ఆ గాలిలో... ఆ నేలలో
టర్కీ వేసవి విహారం
వేసవి విహారంలో ఇప్పటి వరకు మారిషస్, మాల్దీవులకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉండేది. ఆనందపు అంచులను తాకేందుకు ఇవే సరైన ప్రాంతాలుగా పర్యాటకుల మనసుల్లో బాగా నిలిచిపోయాయి. అయితే, ఈ స్థానాన్ని ఇప్పుడు టర్కీ కొట్టేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లే పర్యాటకుల సంఖ్య ఈ వేసవిలో పెరగడమే దీనికి అసలైన ఉదాహరణ. టర్కీ తన దౌత్యకార్యాలయాన్ని ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభించడంతో ఈ విషయం తేటతెల్లమైంది.
టర్కీలోని చారిత్రాత్మక కట్టడాలు, బీచ్‌లలో రిసార్టులు, ముఖ్యంగా మధ్యధరా సముద్ర తీరప్రాంతాల సందర్శన, అక్కడి సంస్కృతిని తెలుసుకోవడానికి పర్యాటకులు అమితాసక్తి చూపుతున్నారు. అంతేకాదు, ఇతర దేశాలతో పోల్చితే టర్కీలో ఆరోగ్యసంరక్షణ, సౌందర్య పోషణ పద్ధతులు మెరుగ్గా ఉంటాయి. అందుకే స్పా వంటి సౌందర్యకేంద్రాలు ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులతో నిండిపోయి ఉంటాయి. ప్రపంచంలో పేరెన్నికగన్న పది పర్యాటక స్థలాలూ ఈ దేశంలోనే ఉండి, పర్యాటకుల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నాయి.
వేసవి ప్యాకేజీల హడావిడి...
‘‘ఇటీవల వేసవి టూర్ బుకింగ్స్ గమనిస్తే పదిరోజుల టర్కీ ప్యాకేజీని 30-40 శాతం మంది పర్యాటకులు ఇప్పటికే బుక్ చేసుకొని ఉన్నారు. ఇప్పటి వరకు టర్కీ వెళ్లడానికి వీసా బుకింగ్ కోసం ముంబయ్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా వీసా సదుపాయం కల్పిస్తూ హైదరాబాద్‌లో టర్కీ కాన్సులేట్‌ను ప్రారంభించడంతో పర్యాటకులకు మరింత సౌలభ్యంగా మారింది’’ అని బషీర్‌బాగ్‌లోని ట్రావెల్ ఏజెంట్ రషీద్ తెలిపారు.
‘‘ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి ప్రతి వేసవిలో టర్కీకి 150 బుకింగ్స్ ఉండేవి. ఈ వేసవికి ఇప్పటికే 500కు పైగా బుకింగ్స్ వచ్చాయి’’ అని కాక్స్ అండ్ కింగ్స్‌కు చెందిన శివమ్ శర్మ తెలిపారు. ‘‘టర్కీ ప్యాకేజీకి నాల్గు రాత్రులు, ఐదు పగళ్లకు గాను రూ.60,000. ప్రీమియమ్ ప్యాకేజ్ అయితే రూ.2 లక్షలు’’ అని శర్మ తెలిపారు. థామస్‌కుక్ ట్రావెల్ ఏజెన్సీ నాల్గు టర్కీ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. 6 రాత్రులు, 7 పగళ్లు టర్కీ సమ్మర్ ప్యాకేజీ ఒకరికి రూ.98,760లు ఉండగా, 8 రాత్రుళ్లు, 9 పగళ్లకు రూ.89,953లు, వారాంతపు ప్యాకేజీ అంటే 4 రాత్రులు, 5 పగళ్లకు రూ. 27,820లు, క్రూయిజ్ ప్యాకేజీ అయితే లక్షా యాభై వేల రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. మేక్‌మై ట్రిప్.కామ్ రూ.45 వేల నుంచి లక్షా యాభైవేల రూపాయల వరకు ఈ నెల 23, 25 తేదీలలో, వచ్చే నెల 3, 7 తేదీలకు బుకింగ్స్‌ను అందుబాటులో ఉంచింది.
ప్రధాన ఆకర్షణీయ స్థలాలు ఇవే...
