దేశంలో ఒక్క గోదావరి నదికి మాత్రమే వచ్చే అంత్య పుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సరస్వతీ (వీఐపీ) ఘాట్‌లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ మాగంటి మురళీమోహన్, నగర మేయర్ పంతం రజనీశేషసాయి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, స్థానిక ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు గోదావరి నదీమ తల్లికి ఉదయం పూజలు చేసి అంత్య పుష్కరాలను ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీ వరకూ గోదావరి అంత్య పుష్కరాలు జరగనున్నాయి.
గత ఏడాది జూలై 14 నుంచి 12 రోజులపాటు ఆది పుష్కరాలు జరగ్గా చివరి 12 రోజులూ అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంతోపాటు జిల్లాలోని వివిధ ఘాట్‌లలో, గోదావరి నదీ పాయలలో వేకువజాము నుంచే ప్రజలు అంత్య పుష్కర స్నానాలు ఆరంభించారు. పితృ దేవతలకు పిండప్రదానాలు నిర్వహించారు. ఘాట్ల వద్ద ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజు రాజమహేంద్రవరంలో అధికారుల అంచనా మేరకు భక్తులు రాలేదు. జిల్లాలోని అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి తదితర గ్రామీణ ఘాట్లలో కూడా భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది.
రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో కొంతమేర భక్తుల కోలాహలం కనిపించింది. రోజుకు 1.5 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ 3,000 మందితో బందోబస్తు నిర్వహించింది. భోజన, వసతులు కల్పించకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు, అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఏర్పాట్లను పర్యవేక్షించారు.