సాహసం... సుందర వీక్షణం... | Excellent Areas for Summer excursion | Sakshi
Sakshi News home page

సాహసం... సుందర వీక్షణం...

Published Fri, Apr 24 2015 1:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

సాహసం...  సుందర వీక్షణం...

సాహసం... సుందర వీక్షణం...

మబ్బులను చేత్తో అందుకోవాలి.. మంచులో జారుతూ సాగిపోవాలి.. ఎత్తై కొండలను అధిరోహించాలి.. లోతైన లోయల  సౌందర్యాన్ని వీక్షించాలి.. వాహనమే లేని చోట గుర్రపు స్వారీ చేయాలి.. తేయాకు తోటల్లో విహరించాలి. ఈ వేసవి విహారంలో ఓ కొత్త అనుభూతిని పొందడానికి మన దేశంలోనే ఎన్నో అరుదైన, అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి...
 
ముస్సోరీలో ట్రెక్కింగ్
కొండ ప్రాంతాలలో సుదీర్ఘమైన నడకను ఓ సాహసకృత్యంగా పర్యాటకులు భావిస్తారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా ముస్సోరీలో ట్రెక్కింగ్‌కు వెళ్ళిన పర్యాటకులు మర్చిపోలేని అనుభూతిని వెంటమోసుకెళతారు. హిమాలయ పర్వతాల్లో ఎత్తై హిల్ స్టేషన్ ముస్సోరీ. మీ వేసవి సెలవులకు ఇది సరైన వేదిక. ఎంతోమంది ప్రముఖ రాజకీయవేత్తలు సైతం తమ కుటుంబా లతో ఇక్కడ ఆనందపుటంచుల్లో విహరించినవారే! భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు ఈ ప్రాంతం రెండవ ఇల్లుగా ఉండేది.

రస్కిన్ బాండ్ అనే ప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని తన రచనల్లో కళ్లకు కట్టారు. దారి పొడవునా పైన్ వృక్షాలు, పెద్ద పెద్ద జలపాతాలు, సుగంధాలను వెదజల్లే చందనపు వృక్షాలు.. ఇక్కడ ప్రకృతి సోయగానికి చూపుతిప్పుకోలేరు. ఈ పొడవైన దారిలో ట్రెక్కింగ్‌కి వెళ్లేవారు 400 ఎకరాలలో వన్యప్రాణులకు నిలయమైన ‘క్లౌడ్ ఎండ్ ఎస్టేట్’ను కూడా సందర్శించవచ్చు. ఇదో ప్రైవేట్ ఎస్టేట్. ఇక్కడ అరుదైన పక్షులను తిలకించవచ్చు.

వసతి సౌకర్యం పొందాలంటే మాత్రం ‘వెర్మొంట్ ఎస్టేట్’లో పాత విల్లాలున్నాయి. ఇందులో ఇద్దరికి (రోజుకు) రూ.8,500కు వసతి లభిస్తుంది.ఢిల్లీ నుంచి 8 గంటలు ప్రయాణించి ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ పట్టణానికి చేరుకొని, అక్కడ నుంచి కొండలలో రాణిగా పిలవబడే ముస్సోరీకి వెళ్లాలి.  ఢిల్లీ నుంచి ముస్సోరీకి రెండు గంటలు పట్టే ఈ దూరానికి టాక్సీలో బయల్దేరాలంటే (ఒకరికి) రూ.4,700 లు ఖర్చు అవుతుంది.
 
సాహసవీరులకు గుల్‌మార్గ్...
హిమాలయ పర్వతాల్లో నునుపైన మంచుకొండల మీదనుంచి జారిపోతూ, గాలిలో తేలిపోతూ ఆకాశమే హద్దుగా ప్రపంచ పర్యాటకులు రెచ్చిపోయే ప్రదేశం గుల్‌మార్గ్. కాశ్మీర్ లోయల్లోని గుల్‌మార్గ్ గగనవీధుల్లో ఒకరోజంతా రోప్‌వేలో తేలిపోవాలంటే (ఒకరికి) రూ.2,500 ఖర్చు అవుతుంది. మొదటిసారి ‘స్కయింగ్’ కోర్సు తీసుకోవాలనుకుంటే మాత్రం రూ.5,000 చెల్లించాలి.

ఇక్కడ పర్యాటకుల వసతి కోసం కొత్త కొత్త హోటళ్లు వెలిశాయి. గుల్‌మార్గ్‌లో ముందస్తు వసతి సదుపాయం పొందాలంటే జెకెటిడిసి (జమ్ముకాశ్మీర్) పర్యాటకశాఖ వారి ఫోన్ నెంబర్లు: +91 09419708180, +9101 954254487, 254439. గుల్‌మార్గ్‌లోని హె ఖైబర్ హిమాలయన్ రిసార్ట్, స్పా ఫోన్ నెంబర్: +91-1954254666.Email : reservations@khyberhotels.com శ్రీనగర్ నుంచి గుల్‌మార్గ్ చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది. షాహ్ ట్రావెల్స్‌లో ఒకరికి, ఒక వైపు ప్రయాణానికి రూ.2,500 ఖర్చు అవుతుంది. గైడ్స్ కూడా అందుబాటులో ఉంటారు.
 