ఇటు ఆసియాలోనూ అటు యూరోప్‌లోనూ విస్తరించి ఉన్న దేశం టర్కీ. అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీగా వ్యవహరిస్తారు. రెండు ఖండాల మధ్య ఉండటం వల్ల ఇరువైపుల సంస్కృతి టర్కీలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకృతి సిద్ధ సందర్శనీయ స్థలాలు, చారిత్రక సౌరభాలు, విశాలమైన గడ్డి మైదానాలు, అబ్బురపరిచే సంస్కృతి, ఘుమఘుమల వంటకాలకు... టర్కీ పెట్టింది పేరు. సముద్ర తీరప్రాంతాలు, ఎత్తై పర్వత సానువులు ఈ ప్రాంతాన్ని హైలైట్‌గా నిలుపుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇస్తాంబుల్ పట్టణం ఒక్కటే ఈ దేశానికి ప్రధాన ఆకర్షణీయ కేంద్రంగా చెప్పవచ్చు. గగన విహారాన్ని అందించే కప్పడోసియా, పాముక్కలే కూడా ఈ దేశ పర్యాటకరంగాన్ని ముందంజలో ఉండేలా చేస్తున్నాయి.
హగియా సోఫియా...
ప్రపంచంలో అత్యంత అందమైన భవనాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది హగియా సోఫియా మ్యూజియం. టర్కీ రాజధాని అంకారా అయినా అతి పెద్ద నగరం మాత్రం ఇస్తాంబుల్. ఈ నగరంలో ప్రధాన పర్యాటక ప్రదేశాలలో హగియా సోఫియా మ్యూజియం చూసి తీరవల్సిన సందర్శనీయ ప్రాంతం.
పాలరాతి వైభవం... ఎఫెసుస్...
పాలరాతి స్తంభాలు, భారీ కట్టడాలు, రహదారులు గల నగరం ఎఫెసుస్. ఇక్కడ చారిత్రక కట్టడాలే కాదు రహదారులు కూడా మార్బుల్‌తో తళతళలాడుతుంటాయి. రోమన్ చక్రవర్తుల కాలంలో స్వర్ణయుగంగా ఈ నగరాన్ని పేర్కొంటారు. ఇప్పటికీ ఆ పేరును సార్థకం చేసుకుంటోంది ఎఫెసుస్.
గగన విహారం... కప్పడోసియా...
ఇదొక రాతి లోయ. కొండలు.. కోనలు, పర్వతప్రాంతాలు, వంపులు తిరిగిన రోడ్లు.. ఇక్కడ చూపు తిప్పుకోనివ్వవు. గాలి, నీటి చర్య వల్ల అపసవ్యంగా ఏర్పడిన కొండ పై భాగాలు, ఆవాసాలుగా మారిన వైనాలు ఆశ్చర్యానికి లోనుచేస్తుంటాయి. హాట్ ఎయిర్‌బెలూన్‌లో విహరిస్తూ, ఆ అద్భుతాలను కళ్లారా వీక్షించవచ్చు.
సుల్తాన్‌ల స్వర్ణయుగం... టాప్ క్యాప్ ప్యాలెస్...
సుల్తాన్‌ల సుసంపన్నమైన ప్రపంచాన్ని కన్నులారా వీక్షించాలంటే టాప్‌క్యాప్ ప్యాలెస్‌ను సందర్శించాల్సిందే! పశ్చిమ ఆఫ్రికా, ఐరోపాలలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఒట్టొమాన్ నాయకులు చేసిన కృషి ఈ భవనాలలో కనిపిస్తుంది. ఇక్కడ ఒట్టొమాన్ పవర్ బేస్ కూడా చూడదగినది.
ఇవిగాక మరెన్నో...
వీటితో పాటు... నల్లసముద్ర తీర ప్రాంతం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. టర్కీ ఈశాన్య ప్రాంతంలో అతి పొడవైన ప్రయాణంగా ఈ తీరప్రాంతానికి పేరుంది. పురావస్తు పరిశోధనా స్థలంగా పేరుగాంచిన మౌంట్ నెమృత్ నాటి రోజుల్లో దేవతల ప్రాంతంగా పేరొందింది. నెమృత్ పర్వత శిఖరంపైన వాతావరణం, రాతి తలలు మనల్ని వింతలోకంలో విహరింపజేస్తాయి. ‘అనీ’ పట్టణానికి సిల్క్ రోడ్ సిటీ అనే పేరుంది. ఆధునిక టర్కీ సరిహద్దుల్లో గల ఆర్మేనియాకు ఈ పట్టణం 14వ శతాబ్దిలో రాజధానిగా వెలుగొందింది. ఇక్కడ ఎర్రటి ఇటుకతో నిర్మించిన ఇళ్లు ఆకట్టుకుంటాయి. గడ్డిమైదానాలు, సెయింట్ గ్రెగొరీ చర్చి చూసి తీరాల్సిన ప్రదేశాలు.