెక్కలు చూపించాలి. వ్యాట్ కింద ఇలా సుమారు రూ.11 లక్షల చొప్పున ఆరుగురు అద్దె బస్సుల నిర్వహకులు వాణిజ్యపన్నుల శాఖకు బకా యి పడ్డారు. మూడు ప్రాంతాల పరిధిలో సుమారు రూ.70 లక్షల మేర బకాయి పేరుకుపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేశారు. అయినా నిర్వహకులు పట్టించుకోకపోవడంతో బస్సుల్ని సీజ్ చేసి పోలీసుల అధీనంలో ఉంచేశారు. దీంతో తమకు కొంత గడువిస్తే పన్ను మొత్తాల్ని చెల్లించేస్తామని ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహకులు కాళ్ల బేరానికి వస్తున్నారు. విచిత్రమేమిటంటే కొంతమంది నిర్వహకులు వాణిజ్యపన్నులశాఖకు బకాయి కట్టకుండానే ఆయా బస్సుల్ని ఇతరులకు అమ్మేయోచనలోకి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై చట్ట ప్రకారం బస్సుల ఎటాచ్‌మెంట్‌కు దిగారు. -
వైన్‌పై వ్యాట్ తగ్గింపు!
♦ రాష్ట్రంలో ‘వైన్’కు డిమాండ్ పెంచాలని భావిస్తున్న సర్కారు ♦ 150 శాతం నుంచి 70 శాతానికి వ్యాట్ తగ్గింపు ప్రతిపాదన ♦ కొత్త వైనరీలకు ప్రోత్సాహం.. మార్కెట్ కల్పించేందుకు నిర్ణయం ♦ త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త వైనరీలను ప్రోత్సహించడంతోపాటు ‘వైన్’ మత్తుపానీయానికి డిమాండ్ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో వైన్ అమ్మకాలపై విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో వైన్‌పై 150 శాతం వ్యాట్ విధిస్తున్నారు. తద్వారా ఇతర రాష్ట్రాల్లో తయారయ్యే 750 ఎంఎల్ నాణ్యమైన ప్రీమియం వైన్ ఎంఆర్పీ రూ. 500 నుంచి రూ. 1,000కి రాష్ట్రంలో లభిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో వైన్‌పై వ్యాట్ తక్కువగా ఉండడం, వైనరీలు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైన్‌ను ప్రోత్సహించేందుకు వ్యాట్‌ను 150 శాతం నుంచి 70 శాతం వరకు 3 స్లాబుల్లో తగ్గించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఈ మేరకు టీఎస్‌బీసీఎల్ జనరల్ మేనేజర్ సంతోష్‌రెడ్డి ప్రతిపాదనలను కమిషనర్ చంద్రవదన్ ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. ఆర్థిక శాఖ కూడా అమ్మకాలు పెంచడం ద్వారా ఆదాయం సమకూరితే వ్యాట్‌ను 80 శాతం తగ్గించేం దుకు అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నది ఒక్కటే వైనరీ దేశ, విదేశాల్లో ‘వైన్’ది ప్రత్యేక స్థానం. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎంపిక చేసిన ఉన్నతాదాయ వర్గాలు, వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తోనే ఇతరులు ఎక్కువగా వినియోగిస్తారు. రాష్ట్రం లో నల్లగొండ జిల్లాలోని బీబీ నగర్ లో ఉసిరికాయతో వైన్ తయారు చేసే వైనరీని ఓ వ్యాపారి ఇటీవల ప్రారంభించాడు. ఇక్కడ వైన్ ఉత్పత్తికి అయ్యే ఖర్చును మించి 150 శాతం వరకు వ్యాట్ విధిస్తుండడంతో మార్కెట్లో ఎంఆర్పీ తడిసి మోపెడవుతోంది. దీంతో సదరు కంపెనీ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. వైన్లలో కూడా ఆర్డినరీ, మీడియం, ప్రీమియం బ్రాండ్ల ఉత్పత్తిని ప్రోత్సహించి, వాటి ఉత్పత్తికి అనుకూలంగా మూడు స్లాబుల్లో వ్యాట్‌ను విధించాలని భావిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపితే వైన్‌పై వ్యాట్ 80 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. -
ఆదాయమార్గాలపై ప్రభుత్వం కసరత్తు
నీటి తీరువా వసూళ్లు సెల్ఫోన్లపై వ్యాట్ పెంపు సర్వీసు చార్జీలు వాత సాక్షి, హైదరాబాద్: ఆదాయ వనరులను పెంచుకోవడానికి రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేయడం, పదివేల రూపాయలకుపైగా ఖరీదైన సెల్ఫోన్లపై వ్యాట్ పెంచటం, ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలపై సర్వీసు చార్జీల రూపంలో నిర్వహణ వ్యయాన్ని రాబట్టడంపై దృష్టి సారించింది. రైతులకు ప్రాజెక్టుల కింద భూములకు సాగునీరు ఇస్తున్నందున ఆ ప్రాజెక్టుల నిర్వహణ వ్యయాన్ని నీటి తీరువా రూపంలో రాబట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నీటి తీరువా ఉన్నప్పటికీ రైతుల నుంచి వసూళ్లపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించలేదు. గతంలో చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా నీటి తీరువా రూపంలో ఎకరానికి బస్తా ధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. దీనిపై అప్పట్లోనే రైతులు రహదారులపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇక నీటితీరువాను తప్పకుండా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పదివేల రూపాయలకుపైగా విలువైన సెల్ఫోన్లపై వ్యాట్‌ను 14.5 శాతానికి పెంచాలని వాణిజ్యపన్నుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం సెల్ఫోన్లపై వ్యాట్ ఐదు శాతం మాత్రమే ఉంది. మరోపక్క గనులు, అటవీరంగాల ద్వారా పన్నేతర ఆదాయం పెంచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సేవలకు సర్వీసు చార్జీలను వేయాలని భావిస్తోంది పన్నేతర ఆదాయం పెంచుకోవడానికి కేపీఎంజీ కన్సల్టెంట్.. ప్రభుత్వశాఖల కార్యకలాపాల వివరాలను కోరింది. కేపీఎంజీ ఏయే కార్యకలాపాల ద్వారా ఎంతెంత ఆదాయం పెంచుకోవచ్చో సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రభుత్వం చేయాల్సింది ఆర్భాటపు వ్యయాన్ని తగ్గించుకోవాలని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
పన్నుల విధానం క్రమబద్ధీకరిస్తాం: తలసాని
వాణిజ్యపన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా బాధ్యతల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖను అన్ని విధాలా పటిష్టం చేసి తెలంగాణ రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తానని వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సచివాలయంలోని డి-బ్లాక్‌లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న వ్యాట్, ఇతర పన్నుల విధానాన్ని పరిశీలించి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పన్నులను క్రమబద్ధీకరించనున్నట్టు చెప్పారు. జీరోవ్యాపారం, తక్కువ పన్ను చెల్లిస్తూ భారీ వ్యాపారాలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. నిఘా విభాగాలకు అదనపు వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించి ఉత్సాహవంతులైన అధికారులను నియమించి పన్ను ఎగవేతను నివారిస్తామని తెలిపారు. పన్నుల వసూళ్లకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు. సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా ఔత్సాహిక సినీ నిర్మాతలను, చిన్న సినిమాలను పోత్సహిస్తామన్నారు. నంది అవార్డులను పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. గ్రేహౌండ్స్ క్యాంటీన్లో సరకులకు పన్ను మినహాయింపు దస్త్రంపై తొలి సంతకం చేశారు. -
‘వ్యాట్’ సవరణపై సభలో 2 బిల్లులు
సాక్షి, హైదరాబాద్: విలువ ఆధారిత పన్ను(వ్యాట్) సవరణకు సంబంధించి రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదం నిమిత్తం ఏపీ ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రతి పాదించింది. ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ సవరణ బిల్లులను సభలో ప్రతిపాదించారు. ఇది ఇప్పటికే ఆర్డినెన్సుగా అమల్లో ఉంది. హాఏపీ విలువ ఆధారిత పన్ను రెండో సవరణ చట్టం - 2014 ఇది విమాన (వైమానిక టర్బైన్) ఇంధనంపై విలువ ఆధారిత పన్నును 16 నుంచి ఒక శాతానికి తగ్గించేందుకు సంబంధించిన బిల్లు. విమాన ఇంధనంపై వ్యాట్‌ను ఒక శాతంగా అమలు చేస్తూ ప్రభుత్వం గత సెప్టెంబరు 20వ తేదీ ఆర్డినెన్సు తెచ్చింది. అసెంబ్లీ ఆమోదానికి బిల్లును పెట్టారు. హాఏపీ విలువ ఆధారిత పన్ను సవరణ చట్టం - 2014 నెలవారీ వ్యాట్ కింద రిటర్నులు సమర్పించే సమయంలోనే డీలర్లు సరుకుల అమ్మకాలు, కొనుగోలు బిల్లులు కూడా సమర్పించాలని ఈ బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. సరుకులను రవాణా చేసే వాహనంలో ఇన్వాయిస్/ డెలివరీ చలానులతోపాటు వే బిల్లులను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని కంప్యూటరీకరించాలి. దీనివల్ల చెక్‌పోస్టుల్లో ఆన్లైన్ ద్వారా రసీదులు, సరుకులను తేలిగ్గా సరిచూడవచ్చు. పన్ను ఎగవేత, జీరో ట్యాక్స్ కట్టడిలో భాగంగానే ఈ సవరణ బిల్లును ప్రతిపాదించినట్లు ప్రభుత్వం పేర్కొంది.