
ఎం.సాయికృష్ణ, టిఎస్.విజయ్‌కుమార్, సాయినాద్‌రెడ్డి, లిఖిత్‌కుమార్
ఉప్పల్/ నాగోల్: ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ–1 స్కూల్ విద్యార్థులు నలుగురు అదృశ్యం తీవ్ర కలకలం సృష్టించింది. వారు గోవాలో ప్రత్యక్షం కావడంతో తల్లిదండ్రులు, స్థానిక పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు... ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... ఉప్పల్ లక్ష్మారెడ్డి కాలనీలో నివాసం ఉండే సోమయ్య కేంద్రీయ విద్యాలయంలో ఉపాధ్యాయుడు. ఆయన బుధవారం ఆయన ఉప్పల్ ఠాణాకు వచ్చి... ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ–1 స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న తన కుమారుడు టీఎస్ విజయ్‌కుమార్ (14), మరో విద్యార్థి ఎన్.సాయికృష్ణ (14) మంగళవారం పాఠశాలకు వెళ్లి ఇప్పటి వరకు ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదు చేశాడు.
ఎల్బీనగర్ ఠాణాలో మరో ఫిర్యాదు...
ఇది విధంగా ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్న తమ కుమారులు సాయినాథ్‌రెడ్డి (13), లిఖిత్‌కుమార్ (14) అదృశ్యమయ్యారని శివగంగకాలనీ నివాసి తేర మణిపాల్‌రెడ్డి, బండ్లగూడ ఇంద్రప్రస్థకాలనీ నివాసి గోపాల్ ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు పోలీస్‌స్టేషన్ల అధికారులు దర్యాప్తు చేపట్టారు. కాగా, సోమయ్య ఫిర్యాదుతో అప్రమత్తమైన ఉప్పల్ పోలీసులు విజయ్‌కుమార్ వద్ద ఉన్న సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా గోవాలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. గోవా పోలీసులు నలుగురు బాలురు ఆచూకీ కనుగొన్నారు.
వారిని తమ సమక్షంలో ఉంచుకున్నారు. చిన్నారులను నగరానికి తీసుకొచ్చేందుకు ఉప్పల్ పోలీసులు తమ సిబ్బందిని గోవాకు పంపారు. కాగా, పై నలుగురు విద్యార్థులు 23, 24 తేదీల్లో అసలు పాఠశాలకే రాలేదని తేల్చిచెప్పారు. జల్సా చేసేందుకే నలుగురు విద్యార్థులు గోవా వెళ్లినట్టు తెలుస్తోంది.