the Godavari river
-
ముందుగానే మూసేద్దాం...
► బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేతపై మహారాష్ట్ర ప్రతిపాదన ► తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్ణీత గడువు 29న మూసుకోనున్న గేట్లు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గే ట్లు మూసివేతపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తొందర పడుతోంది. ఎగువన విస్తారంగా కురిసిన వర్షాలతో నీరంతా ఎస్సారెస్పీకి చేరుతున్న నేపథ్యంలో గడువుకు ముం దే గేట్లు మూసివేస్తామని రాష్ట్రానికి ప్రతిపాదించింది. కానీ దీనిపై అభ్యంతరం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్ణీత గడువునే గేట్లు మూయాలని స్పష్టం చేసింది. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు అంశంపై సుప్రీంకోర్టు రెండున్నరేళ్ల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం ఏటా జూలై ఒకటి నుంచి అక్టోబర్ 28 వరకు ప్రాజెక్టు గేట్లు పూర్తిగా తెరిచి ఉంచి నది సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను సుప్రీం ఆదేశించింది. అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచవచ్చని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూలై 1న తెరిచిన గేట్లను అక్టోబర్ 29న మూసేయాల్సి ఉంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో మహారాష్ట్ర నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దాంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది కూడా. అయితే ఆ వరదల సందర్భంగానే మహారాష్ట్ర బాబ్లీ గేట్లను మూసివేసే ప్రతిపాదన తెచ్చింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. భారీగా వస్తున్న ప్రవాహాలకు అడ్డుకట్టవేయవద్దని స్పష్టం చేసింది. దాంతో మిన్నకుండిపోయిన మహారాష్ట్ర.. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులన్నీ నిండడం, నీరు సముద్రంలోకి వెళుతున్న నేపథ్యంలో మళ్లీ బాబ్లీ గేట్ల మూసివేతను తెరపైకి తెచ్చింది. వచ్చిన నీరు వచ్చినట్లుగా మళ్లింపు తాజాగా మహారాష్ట్ర చేసిన ప్రతిపాదనను కూడా తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం శ్రీరాంసాగర్కు కేవలం 25-30వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు మాత్రమే వస్తున్నాయి. ఇదే స్థాయిలో నీటిని కాకతీయ, లక్ష్మి కాలువల ద్వారా సాగు అవ సరాలకు వదులుతున్నారు. దీనికితోడు ఎస్సారెస్పీ, వరద కాలువల ప్రాజెక్టు కింద కలిపి మొత్తంగా 920 చెరువులుండగా.. అందులో 823 చెరువులను నింపారు. మిగతా చెరువులను నింపాల్సి ఉంది. ప్రస్తుతం వస్తున్న ప్రవాహాలను చెరువులు నింపేందుకు, ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబ్లీ గేట్లు మూసివేస్తే వస్తున్న ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోతాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశముంది. దీంతో గేట్లు మూయాలన్న మహారాష్ట్ర ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రాష్ట్ర అవసరాలకు మళ్లించి, గేట్లు మూసే సమయంలోగా వీలైనంత ఎక్కువ నీటిని నిల్వ ఉంచుకోవాలని భావిస్తోంది. -
గోదావరిలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
గోదావరిలో ఈతకు వెళ్లిన యువకుడు నీట మునిగి గల్లంతైన సంఘటన అదిలాబాద్ జిల్లా మామడ మండలం ఆదర్శ్నగర్లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మణ్రెడ్డి(20) శివారులోని నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు పోలీసుల సాయంతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభం
దేశంలో ఒక్క గోదావరి నదికి మాత్రమే వచ్చే అంత్య పుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సరస్వతీ (వీఐపీ) ఘాట్లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ మాగంటి మురళీమోహన్, నగర మేయర్ పంతం రజనీశేషసాయి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, స్థానిక ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు గోదావరి నదీమ తల్లికి ఉదయం పూజలు చేసి అంత్య పుష్కరాలను ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీ వరకూ గోదావరి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. గత ఏడాది జూలై 14 నుంచి 12 రోజులపాటు ఆది పుష్కరాలు జరగ్గా చివరి 12 రోజులూ అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంతోపాటు జిల్లాలోని వివిధ ఘాట్లలో, గోదావరి నదీ పాయలలో వేకువజాము నుంచే ప్రజలు అంత్య పుష్కర స్నానాలు ఆరంభించారు. పితృ దేవతలకు పిండప్రదానాలు నిర్వహించారు. ఘాట్ల వద్ద ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజు రాజమహేంద్రవరంలో అధికారుల అంచనా మేరకు భక్తులు రాలేదు. జిల్లాలోని అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి తదితర గ్రామీణ ఘాట్లలో కూడా భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లో కొంతమేర భక్తుల కోలాహలం కనిపించింది. రోజుకు 1.5 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ 3,000 మందితో బందోబస్తు నిర్వహించింది. భోజన, వసతులు కల్పించకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు, అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అస్తికలు గోదావరిలో కలపడానికి వెళ్లి..
- 25 మందికి గాయాలు మంథని(కరీంనగర్) తమ పూర్వికుల అస్థికలను గోదావరిలో కలిపి కుటుంబ సభ్యులంతా కలిసి తిరిగి వస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం పొదురుపల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. వరంగల్ జిల్లా మొగళ్లపల్లి మండలం ఎస్ పేటకు చెందిన మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ తల్లిదండ్రుల అస్థికలను కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిపి తిరిగి బొలేరో వాహనంలో వస్తుండగా.. వాహనం పొదురుపల్లి వద్దకు చేరుకోగానే ముందు టైర్ పగిలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మల్లారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గోదావరిలో యువకుడి మృతదేహం
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో గోదావరిలో ఓ యువకుడి మృతదేహం వెలుగు చూసింది. తల లేని మొండెం భాగాన్ని పోలీసులు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. హత్యగా భావించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.