Little Flower School
-
VVS Laxman: క్రీడలపై మక్కువతోనే క్రికెటర్‌నయ్యా..
అబిడ్స్:చిన్నప్పటి నుంచే అభిరుచికి అనుగుణంగా రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన బౌలింగ్ మిషిన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ షజాన్ అంటోనితో కలిసి ప్రారంభించారు. అనంతరం వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. లిటిల్ ఫ్లవర్ స్కూల్లో చదవడం తన అదృష్టమన్నారు. చిన్నప్పుడే స్కూల్లో విద్యతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నందుకే అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్‌గా ఎదిగానన్నారు. తన తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అయినా చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, అందుకే క్రికెట్ వైపు దృష్టి పెట్టినట్లు చెప్పారు. అనంతరం ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ షజాన్ ఆంటోని మాట్లాడుతూ.. తమ పాఠశాలలో విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, ఇతర రంగాల్లో రాణించేలా తాము ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. వైస్ ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ జాకబ్, అజిత్, రమేష్, బ్రిజ్ మోహన్, పుణ్యవతి, సంపత్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది
-
గాయపడిన విద్యార్థులకు ప్రాణాపాయం లేదు!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదుగురు విద్యార్థుల్ని తమ ఆస్పత్రిలో చేర్చారని, అందులో ముగ్గురికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశామని ఉప్పల్ ఆదిత్య ఆస్పత్రి డాక్టర్ బాలాజీ తెలిపారు. గాయపడిన మిగతా ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి భుజానికి గాయమైందని, అతన్ని రెండురోజులు అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. మరో విద్యార్థి జనరల్ వార్డులో ఉన్నాడని, సాయంత్రం అతన్ని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక విద్యార్థి మృతిచెందగా.. ఏడుగురు గాయపడిన సంగతి తెలిసిందే. విద్యార్థులతో స్కూల్ కి వెళ్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇక, ప్రమాదంలో మృతిచెందిన అవంత్‌కుమార్ తల్లిదండ్రులు, బంధువులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా.. లారీ ఓనర్‌ను కూడా అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నో పర్మిట్ సమయంలో లారీలు తిరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కొడుకు మృతితో అవంత్ అవంత్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తన కొడుకు చాలా తెలివైనవాడని, ఉన్నత చదువులు చదవాలని అనుకున్నాడని తండ్రి సంతోష్ కన్నీరుమున్నీరవుతూ మీడియాకు తెలిపారు. ఈ దారుణమైన రోడ్డుప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆటోను ఢీకొట్టిన లారీ,విద్యార్ధి మృతి
-
ఉప్పల్‌లో ఘోర రోడ్డుప్రమాదం
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో స్కూల్ కి వెళ్తున్న ఆటోను వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మరో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో ఘటనాస్థలంలో బీభత్సకరమైన దృశ్యాలు చోటుచేసుకున్నాయి. చిన్నారుల ఆక్రందనలు, హాహాకారాలు అక్కడివారిని కలిచివేశాయి. స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక విద్యార్థి మృతిచెందడం, పలువురు తీవ్రంగా గాయపడటంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. లారీ అత్యంత వేగంగా దూసుకురావడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఏడో తరగతి చదువుతున్న అవంత్‌కుమార్ మృతి చెందాడు. హబ్సిగూడ భాష్యం స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఆటోలో వెళుతుండగా ప్రమాదం బారిన పడ్డారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థి మృతదేహాన్ని గాందీ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సిగ్నల్ ఎవరు జంప్ చేశారు ఉదయం 7.50 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని, ఈ ఘటనలో సిగ్నల్ ఎవరు జంప్ చేశారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని ఏసీపీ నర్సింహారెడ్డి తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఎవరూ తప్పు చేశారనే దానిని పరిశీలిస్తున్నామని తెలిపారు. రోడ్డుప్రమాదంలో తమ కొడుకు మృతితో అవంత్ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. తన కొడుకు చాలా తెలివైనవాడని, ఉన్నత చదువులు చదవాలని అనుకున్నాడని తండ్రి సంతోష్ కన్నీరుమున్నీరవుతూ మీడియాకు తెలిపారు. ఈ దారుణమైన రోడ్డుప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
