
వైభవంగా చక్రస్నానం
కడప కల్చరల్ : దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు ఆదివారం వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి మండపానికి చేర్చారు. అక్కడ రెండున్నర గంటలపాటు వేద మంత్ర యుక్తంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. చందన లేపనం, నారికేళ జలాభిషేకం నిర్వహించారు. ఆలయ ఏఈఓ శంకర్‌రాజు, డిప్యూటీ ఈఓ సుబ్రమణ్యంల ఆధ్వర్యంలో తిరుమల వేద పండితులు శ్రీనివాసాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు మచ్చా శేషాచార్యులు, మయూరం కృష్ణమోహన్, త్రివిక్రమ్, కృష్ణమూర్తి తదితరులు పాలు, పెరుగు, తేనె, జలాలతో ప్రత్యేకంగా అభిషేకం చేశారు. అనంతరం ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో భక్తుల కోలాహలం మధ్య మూలమూర్తులతోసహా అర్చకులు పుష్కరిణిలో మూడు మునకలు వేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ పుష్కరిణిలో మునకలు వేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అలంకరించి ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. స్వామి ప్రత్యేక ప్రసాదంగా ఉత్సవ మూర్తులకు లేపనం చేసిన సుగంధం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.