నవంబర్ 5-7 వరకు లండన్‌లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (WTM)లో భారతదేశం పాల్గొంటుంది.ఇన్‌బౌండ్ టూరిజంను మెరుగుపరచడం , దేశాన్ని ప్రధాన ప్రపంచ ప్రయాణ గమ్యస్థానంగా ఉంచడం లక్ష్యంగా ఇందులో పాల్గొంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ఇన్‌బౌండ్ టూర్ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , భారతీయ టూరిస్ట్ పరిశ్రమకు చెందిన హోటళ్లతో సహా దాదాపు 50 మంది వాటాదారుల ప్రతినిధి బృందంతో WTMలో పాల్గొంటున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇందులో భాగంగానే ఇన్క్రెడిబుల్ ఇండియా స్టాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో యూకేలో భారత హై కమీషనర్ విక్రమ్ దురై స్వామి, కేంద్ర పర్యాటక శాఖ డీజీ ముగ్ధ సిన్హాతో కలిసి తెలంగాణా ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా లండన్ టీ ఎక్స్చేంజ్ చైర్మన్ తో మంత్రి భేటీ అయ్యారు.
తెలంగాణ పర్యాటక రంగంలో పెట్టుబడులు, హైదరాబాద్ లో టీ ఎక్స్చేంజ్ ఔట్లెట్, లండన్ ఐ తరహాలో ఐకానిక్ జాయింట్ వీల్ ఏర్పాటుపై చర్చించారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణామోహన్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, డా.వంశీ కృష్ణ, డా. రాజేష్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment