Cinarajappa
-
చినరాజప్పను బూతులు తిట్టిన కార్యకర్తలు
సాక్షి, అనంతపురం: అనంతపురంలో హోంమంత్రి చినరాజప్పకు చేదు అనుభవనం ఎదురైంది. జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం జంతులూరులో బుధవారం ఏపీఎస్సీ 14వ బెటాలియన్‌ను నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి చినరాజప్ప ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం తనకి ఆహ్వానం అందలేదని శింగనమల ఎమ్మెల్యే యామినిబాల ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో యామినిబాల అనుచరులు, పార్టీ కార్యకర్తలు.. ఎందుకు ఆహ్వానించలేదని చినరాజప్పను నిలదీశారు. అంతేకాకుండా తమ ఎమ్మెల్యేకు సరైన గుర్తింపు ఇవ్వరా అంటూ నడిరోడ్డుపైన బూతుల పురాణం అందుకున్నారు. హఠాత్తుపరిణామంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి కార్యకర్తలను పక్కకు లాక్కెళ్లారు. -
పనులన్నీ చేయించుకుని మరిచిపోతారు..
ప్రజలపై సీఎం అసహనం సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల విలువైన భూములను క్రమబద్ధీకరించి పట్టాలిచ్చామని, పట్టా తీసుకున్నవారు ఇంటికెళ్లి తనను మరిచిపోతారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘పింఛన్ తీసుకుంటున్నారు.. మరిచిపోతున్నారు. రేషన్ తీసుకుంటున్నారు..మరిచిపోతున్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నా మరిచిపోతున్నారు. మీక్కావల్సిన పనులన్నీ చేయించుకుని నన్ను మరిచిపోవడం ఎంతవరకు సమంజసం?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రగతి మైదానంలో బుధవారం సాయంత్రం జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 21,225 మందికి క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, శంషాబాద్ ఎయిర్‌పోర్టును తలదన్నేలా భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని చెప్పారు. మహిళల నిరసన.. గెంటేసిన హోంమంత్రి పట్టాలిస్తామని చెప్పి ఇక్కడికి పిలిచి ఇప్పుడు రద్దయిపోయింది పొమ్మంటున్నారంటూ పలువురు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ‘నాకు పట్టా మంజూరైందని డబ్బులు కూడా తీసుకున్నారు..తీరా ఇక్కడకు వస్తే లేదు పొమ్మన్నారు..’ అంటూ తాటిచెట్లపాలేనికి చెందిన పుష్ప సీఎం పేరిట తనకు ఇచ్చిన ఆహ్వాన పత్రికను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా పలువురు మహిళలు వేదిక వద్దకు వచ్చి మీడియా వద్ద గోడు వెళ్లబోసుకుంటున్న సమయంలో.. హోంమంత్రి చినరాజప్ప అక్కడకు చేరుకుని మీడియాపై అసహనం వ్యక్తం చేయడమే కాకుండా, మహిళలను అక్కడినుంచి పొమ్మంటూ గెంటేశారు. -
గోదావరి అంత్య పుష్కరాలు ప్రారంభం
దేశంలో ఒక్క గోదావరి నదికి మాత్రమే వచ్చే అంత్య పుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సరస్వతీ (వీఐపీ) ఘాట్‌లో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంపీ మాగంటి మురళీమోహన్, నగర మేయర్ పంతం రజనీశేషసాయి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, స్థానిక ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు గోదావరి నదీమ తల్లికి ఉదయం పూజలు చేసి అంత్య పుష్కరాలను ప్రారంభించారు. ఈ నెల 11వ తేదీ వరకూ గోదావరి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. గత ఏడాది జూలై 14 నుంచి 12 రోజులపాటు ఆది పుష్కరాలు జరగ్గా చివరి 12 రోజులూ అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంతోపాటు జిల్లాలోని వివిధ ఘాట్లలో, గోదావరి నదీ పాయలలో వేకువజాము నుంచే ప్రజలు అంత్య పుష్కర స్నానాలు ఆరంభించారు. పితృ దేవతలకు పిండప్రదానాలు నిర్వహించారు. ఘాట్ల వద్ద ఉన్న దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మొదటి రోజు రాజమహేంద్రవరంలో అధికారుల అంచనా మేరకు భక్తులు రాలేదు. జిల్లాలోని అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి తదితర గ్రామీణ ఘాట్లలో కూడా భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో కొంతమేర భక్తుల కోలాహలం కనిపించింది. రోజుకు 1.5 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పోలీసు శాఖ 3,000 మందితో బందోబస్తు నిర్వహించింది. భోజన, వసతులు కల్పించకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, అంత్యపుష్కరాల నోడల్ అధికారి వి.విజయరామరాజు, అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
త్వరలో 4600 పోలీసు పోస్టుల భర్తీ
మహిళల రక్షణకు ప్రత్యేక యాప్: హోంమంత్రి చినరాజప్ప ఎస్.రాయవరం: రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత అధికంగా ఉందని, త్వరలో 4600 పోస్టులను భర్తీ చేయనున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. విశాఖ జిల్లా అడ్డురోడ్డు జంక్షన్ వద్ద నక్కపల్లి సర్కిల్ కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పోలీసులు ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమాలు నిర్వహించాలని, తప్పుడు ఫిర్యాదులతో వచ్చే వారిపై పార్టీలకతీతంగా కఠినంగా వ్యహరించాలని సూచించారు. మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామన్నారు.అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ పంచాయతీల్లో మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని వెల్లడించారు. -
ఇంతకీ ఆ మంత్రులు ఎక్కడ?
► ముద్రగడ దీక్ష మొదలైననాటి నుంచీ జిల్లాలో కనిపించని చినరాజప్ప, యనమల ► కాపు సామాజికవర్గం మండిపాటుకు వెరచిన హోంమంత్రి! ► తుని ఘటనలో తమ వర్గీయుని అరెస్టుపై బీసీల ఆగ్రహం ► ఈ నేపథ్యంలో జిల్లావైపు తొంగి చూడని ఆర్థిక మంత్రి! సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తుని ఘటనలో అరెస్టయిన 13 మంది విడుదల కోరుతూ ఆమరణ దీక్ష చేపట్టిన తరువాత జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు జిల్లాకు ముఖం చాటేశారు. ముద్రగడ దీక్ష చేపట్టి సోమవారానికి 12 రోజులు కాగా నాటి నుంచీ మంత్రులిద్దరూ జిల్లా దరిదాపుల్లో కానరావడం లేదు. కోనసీమకు చెందిన చినరాజప్ప జిల్లాలో తాను నివసించే అమలాపురంలో, తాను ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దాపురంలో ఎవరు ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా కాదనకుండా హాజరయ్యే వారు. అలాంటిది.. పెద్దాపురం మరిడమ్మ సత్రంలో జరిగిన నవనిర్మాణ దీక్ష ముగింపు సభ తరువాత ఆయన జిల్లాలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. అలాగని జిల్లాలో, ఆ రెండు నియోజకవర్గాల్లో చినరాజప్ప పాల్గొనాల్సిన ఏ కార్యక్రమాలూ లేవనుకుంటే పొరపాటే. ఈ 12 రోజుల్లో అధికారిక కార్యక్రమాల మాట అటుంచినా ఆయన పాల్గొనాల్సిన ప్రైవేటు ఫంక్షన్లు చాలానే ఉన్నాయి. కాపు సామాజివర్గం కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. అదే సామాజికవర్గానికి చెందిన చినరాజప్ప.. చంద్రబాబు మెప్పు కోసమే అనుచిత వ్యాఖ్యలు చేశారని కాపు జేఏసీ నేతలు పేర్కొంటున్నారు. అంతేకాక కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో చినరాజప్ప ఆదేశాల మేరకే భారీగా పోలీసు బలగాలను మోహరింపచేసి భయాందోళనలు సృష్టించారని ఆ వర్గం మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే చినరాజప్ప ప్రధానంగా కోనసీమలో ఆ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అందుకే.. తనకు భద్రతగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను వెంట ఉంచుకునే అవకాశం ఉండీ.. జిల్లాలో అడుగుపెట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏరువాక సహా ఎన్నో కార్యక్రమాలకు రాజప్ప డుమ్మా సోమవారం జిల్లాస్థాయిలో జరిగే ఏరువాక కార్యక్రమానికి చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరు కావాలి. కానీ ఆయన జిల్లాలో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఆ కార్యక్రమాన్ని నియోజకవర్గానికే పరిమితం చేశారు. పెదబ్రహ్మదేవంలో ఎంపీటీసీ మార్ని వీరభద్రం గత ఆదివారం విందు ఏర్పాటుచేసి చినరాజప్పను ఆహ్వానించగా అప్పుడూ రాలేదు. ఉప్పలగుప్తంలో అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం, గొల్లవిల్లిలో రవ్వ చమురు క్షేత్రం ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణా కార్యక్రమం, గొల్లవిల్లిలో న్యాయవాది నందిక శ్రీనివాసరావు, మునిపల్లిలో యర్రంశెట్టి మల్లిబాబు ఇంట్లో శుభకార్యం... ఇలా పలు కార్యక్రమాలకు చినరాజప్ప ముఖం చాటేశారు. చివరకు పెదగాడవల్లిలో బంధువు జి.శ్రీరామారావు సంస్మరణ కార్యక్రమానికి, పేరూరులో టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జి అధ్యక్షుడు పెచ్చెట్టి చంద్రమౌళి తండ్రి రాజారావు మృతి చెందగా పరామర్శకు కూడా చినరాజప్ప రాలేదు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో ప్రధానంగా అమలాపురం, పరిసర ప్రాంతాల్లో కాపు యువకులను దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేసి జైళ్లలో పెట్టించారని ఆ సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. అందుకే చినరాజప్ప ఇన్ని రోజులుగా జిల్లా ప్రజలకు ముఖం చూపించ లేకపోయారంటున్నారు. విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశానికీ గైర్హాజరే.. మరో మంత్రి యనమల కూడా ఈ 12 రోజుల్లో జిల్లాలో ఎక్కడా కనిపించ లేదు. మామూలుగానే ఆయన జిల్లాకు ఎప్పుడైనా చుట్టపుచూపుగానే వచ్చి పోతుంటారు. కానీ తిమ్మాపురంలో ప్రైవేటు అతిథిగృహాన్ని తీసుకున్న తరువాత గతంలో కంటే కొంత తరచుగానే ఇటీవల జిల్లాకు వస్తున్నారు. అయితే ముద్రగడ దీక్ష తరువాత యనమల కూడా జిల్లాలో అడుగుపెట్టలేదు. కాపు ఉద్యమంతో సంబంధం లేని కోటనందూరుకు చెందిన బీసీ సామాజివర్గీయుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు లగుడు శ్రీనును టీడీపీ నేతల ప్రోద్బలంతోనే ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆ సామాజికవర్గం ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలోనే యనమల జిల్లాకు దూరంగా ఉన్నారంటున్నారు. రాజప్పతో పాటు యనమల ఇటీవల జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. తుని ఘటనలో అరెస్టయిన 13 మందికీ ప్రస్తుతం బెయిల్ లభించడంతో ముద్రగడ మంగళవారం దీక్ష విరమించే అవకాశముంది. అంటే.. జిల్లాలో అమాత్యద్వయం దర్శనమిచ్చే సమయమూ దగ్గరపడినట్టే. -
బందరు బయలుదేరిన చినరాజప్ప
ఈరోజు విజయనగరంలో పర్యటించాల్సిన ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకొని మచిలీపట్నం బయలుదేరారు. స్థానిక నిజాంపేటలో వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యతో పట్టణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సంభవించే అవకాశం ఉండటంతో.. ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి ఆయన వెళ్తున్నట్లు సమాచారం. -
అనంతపురాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం
పెద్దాపురం :అకాల వర్షాలతో నష్టపోయిన అనంతపురం జిల్లాను అన్ని విధాలుగా ఆదుకుంటామని డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. గురువారం పెద్దాపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత రెండు రోజులుగా ప్రతికూల వాతావరణం వల్ల అనంతపురంలో భారీ వర్షాలు కురిసి, పంటనష్టం వాటిల్లిందన్నారు. నష్టం ఏ మేరకు జరిగిందో అంచనా వేస్తున్నామన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా అనంతపురంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటినందున జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిపై సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో అధికార కార్యక్రమాలు రద్దు చేసుకుని అనంతపురం వెళుతున్నట్టు తెలిపారు. అక్కడి పరిస్థితిని పూర్తిగా పరిశీలించాక తక్షణ సాయంపై ఉన్నతాధికారులతో సమీక్షించి ఆదుకుంటామన్నారు. ప్రస్తుతం ప్రతికూల వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు చేతికొచ్చిన పంటను ఒబ్బిడి చేసుకోవాలన్నారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తితే తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఏఎంసీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి, బొడ్డు బంగారుబాబు, గొరకపూడి చిన్నయ్య దొర తదితరులు పాల్గొన్నారు. పుష్కర పనుల తనిఖీలకు ‘బాబు’ రెడీ! రాజమండ్రి : గోదావరి పుష్కరాలకు జరుగుతున్న వివిధ పనులను ముఖ్యమంత్రి నారా చం ద్రబాబునాయుడు ఆకస్మిక తనిఖీ చేయనున్నారు. చంద్రబాబు మే ఒకటి, రెండు తేదీల్లో రాజమండ్రి వస్తారని, తదుపరి రెండు రోజులు నగరంలో ఉండి, పుష్కర పనులను పరిశీలిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా పనుల తీరుపై సమీక్షలు జరుపుతారని పేర్కొన్నాయి. ఈనెల 20 తరువాత బాబు ఎప్పుడైనా రాజమండ్రి వచ్చే అవకాశముందని విశ్వసనీయ సమాచాం. -
గ్రేటర్ అమరావతి పోలీసు కమిషనరేట్
త్వరలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప నేతృత్వంలో సీఆర్డీఏతో భేటీ సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధానిలో గ్రేటర్ అమరావతి పోలీసు కమిషనరేట్ ఏర్పాటు కానుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) పరిధి మొత్తాన్ని దీని ఆధీనంలోకి తీసుకురానున్నారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అమలుకున్న అడ్డంకులను అధిగమించేందుకు హోంశాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో త్వరలో సీఆర్డీఏ అధికారులతో భేటీ కావాలని పోలీసు విభాగం నిర్ణయించింది. కమిషనర్‌గా అదనపు డీజీ ర్యాంకు అధికారి.. ప్రభుత్వం రాజధానికి అమరావతి పేరును ఖరారు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటవనున్న కమిషనరేట్.. గ్రేటర్ అమరావతి పోలీసు కమిషనరేట్‌గా అవతరించనుంది. సీనియర్ అదనపు డీజీ ర్యాంకు అధికారిని కమిషనర్‌గా నియమిస్తారు. విజయవాడ కమిషనరేట్, గుంటూరు అర్బన్ పోలీసు జిల్లాలు పూర్తిగా, కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, పామర్రు, గుడివాడ నియోజకవర్గాలు, గుంటూరు రూరల్ పోలీసు జిల్లా పరిధిలోని తెనాలి, తుళ్లూరు, సత్తెనపల్లి, బాపట్ల సబ్-డివిజన్లలోని ప్రాంతాలు దీని పరిధిలోకి రానున్నాయి. పాలనాపరంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గ్రేటర్ కమిషనరేట్‌ను ఉత్తర, దక్షిణ విభాగాలుగా విభజించనున్నారు. విజయవాడ కమిషనరేట్‌తోపాటు కృష్ణా జిల్లా నుంచి వచ్చి కలిసిన ప్రాంతాలు ఉత్తర విభాగం పరిధిలోకి, గుం టూరు జిల్లా నుంచి వచ్చి కలసిన ప్రాంతాలు దక్షిణ విభాగం పరిధిలోకి వస్తాయి. ఢిల్లీ నమూనా.. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో ఉన్న మాదిరిగా కాకుండా దేశ రాజధాని ఢిల్లీ కమిషనరేట్ మోడల్‌ను ఇక్కడ అమలు చేయనున్నారు. దీనిప్రకారం గ్రేటర్ పోలీసు కమిషనర్‌కు పరిపాలనా, లెసైన్సుల జారీ తదితర అధికారాలు ఉంటాయి. -
మంచైనా..చెడైనా మీతోనే!
కేసుల నమోదులో జాగ్రత్త పోలీసు అధికారుల సమీక్షలో హోంమంత్రి చినరాజప్ప విజయవాడ సిటీ : ‘క్షేత్రస్థాయిలో పని చేసేది మీరే. మంచైనా, చెడైనా మీపైనే ఆధారపడి ఉంది. మీ పని తీరు కారణంగానే పోలీసు కమిషనర్‌కు, ప్రభుత్వానికి పేరొస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పని చేయండి’ అంటూ రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోలీసు అధికారులకు హితవుపలికారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని సమావేశ మంది రంలో ఆయన ఎస్ఐ ఆపై స్థాయి అధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహిం చారు. సేకరించిన సమాచారం ప్రకారం.. సమావేశంలో హోంమంత్రికి కమిషనరేట్‌లోని అధికారులను సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు పరిచయం చేశారు. ఇతర కమిషనరేట్లలో నేరాల సంఖ్యకు అనుగుణంగా సిబ్బంది నియామకం, వాహనాల కొరత, పోలీసు స్టేషన్ల ఆధునికీకరణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ తాము చేపట్టిన కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇక్కడ జరిగే నేరాలు, నిలువరించేందుకు తాము చేపడుతున్న చర్యలను పేర్కొన్నారు. ఇన్స్పెక్టర్ల పదోన్నతులు, డ్రైవర్ల కొరత, పోలీసు పిల్లలకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు, ఆస్పత్రి నిర్మాణం వంటి అంశాలను ఈ సందర్భంగా కొందరు అధికారులు ప్రస్తావించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాల నియంత్రణకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ఇందుకు అనుగుణంగా పోలీసుశాఖ పని చేయాలని కోరారు. రాజధాని కావడంతో భూ వివాదాలు పెరిగే అవకాశం ఉందని, వాటిని మొగ్గలోనే తుంచివేయాలని హోం మంత్రి ఆదేశించారు. పరస్పరం కేసుల నమోదు విషయంలోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆరోపణలు రాకుండా కేసుల నమోదు, నిందితుల అరెస్టుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు సానుకూలత...వైద్యశాలకు వ్యతిరేకత పోలీసు ఉద్యోగుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించేందుకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటుపై హోంమంత్రి సుముఖత వ్యక్తం చేశారు. సీఎంతో చర్చించి పాఠశాల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజధానిలో పోలీసుల సంఖ్య పెంపు, వాహనాల సమకూర్చడం వంటి అంశాలపై హోంమంత్రి సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. పోలీసులకు ప్రత్యేకంగా ఆస్పత్రి ఏర్పాటు చేయాలనే సూచనను హోంమంత్రి అంగీకరించలేదు. పెద్ద జబ్బులకు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి ‘భద్రత’ పథకం కింద బిల్లులు పెట్టుకునే అవకాశం ఉన్నందున ఆస్పత్రి అవసరం లేదన్నారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టండి ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిందని చినరాజప్ప చెప్పారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దని అధికారులకు స్పష్టంచేశారు. సీపీకి కితాబు పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై సీపీని హోంమంత్రి ప్రశంసించినట్లు తెలిసింది. డీసీపీ(పరిపాలన) జి.వి.జి.అశోక్‌కుమార్, వివిధ విభాగాలకు చెందిన అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
సిరి మోటార్స్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం రాజప్ప
ఆల్కాట్‌తోట(రాజమండ్రి) : యమహా ఆథరైజ్డ్ డీలర్ సిరి మోటార్స్ షోరూంను స్థానిక వీఎల్‌పురం సెంటర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గురువారం ప్రారంభించారు. తొలుత రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించిన ఆయన అనంతరం జ్యోతిప్రజ్వలన చేశారు. మొదటి కొనుగోలును రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి, స్కూటర్ జోన్‌ను కొత్తపేట ఎమెల్యే చిర్ల జగ్గిరెడ్డి, స్పేర్స్ కౌంటర్‌ను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, వర్కుషాపును రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, వర్కుషాపు కస్టమర్ లాంజ్‌ను నగర డిప్యూటీమేయర్ వాసిరెడ్డి రాంబాబు ప్రారంభించారు. ముందుగా ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 12.56 గంటలకు సిరి మోటార్స్ మేనేజింగ్ పార్టనర్ వీధి రామ్‌ప్రసాద్, పార్టనర్ చింతం తమ్మయ్యనాయుడు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కస్టమర్లకు వాహనం కొనుగోలు నుంచి ఉత్తమమైన సేవలందిస్తామన్నారు. ఈ సందర్బంగా నిమ్మకాయల చినరాజప్పను యమహా బైక్‌పై ఎక్కమనగా ఆయన ఎంతో ఉత్సాహంగా బైక్‌పై కూర్చున్నారు. యమహా మోటార్స్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రీజనల్ బిజినెస్ హెడ్ కె.భానుప్రకాష్రాజు, రీజనల్ సర్వీస్ హెడ్ ఎ.సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైర్రాజు ప్రసాదరాజు, జిల్లా టీడీపీ కార్యదర్శి రె డ్డి సుబ్రహ్మణ్యం, డీసీసీబీ మాజీ డెరైక్టర్ ఆకులరామకృష్ణ, విక్టరీ ట్రేడర్స్ అధినేత గొలుగూరి వెంకటరెడ్డి, వేగుళ్ల లీలాకృష్ణ, పప్పుల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. -
గురుకుల పాఠశాలలుగా వసతి గృహాలు
సాక్షి, కాకినాడ :రాష్ర్టంలోని వివిధ సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకుల పాఠశాలలుగా అభివృద్ధి చేయనున్నట్టు రాష్ర్ట మంత్రులు వెల్లడించారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రమైన కాకినాడలో రాష్ర్ట ఉపముఖ్యమంత్రి, హోంశాఖమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో పాటు ఆర్థిక, మానవ వనరులు, మున్సిపల్ శాఖల మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, పి.నారాయణలు సందడి చేశారు. రూ.6.30 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభించారు. తొలుత ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌ను ఆనుకొని జీఎస్పీసీ సీఎస్ఆర్ కింద సమకూర్చిన రూ.35 లక్షలతో నిర్మించిన సూటురూమ్స్, అదనపు సమావేశపు హాలుతో కూడిన ఆర్ అండ్ బీ అదనపు భవన సముదాయాన్ని, మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లాను ఆనుకొని రూ.కోటితో నిర్మించిన ఈవీఎంలు భద్రపర్చే గోదామును రాష్ర్ట మంత్రులు చినరాజప్ప, యనమల ప్రారంభించారు. ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా కార్పొరేషన్ సీఆర్ఎస్ కింద రూ.1.24 కోట్లతో జిల్లావ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఆధునికీకరించడంతో పాటు విద్యార్థులకు దోమతెరలు, టూటైర్ కాట్స్, డెస్క్‌టాప్ కంప్యూటర్స్ వంటి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చారు. ఆధునికీకరించిన జగన్నాధపురం సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ భవన సముదాయాన్ని రాష్ర్టమంత్రులు గంటా,యనమల, చినరాజప్పలు ప్రారంభించడంతో పాటు విద్యార్థులకు దోమ తెరలు, దుప్పట్లు, దుస్తులు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. ఏఎంజీ స్కూల్లో జిల్లా స్థాయి వైద్య, విజ్ఞాన ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు. అనంతరం జేఎన్టీయూకేలో రూ.1.67 కోట్లతో నాగావళి-2 పేరిట నిర్మించిన లేడీస్ హాస్టల్ భవన సముదాయంతో పాటు రూ.3.04 కోట్లతో నిర్మించిన బి-2 స్టాఫ్ క్వార్టర్స్‌ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలికల సంక్షేమ హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బడి పిలుస్తోంది సభకు, ఏఎంజీ సైన్స్‌ఫేర్ ప్రారంభ సభలకు స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) అధ్యక్షత వహించారు. సీఎస్ఆర్ నిధుల ఖర్చుకు ప్రణాళికలు సభలో ఆర్థికమంత్రి యనమల మాట్లాడుతూ ఇక నుంచి ఓఎన్జీసీ, రిలయన్స్, జీఎస్పీసీ తదితర బడా సంస్థలు తాము ఆర్జించే ఆదాయంలో కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద ఖర్చు చేయాల్సిన రెండు శాతం నిధులను