బిర్‌లో గగన విహారం...
మబ్బులను అందుకునేంత ఎత్తులో విహరించాలని ఉందా! అయితే, హిమాచల్ ప్రదేశ్‌లోని దౌలధర్ కొండల్లోని ‘బిర్’ ప్రాంతానికి వెళ్లాలి. జీవావరణ, సాహసవిన్యాసాల పర్యటనకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడ భూమి నుంచి 11,500 అడుగుల ఎత్తులో పారాచూట్ (పారాగ్లైడింగ్)లో విహరిస్తూ మబ్బులను అందుకోవచ్చు. సుశిక్షితులైన నిపుణుల పర్యవేక్షణలో ఈ గగన విహారపు అనుభూతిని ఆసాంతం పొందవచ్చు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని, కొండల అంచులను, లోయలనూ వీక్షించవచ్చు.

పశ్చిమ హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో ‘బిర్’ ఒక గ్రామం. ఇక్క టిబెట్ దేశ శరణార్థులు, బౌద్ధ స్థూపాలను చూడవచ్చు. పారాచూట్ విహారానికి తగిన సామాగ్రిని పిజి-గురుకుల్ వారు అమర్చుతున్నారు. ఒకసారి విహరించడానికి రూ.2,000 ఖర్చు అవుతుంది. దీనికి తగిన శిక్షణ ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది.

బిర్‌బిల్లింగ్ నుంచి చండీగడ్‌కు పారాచూట్‌లో నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలోనే ‘కొలనెల్స్ రిసార్ట్’ ఉంది. ఇందులో ఇద్దరు బస చేయడానికి రూ.2,500 ఖర్చు అవుతుంది. ఈ ప్రాంతంలో టిబెటన్ కాలనీలో ఇళ్లతో పాటు, స్థానిక సంస్కృతి, టిబెటన్ హస్తకళల కేంద్రం, టిబెటన్ పిల్లల గ్రామీణ పాఠశాల, వైద్య, జ్యోతిశ్శాస్త్ర కేంద్రాలను సందర్శించవచ్చు.ఢిల్లీ నుంచి కంగ్రా వ్యాలీ.. అటు నుంచి అహ్జుకు టాయ్ ట్రైన్ సౌకర్యం ఉంది. అక్కడి నుంచి బిర్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం.
 
ప్రకృతి ప్రేమికులకు కూనూరు...
నీలగిరి పర్వతశ్రేణులు, తేయాకు తోటలు, దగ్గరలో ఊటీ పచ్చ సోయగం కూనూరుకు వెళ్లినవారి కనులకు విందుచేస్తాయి. సేంద్రీయ పద్ధతులతో పండించిన తాజా ఆహారపదార్థాలను ఇక్కడ కడుపారా ఆరగించవచ్చు. కూనూరు నుంచి ఊటీ వెళ్లేదారిలో నీలగిరి మౌంటెయిన్ రైల్వేలో విహరిస్తూ ఆ ఆహ్లాదాన్ని పొందవచ్చు. కూనూరుకు దగ్గరలో అతిపెద్ద తేయాకు పరిశ్రమ, డాల్ఫిన్స్ నోస్, లాంబ్స్ రాక్, టైగర్ హిల్, డ్రూగ్ ఫోర్ట్, సిమ్స్ పార్ట్, ర్యాలీ డ్యామ్, లాస్ జలపాతం, గోల్ఫ్‌కోర్స్.. వంటివెన్నో సందర్శించదగ్గవి.

► కోయంబత్తూరులో విమానాశ్రయం ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా కోయంబత్తూర్‌కు చేరుకోవచ్చు.
► కోయంబత్తూర్, చెన్నైలకు హైదరాబాద్ నుంచి రైలు సదుపాయం ఉంది.
► రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బెంగళూర్ 870 కి.మీ., అటు నుంచి కొడెకైనాల్ 256 కి.మీ., అటునుంచి కోయంబత్తూరు 104 కి.మీ.

విదేశాలకు వెళుతున్నారా?
 ట్రావెల్ ఇన్స్యూరెన్స్, క్రెడిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్, ట్రావెలర్స్ చెక్... ఇవి ఉన్నాయా అనేది తప్పనిసరిగా సరిచూసుకోండి.

ట్రావెలర్స్ చెక్స్ ఎందుకంటే... నగదు రూపంలో డబ్బు వెంట ఉంటే దారిలో పోవచ్చు. దొంగిలించబడవచ్చు. ఈ సమస్య ఎదురుకాకుండా విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ‘ట్రావెల్స్ చెక్స్’ అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడైనా ఈ చెక్స్ పోయినా, సదరు సంస్థకు ఫోన్ చేసి నెంబర్‌ను రద్దు చేసుకోవచ్చు. ట్రావెల్‌చెక్స్ ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునే సదుపాయముంది.   క్రెడిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్ తీసుకోండి... విదేశాలలో క్రెడి ట్ కార్డ్‌ను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డులు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. అంతర్జాతీయంగా ఉపయోగించుకోవడానికి వీలుండే కార్డులు (పరిమితులను బట్టి) ఈ రెండూ. ఈ ప్రీపెయిడ్ కార్డు వినిమయానికి బ్యాంక్ ఛార్జీలు వర్తించవు. ఈ కార్డ్‌ను వెంట తీసుకెళ్లడం సులువు, సురక్షితం కూడా!  

ట్రావెల్ బీమా తప్పనిసరి... కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రయాణికుల కోసం బీమా భద్రత కల్పిస్తుంటాయి. వీటిని ఉపయోగించుకోవడం మేలు. లగేజీ పోయినా, అత్యవసర వైద్యసాయం పొందాలన్నా, ఊహించని ప్రమాదాలు జరిగినా... ఈ బీమా మీకు ధీమా కల్పిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement