సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ఆర్కే బీచ్‌లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్‌హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది.
లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్‌లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు.
నేవీ బ్యాండ్‌తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్‌షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్‌భట్ స్వీకరించారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు
విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్‌లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్‌లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్‌భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి
విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది
మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్‌లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్‌నకు.. ఐఎన్‌ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి
Comments
Please login to add a commentAdd a comment