ఒకే హెడ్లో సేకరించి వాటిని ప్రభుత్వ పరంగా అవసరమైన ప్రాంతాల్లో ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. పాశ్చాత్య దేశాల్లో ప్రైవేటురంగానికి దీటుగా ప్రభుత్వ విద్యారంగం ఉంటుందని, ఇక్కడ కూడా అదే రీతిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఉద్యోగస్తుల నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపే విధంగా వాటిని తయారు చేస్తామన్నారు. మరో రాష్ర్ట మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పతిష్టాత్మక పదకొండు విద్యాసంస్థలు వస్తున్నాయని, వాటి ద్వారా రాష్ర్టం రూపురేఖలు మారిపోనున్నాయని గంటా చెప్పారు. రాష్ర్ట ఉపముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ విద్యా రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ ఈ రంగానికి నిధుల కొరత రానీయకుండా చూస్తామన్నారు. సీఎస్ఆర్ నిధులతో సంక్షేమ హాస్టల్స్‌లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం మాట్లాడుతూ గత ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరూ ఉచిత నిర్బంధ విద్యను పొందే అవకాశం లభించిందన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పేరెంట్స్ మీట్స్‌ను ఏర్పాటు చేసి జవాబుదారీ తనం పెంచాలని ఎమ్మెల్యే కొండబాబు సూచించారు. డీఎడ్ విద్యార్థుల నిరసన డీఎస్సీ-14లో తమకూ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ డీఎడ్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు మంత్రులను ముట్టడించారు. జేఎన్టీయూకేలో ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేస్తున్న రాష్ర్ట మానవ వనరులశాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప లను గేటు వద్ద డీఎడ్ విద్యార్థులు చుట్టుముట్టి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తమకు న్యాయం చేసే వరకు కదలడానికి వీల్లేదంటూ పట్టుబట్టడంతో టెట్ నిర్వహించి క్వాలిఫై అయినవారికి అవకాశం కల్పిస్తామంటూ గంటా హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ప్రొటోకాల్ ఉల్లంఘనపై తోట మండిపాటు లోక్‌సభలో టీడీపీ ఫ్లోర్లీడరయిన తనకు జేఎన్టీయూకేలో కనీస గుర్తింపునివ్వడం లేదంటూ కాకినాడ ఎంపీ తోట నరసింహం మండిపడ్డారు. జేఎన్టీయూకేలో మంగళవారం చేపట్టిన ప్రారంభోత్సవాలపై తనకు కనీసం మాట మాత్రంగా కూడా చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమాల మధ్యలో నుంచే వెనుదిరిగిన తోట జేఎన్టీయూకే అధికారుల తీరుపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఎక్కడా తనను ఆహ్వానిస్తూ కనీసం ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన మీడియా వద్ద వాపోయారు. తానేంటో...చూపిస్తానంటూ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ నరసింహం అక్కడ నుంచి వెళ్లిపోయారు. చొల్లంగి భూములను పరిశీలించిన నారాయణ పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు కోసం తాళ్లరేవు మండలం చొల్లంగి వద్ద ప్రతిపాదించిన 57 ఎకరాల స్థలాన్ని రాష్ర్ట మున్సిపల్ శాఖమంత్రి పి.నారాయణ పరిశీలించారు. రాజమండ్రిలో మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ ముత్యాలరాజు, ఏజేసీ మార్కండేయులు, ఏఎస్పీ సత్యనారాయణ, జేఎన్టీయూకే వీసీ జి.తులసీరాందాస్, రెక్టార్ బి.ప్రభాకరరావు, రిజిస్ట్రార్ జీవీఆర్ ప్రసాదరాజు, ఓఎన్జీసీ ఈడీ కృష్ణారావు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు కేవివి సత్యనారాయణరాజు, కెవి రవికిరణ్‌వర్మ, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, పిల్లి అనంతలక్ష్మి, ఎస్వీఎస్ఎన్ వర్మ, దాట్ల బుచ్చిరాజు, అయితాబత్తుల ఆనందరావు, తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు, పెందుర్తి వెంకటేష్, వంగలపూడి వనిత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, పార్టీ బీసీ విభాగం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.