కిందకు చూస్తే కళ్లు తిరగడం ఖాయం
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడం కోసం పర్వత శిఖరాగ్రాలపై వినూత్న కట్టడాలను నిర్మించడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. బీజింగ్ నగరానికి కేవలం 43 మైళ్ల దూరంలో వున్న జింగ్‌డాంగ్ స్టోన్ ఫారెస్ట్ వద్ద 1300 అడుగుల అతిపెద్ద లోయను పర్యాటకులు ప్రత్యక్షంగా వీక్షించడం కోసం వృత్తాకారంలో 4,467 చదరపు అడుగుల విస్తీర్ణంగల గ్లాస్ ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అతి పొడవైనఈ నిర్మాణాన్ని పర్యాటకుల వీక్షణ కోసం గతవారమే ప్రారంభించింది.
పర్వత శిఖరాగ్రానికి ఏటవాలుగా 107 అడుగుల దూరంలో ఏర్పాటుచేసిన ఈ గ్లాస్ ప్లాట్‌ఫామ్ అమెరికాలోని గ్రాండ్ కాన్యన్‌లో ఉన్న 37 అడుగుల గ్యాస్ వ్యూయింగ్ ప్లాట్‌ఫామ్‌కన్నా పెద్దది. ఈ సరికొత్త గ్లాస్ ప్లాట్‌ఫామ్ మూడు ప్రపంచ రికార్డులను నెలకొల్పిందని చైనా పర్యాటక శాఖ ప్రకటించింది. ఇది ప్రపంచంలో అతిపెద్దదే కాకుండా అతి పొడవైన గ్లాస్ ప్లాట్‌ఫామ్. అంతేకాకుండా విమానయాన పరిశ్రమలో ఉపయోగించే టైటానియంతో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి.
టైటానియం ఎంతో తేలికగా ఉండడంతోపాటు ఎంతో మన్నికైంది. పర్యాటకుల రక్షణకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని, అందుకనే టైటానియంను ఉపయోగించామని చైనా అధికారులు తెలిపారు. గత ఆదివారం దీన్ని ప్రారంభించినప్పుడు తొలి సందర్శకులు దీనిపైకి వెళ్లేందుకు ఎంతో భయపడ్డారని, ఆ తర్వాత ఎంతో థ్రిల్ ఫీలయ్యారని వారు చెప్పారు.