సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదుగురు విద్యార్థుల్ని తమ ఆస్పత్రిలో చేర్చారని, అందులో ముగ్గురికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశామని ఉప్పల్ ఆదిత్య ఆస్పత్రి డాక్టర్ బాలాజీ తెలిపారు. గాయపడిన మిగతా ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి భుజానికి గాయమైందని, అతన్ని రెండురోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మరో విద్యార్థి జనరల్ వార్డులో ఉన్నాడని, సాయంత్రం అతన్ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతిచెందగా.. ఏడుగురు గాయపడిన సంగతి తెలిసిందే. విద్యార్థులతో స్కూల్ కి వెళ్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఇక, ప్రమాదంలో మృతిచెందిన అవంత్‌కుమార్ తల్లిదండ్రులు, బంధువులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. లారీ ఓనర్‌ను కూడా అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నో పర్మిట్ సమయంలో లారీలు తిరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు మృతితో అవంత్ అవంత్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తన కొడుకు చాలా తెలివైనవాడని, ఉన్నత చదువులు చదవాలని అనుకున్నాడని తండ్రి సంతోష్ కన్నీరుమున్నీరవుతూ మీడియాకు తెలిపారు. ఈ దారుణమైన రోడ్డుప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment