అబిడ్స్:చిన్నప్పటి నుంచే అభిరుచికి అనుగుణంగా రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఆదివారం నూతనంగా ఏర్పాటు చేసిన బౌలింగ్ మిషిన్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ షజాన్ అంటోనితో కలిసి ప్రారంభించారు. అనంతరం వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో చదవడం తన అదృష్టమన్నారు. చిన్నప్పుడే స్కూల్‌లో విద్యతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నందుకే అంతర్జాతీయ స్థాయిలో క్రికెటర్‌గా ఎదిగానన్నారు.
తన తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లు అయినా చిన్ననాటి నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, అందుకే క్రికెట్ వైపు దృష్టి పెట్టినట్లు చెప్పారు. అనంతరం ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ షజాన్ ఆంటోని మాట్లాడుతూ.. తమ పాఠశాలలో విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, ఇతర రంగాల్లో రాణించేలా తాము ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. వైస్ ప్రిన్సిపల్ రేవ్ బ్రదర్ జాకబ్, అజిత్, రమేష్, బ్రిజ్ మోహన్, పుణ్యవతి, సంపత్, అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment