
దసరా ఉత్సవాల్లా శంకుస్థాపన వేడుకలు
సాక్షి, విజయవాడ బ్యూరో/తాడేపల్లి రూరల్: నూతన రాజధానికి ఈ నెల 22న జరిగే శంకుస్థాపనను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి కమిటీ సభ్యులకు ఆదేశించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జన్మభూమి-మాఊరు కమిటీ సభ్యులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. దసరా నవరాత్రుల మాదిరిగానే ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకూ శంకుస్థాపన వేడుకలను జరపాలని కోరారు. లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో 33ఏ పేరుతో అమరావతి గ్యాలరీ ఇప్పటికీ ఉందని, ఇక్కడ తవ్వకాల్లో దొరికిన స్థూపాలు, బుద్ధుని పాదుకలు, సింహ ప్రతిమలను అందులో భద్రపరిచారని తెలిపారు.
శాతవాహనుల సంస్కృతి, బౌద్ధ బోధనలు, ప్రాచీన సంప్రదాయానికి పుట్టినిల్లయిన ప్రాంతంలో జరుగుతున్న శంకుస్థాపన వేడుకలు ప్రపంచానికి తలమానికం కావాలన్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, మన కోసం, భావితరాల కోసం ఈ పని చేస్తున్నామనే భావన అందరిలోనూ రావాలన్నారు. 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘మన మట్టి-మన నీరు-మన అమరావతి’ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ఉత్సాహంగా జరపాలని సూచించారు. మట్టి, జలాల సేకరణ, పూజల్లో అందరూ పాల్గొనేలా చూడాలని, అమరావతి సంకల్ప జ్యోతి ర్యాలీల్లో అందరూ పాల్గొనాలన్నారు.
అమరావతి నిర్మాణానికి సహకరించండి
అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి సహకరించాలని చంద్రబాబు కోరారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుఫోరం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్‌లో ఏర్పాటు చేసిన రన్ ఫర్ క్యాపిటల్ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను చేపట్టిన రాజధాని నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకోలేరని, గ్రీన్ సిటీ నిర్మాణాన్ని చేపట్టి తీరుతానని స్పష్టం చేశారు. యువత ఉద్యోగాల కోసం ఎక్కడకో వెళ్లాల్సిన అవసరం లేదని, త్వరలోనే రాష్ట్రంలోనే ఉద్యోగావకాశాలు వస్తాయని, అప్పటి దాకా యువత ప్లే గ్రౌండ్‌లో ఆటలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
100 హెల్త్‌కేర్ ఏటీఎంలు
రాష్ట్రంలో 100 హెల్త్‌కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని, పనితీరునుబట్టి వాటిసంఖ్యను మరింత పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాధారణ వ్యాధులకు హెల్త్‌కేర్ ఏటీఎంల ద్వారా మందులు పంపిణీ చేసే విధానం అందుబాటులో ఉందని, దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇండియన్ డివైజర్ మాన్యుఫ్యాక్చరర్స్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని, వైద్య పరికరాల తయారీ పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రభుత్వపరంగా ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. తమిళనాడులో అల్ట్రా సోనాలజీ సెంటర్లు అందిస్తున్న సేవలపై అధ్యయనం చేయాలని సీఎం కోరారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సిటీస్కాన్ సేవలు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రతి ఆస్పత్రికి గ్రేడింగ్ ఇవ్వాలని, బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించాలని కోరారు.