పన్నుల విధానం క్రమబద్ధీకరిస్తాం: తలసాని
- వాణిజ్యపన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖను అన్ని విధాలా పటిష్టం చేసి తెలంగాణ రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తానని వాణిజ్య పన్నులు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం సచివాలయంలోని డి-బ్లాక్‌లో ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న వ్యాట్, ఇతర పన్నుల విధానాన్ని పరిశీలించి ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పన్నులను క్రమబద్ధీకరించనున్నట్టు చెప్పారు.
జీరోవ్యాపారం, తక్కువ పన్ను చెల్లిస్తూ భారీ వ్యాపారాలు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. నిఘా విభాగాలకు అదనపు వాహనాలు, ఇతర సదుపాయాలు కల్పించి ఉత్సాహవంతులైన అధికారులను నియమించి పన్ను ఎగవేతను నివారిస్తామని తెలిపారు. పన్నుల వసూళ్లకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు.
సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా ఔత్సాహిక సినీ నిర్మాతలను, చిన్న సినిమాలను పోత్సహిస్తామన్నారు. నంది అవార్డులను పునరుద్ధరిస్తామని మంత్రి చెప్పారు. గ్రేహౌండ్స్ క్యాంటీన్‌లో సరకులకు పన్ను మినహాయింపు దస్త్రంపై తొలి సంతకం చేశారు.