రేపు పతంగుల పండుగ
వరంగల్‌లో మొదటిసారి అంతర్జాతీయ వేడుక
ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వేదికగా సంబరాలు
పాల్గొననున్న 31 దేశాల క్రీడాకారులు
స్టాల్స్, ఫుడ్ కోర్టుల ఏర్పాటు
నేడు నగరంలో హెరిటేజ్ వాక్
హన్మకొండ : వరంగల్‌లో తొలిసారి జరగనున్న అంతర్జాతీయ పతంగుల పండుగకు ఏర్పాట్లు పూర్తికావొచ్చాయి. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వేదికగా మంగళవారం పతంగుల పండగ జరగనుంది. ప్రపంచ పర్యాటకుల దృష్టిని వరంగల్ వైపు ఆకర్షించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈ పండుగ
ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలనే భావనతో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
దేశవిదేశాల క్రీడాకారులు
హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరగనున్న అంతర్జాతీయ పతంగుల పండుగలో 31 దేశాల నుంచి ఔత్సాహిక పంతగుల క్రీడాకారులు పాల్గొననున్నారు. అలాగే, మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పది మంది క్రీడాకారులు హాజరుకానున్నారని అధికారులు తెలిపారు. పతంగుల పండుగ వివరాలు, ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నగరంలో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నారు. ఉదయం 6.30 గంటలకు హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్ నుంచి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానం వరకు ఈ హెరిటేజ్ వాక్ జరగనుంది. అలాగే, మంగళవారం కూడా ఉదయం 6.30 గంటలకు ఖిలా వరంగల్‌లో హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. అనంతరం అల్పాహారం చేశాక పతంగులు ఎగురవేస్తారు. కాగా, పతంగుల పండుగ జరిగే చోట క్రాఫ్ట్ బజార్ ఏర్పాటు చేస్తున్నారు. వరంగల్ జర్రీస్, పెంబర్తి కళాఖండాలు, చేర్యాల నఖాసీ చిత్రాలు, హస్తకళలు, చేనేత ఉత్పత్తులను 30 స్టాళ్లలో అందుబాటులో ఉంచుతారు. వీటితో పాటు పండుగను వీక్షించేందుకు వచ్చే ప్రజల కోసం ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.