ఆదాయమార్గాలపై ప్రభుత్వం కసరత్తు
- నీటి తీరువా వసూళ్లు
- సెల్‌ఫోన్లపై వ్యాట్ పెంపు
- సర్వీసు చార్జీలు వాత
సాక్షి, హైదరాబాద్: ఆదాయ వనరులను పెంచుకోవడానికి రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేయడం, పదివేల రూపాయలకుపైగా ఖరీదైన సెల్‌ఫోన్లపై వ్యాట్ పెంచటం, ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలపై సర్వీసు చార్జీల రూపంలో నిర్వహణ వ్యయాన్ని రాబట్టడంపై దృష్టి సారించింది.
రైతులకు ప్రాజెక్టుల కింద భూములకు సాగునీరు ఇస్తున్నందున ఆ ప్రాజెక్టుల నిర్వహణ వ్యయాన్ని నీటి తీరువా రూపంలో రాబట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నీటి తీరువా ఉన్నప్పటికీ రైతుల నుంచి వసూళ్లపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించలేదు. గతంలో చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా నీటి తీరువా రూపంలో ఎకరానికి బస్తా ధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. దీనిపై అప్పట్లోనే రైతులు రహదారులపైకి వచ్చి ఆందోళనలు చేశారు.
ఇక నీటితీరువాను తప్పకుండా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పదివేల రూపాయలకుపైగా విలువైన సెల్‌ఫోన్లపై వ్యాట్‌ను 14.5 శాతానికి పెంచాలని వాణిజ్యపన్నుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం సెల్‌ఫోన్లపై వ్యాట్ ఐదు శాతం మాత్రమే ఉంది. మరోపక్క గనులు, అటవీరంగాల ద్వారా పన్నేతర ఆదాయం పెంచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సేవలకు సర్వీసు చార్జీలను వేయాలని భావిస్తోంది
పన్నేతర ఆదాయం పెంచుకోవడానికి కేపీఎంజీ కన్సల్టెంట్.. ప్రభుత్వశాఖల కార్యకలాపాల వివరాలను కోరింది. కేపీఎంజీ ఏయే కార్యకలాపాల ద్వారా ఎంతెంత ఆదాయం పెంచుకోవచ్చో సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రభుత్వం చేయాల్సింది ఆర్భాటపు వ్యయాన్ని తగ్గించుకోవాలని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.