గురువులను, తల్లిదండ్రులను గౌరవించాలి ; నరసింహన్
సాక్షి, హైదరాబాద్ : ప్రతి విద్యార్థి చదువు చెప్పే గురువులను, కని పెంచిన తల్లిదండ్రులను గౌరవించాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సూచించారు. మంగళవారం అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలకు వెళ్లిన ఆయన అక్కడ పిల్లలతో సరదాగా గడిపారు. విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు అడిగిన ప్రశ్నలకు గవర్నర్ సమాధానం చెప్పారు. తాను కూడా లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 5వ తరగతి వరకు చదువుకున్నానని తెలిపారు. చదువుకున్న స్కూల్‌కు గవర్నరు హోదాలో రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. జీవితంలో తన అనుభవాలను తాను చదువుకున్న స్కూల్ విద్యార్థులతో పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. జీవితంలో డబ్బులు ముఖ్యం కాదని, చదువు మాత్రమే ముఖ్యమని.. ఆ దిశలో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. -
ప్రైవేటు స్కూళ్ల ఆగడాలు ఎక్కువయ్యాయ్
హైదరాబాద్: కవాడిగూడలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ దగ్గర పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని ప్రైవేట్ స్కూళ్ల ఆగడాలు ఎక్కువ అయ్యాయని విమర్శించారు. ఇష్టారీతిగా ఫీజులు వసూలు చేస్తున్నారు తప్ప విద్యార్థుల బాగోగులు చూసే మేనేజెంట్లు లేవని మండిపడ్డారు. ఫీజు కట్టలేదని యాజమాన్యం, స్కూల్‌కు ఎందుకు వెళ్లలేదని తండ్రి రెండింటి మధ్య పిల్లలు నలిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు యాజమాన్యాలకు వంత పాడుతున్నారని ఆరోపించారు. యాజమాన్యాల దగ్గర పోలీసులు డబ్బులు దండుకుని..కేసులను తప్పు దోవ పట్టిస్తున్నారని చెప్పారు. స్కూళ్లల్లో మౌలిక సదుపాయాలు సరిగా ఉండటం లేదని, ఇందులో బాలికల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. చేతగాని ప్రభుత్వం, స్కూళ్లల్లో ఇన్ని దారుణాలు జరుగుతున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని, ఫీజులు ఇష్టారీతిన పెంచుకుంటూ పోతున్నా ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కవాడీగూడ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అధ్వాన్నపరిస్థితి నెలకొందని వెల్లడించారు. నగరంలో జరిగేది ఒకటి కేంద్ర ప్రభుత్వానికి మునిసిపల్ శాఖ మంత్రి ఇచ్చే నివేదిక మరోలా ఉందని మండిపడ్డారు. ప్రైవేట్ యాజమాన్యాల ఆగడాలు అరికట్టకపోతే పేరెంట్స్ అసోసియేషన్ తరుపున రాబోయే రోజున మరింత ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. -
పిల్లల కోసం సాహసం!
ప్రస్తుతం చెన్నై అంతా అల్లక ల్లోలంగా ఉన్న సంగతి తెలిసిందే. తుపాను కారణంగా అక్కడి రహదారులు జలమయమయ్యాయి. జనాలు బయటికి రాలేని పరిస్థితి. కొన్ని ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొంతమంది ఎక్కడికెళ్లాలో తెలియక ఉన్న చోటే ఇరుక్కుపోయారు. అక్కడికి రాకపోకలు కూడా కష్టమవుతున్నాయ్. అలాంటివాటిలో నుంగంబాక్కంలోని ‘లిటిల్ ఫ్లవర్ స్కూల్’ ఒకటి ఉంది. మూగ, చెవిటి, అంధ బాల బాలికలకు చెందిన స్కూల్ అది. అన్నపానీయాలు లేని పరిస్థితిలో అక్కడి పిల్లలు దయనీయ స్థితిలో ఉన్నారు. ఈ విషయం ఫేస్బుక్ ద్వారా, రేడియో ద్వారా బయటికొచ్చింది. ఆ స్కూల్‌కు మోకాళ్లు లోతు నీటిలో కొంతదూరం నడుచుకుంటూ వెళ్లి, ఆ తర్వాత పడవలో వెళ్లాలి. రిస్క్‌తో కూడుకున్నదే. అయినా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా తెగించారు. ఆహార పదార్థాలు తీసుకుని వ్యయప్రయాసలకోర్చి ఆ స్కూల్‌కి చేరుకున్నారు. పిల్లలందరికీ ఫుడ్ బాక్సులను అందజేశారు. ఆకలి తీరుతోందన్న ఆనందం ఓవైపు, స్వయంగా ఇళయరాజా వచ్చారన్న ఆనందం మరోవైపు.. ఆ పిల్లలను కన్నీటి పర్యంతం చేసింది. చూపు లేని పిల్లలు రాజా సార్‌ని చేతులతో ఆప్యాయంగా తడిమారు. చేతులను ముద్దాడారు. కాళ్లకు నమస్కారం చేశారు. చిన్నారుల స్పర్శకు ఇళయరాజా ఉద్వేగానికి లోనయ్యారు. అప్పటికప్పుడు వాళ్ల కోసం భక్తి పాటలు పాడారు. ‘‘మీ ప్రార్థనలను దేవుడు వింటున్నాడు. భయపడకండి’ అని పిల్లలకూ, ఆ స్కూల్‌కి చెందిన సిస్టర్స్‌కు ధైర్యం చెప్పారు. ఇళయరాజా వయసు 72. ఈ వయసులో మోకాళ్ల లోతు నీళ్లల్లో నడుచుకుంటూ వెళ్లడం, పడవ ప్రయాణాలు చేయడం రిస్కే. పిల్లల కోసం ఆయన ఈ సాహసం చేశారు. రాజా సార్ సో గ్రేట్ కదూ.