ముందుగానే మూసేద్దాం...
► బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూసివేతపై మహారాష్ట్ర ప్రతిపాదన
► తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్ణీత గడువు 29న మూసుకోనున్న గేట్లు
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో మహారాష్ట్ర నిర్మించిన వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గే ట్లు మూసివేతపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తొందర పడుతోంది. ఎగువన విస్తారంగా కురిసిన వర్షాలతో నీరంతా ఎస్సారెస్పీకి చేరుతున్న నేపథ్యంలో గడువుకు ముం దే గేట్లు మూసివేస్తామని రాష్ట్రానికి ప్రతిపాదించింది. కానీ దీనిపై అభ్యంతరం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం.. నిర్ణీత గడువునే గేట్లు మూయాలని స్పష్టం చేసింది. వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు అంశంపై సుప్రీంకోర్టు రెండున్నరేళ్ల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం ఏటా జూలై ఒకటి నుంచి అక్టోబర్ 28 వరకు ప్రాజెక్టు గేట్లు పూర్తిగా తెరిచి ఉంచి నది సహజ ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలని మహారాష్ట్రను సుప్రీం ఆదేశించింది.
అక్టోబర్ 29 నుంచి మరుసటి ఏడాది జూన్ 30 వరకు ప్రాజెక్టు గేట్లు మూసి ఉంచవచ్చని సూచించింది. ఈ మేరకు ఈ ఏడాది జూలై 1న తెరిచిన గేట్లను అక్టోబర్ 29న మూసేయాల్సి ఉంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో మహారాష్ట్ర నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దాంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది కూడా. అయితే ఆ వరదల సందర్భంగానే మహారాష్ట్ర బాబ్లీ గేట్లను మూసివేసే ప్రతిపాదన తెచ్చింది. దాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. భారీగా వస్తున్న ప్రవాహాలకు అడ్డుకట్టవేయవద్దని స్పష్టం చేసింది. దాంతో మిన్నకుండిపోయిన మహారాష్ట్ర.. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులన్నీ నిండడం, నీరు సముద్రంలోకి వెళుతున్న నేపథ్యంలో మళ్లీ బాబ్లీ గేట్ల మూసివేతను తెరపైకి తెచ్చింది.
వచ్చిన నీరు వచ్చినట్లుగా మళ్లింపు
తాజాగా మహారాష్ట్ర చేసిన ప్రతిపాదనను కూడా తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌కు కేవలం 25-30వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు మాత్రమే వస్తున్నాయి. ఇదే స్థాయిలో నీటిని కాకతీయ, లక్ష్మి కాలువల ద్వారా సాగు అవ సరాలకు వదులుతున్నారు. దీనికితోడు ఎస్సారెస్పీ, వరద కాలువల ప్రాజెక్టు కింద కలిపి మొత్తంగా 920 చెరువులుండగా.. అందులో 823 చెరువులను నింపారు. మిగతా చెరువులను నింపాల్సి ఉంది. ప్రస్తుతం వస్తున్న ప్రవాహాలను చెరువులు నింపేందుకు, ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు.
ఈ నేపథ్యంలో బాబ్లీ గేట్లు మూసివేస్తే వస్తున్న ప్రవాహాలు పూర్తిగా నిలిచిపోతాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోయే అవకాశముంది. దీంతో గేట్లు మూయాలన్న మహారాష్ట్ర ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా రాష్ట్ర అవసరాలకు మళ్లించి, గేట్లు మూసే సమయంలోగా వీలైనంత ఎక్కువ నీటిని నిల్వ ఉంచుకోవాలని భావిస్తోంది.