ఇంతకీ ఆ మంత్రులు ఎక్కడ?
► ముద్రగడ దీక్ష మొదలైననాటి నుంచీ జిల్లాలో కనిపించని చినరాజప్ప, యనమల
► కాపు సామాజికవర్గం మండిపాటుకు వెరచిన హోంమంత్రి!
► తుని ఘటనలో తమ వర్గీయుని అరెస్టుపై బీసీల ఆగ్రహం
► ఈ నేపథ్యంలో జిల్లావైపు తొంగి చూడని ఆర్థిక మంత్రి!
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తుని ఘటనలో అరెస్టయిన 13 మంది విడుదల కోరుతూ ఆమరణ దీక్ష చేపట్టిన తరువాత జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుకు జిల్లాకు ముఖం చాటేశారు. ముద్రగడ దీక్ష చేపట్టి సోమవారానికి 12 రోజులు కాగా నాటి నుంచీ మంత్రులిద్దరూ జిల్లా దరిదాపుల్లో కానరావడం లేదు. కోనసీమకు చెందిన చినరాజప్ప జిల్లాలో తాను నివసించే అమలాపురంలో, తాను ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దాపురంలో ఎవరు ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా కాదనకుండా హాజరయ్యే వారు.
అలాంటిది.. పెద్దాపురం మరిడమ్మ సత్రంలో జరిగిన నవనిర్మాణ దీక్ష ముగింపు సభ తరువాత ఆయన జిల్లాలో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. అలాగని జిల్లాలో, ఆ రెండు నియోజకవర్గాల్లో చినరాజప్ప పాల్గొనాల్సిన ఏ కార్యక్రమాలూ లేవనుకుంటే పొరపాటే. ఈ 12 రోజుల్లో అధికారిక కార్యక్రమాల మాట అటుంచినా ఆయన పాల్గొనాల్సిన ప్రైవేటు ఫంక్షన్‌లు చాలానే ఉన్నాయి. కాపు సామాజివర్గం కోసం దీక్ష చేస్తున్న ముద్రగడ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. అదే సామాజికవర్గానికి చెందిన చినరాజప్ప.. చంద్రబాబు మెప్పు కోసమే అనుచిత వ్యాఖ్యలు చేశారని కాపు జేఏసీ నేతలు పేర్కొంటున్నారు.
అంతేకాక కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో చినరాజప్ప ఆదేశాల మేరకే భారీగా పోలీసు బలగాలను మోహరింపచేసి భయాందోళనలు సృష్టించారని ఆ వర్గం మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే చినరాజప్ప ప్రధానంగా కోనసీమలో ఆ సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అందుకే.. తనకు భద్రతగా పెద్దసంఖ్యలో పోలీసు బలగాలను వెంట ఉంచుకునే అవకాశం ఉండీ.. జిల్లాలో అడుగుపెట్టలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు.
ఏరువాక సహా ఎన్నో కార్యక్రమాలకు రాజప్ప డుమ్మా సోమవారం జిల్లాస్థాయిలో జరిగే ఏరువాక కార్యక్రమానికి చినరాజప్ప ముఖ్య అతిథిగా హాజరు కావాలి. కానీ ఆయన జిల్లాలో అడుగుపెట్టలేని పరిస్థితుల్లో ఆ కార్యక్రమాన్ని నియోజకవర్గానికే పరిమితం చేశారు. పెదబ్రహ్మదేవంలో ఎంపీటీసీ మార్ని వీరభద్రం గత ఆదివారం విందు ఏర్పాటుచేసి చినరాజప్పను ఆహ్వానించగా అప్పుడూ రాలేదు.
ఉప్పలగుప్తంలో అభయాంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం, గొల్లవిల్లిలో రవ్వ చమురు క్షేత్రం ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణా కార్యక్రమం, గొల్లవిల్లిలో న్యాయవాది నందిక శ్రీనివాసరావు, మునిపల్లిలో యర్రంశెట్టి మల్లిబాబు ఇంట్లో శుభకార్యం... ఇలా పలు కార్యక్రమాలకు చినరాజప్ప ముఖం చాటేశారు. చివరకు పెదగాడవల్లిలో బంధువు జి.శ్రీరామారావు సంస్మరణ కార్యక్రమానికి, పేరూరులో టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జి అధ్యక్షుడు పెచ్చెట్టి చంద్రమౌళి తండ్రి రాజారావు మృతి చెందగా పరామర్శకు కూడా చినరాజప్ప రాలేదు.
ముద్రగడ దీక్ష నేపథ్యంలో ప్రధానంగా అమలాపురం, పరిసర ప్రాంతాల్లో కాపు యువకులను దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేసి జైళ్లలో పెట్టించారని ఆ సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. అందుకే చినరాజప్ప ఇన్ని రోజులుగా జిల్లా ప్రజలకు ముఖం చూపించ లేకపోయారంటున్నారు.
విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశానికీ గైర్హాజరే..
మరో మంత్రి యనమల కూడా ఈ 12 రోజుల్లో జిల్లాలో ఎక్కడా కనిపించ లేదు. మామూలుగానే ఆయన జిల్లాకు ఎప్పుడైనా చుట్టపుచూపుగానే వచ్చి పోతుంటారు. కానీ తిమ్మాపురంలో ప్రైవేటు అతిథిగృహాన్ని తీసుకున్న తరువాత గతంలో కంటే కొంత తరచుగానే ఇటీవల జిల్లాకు వస్తున్నారు. అయితే ముద్రగడ దీక్ష తరువాత యనమల కూడా జిల్లాలో అడుగుపెట్టలేదు. కాపు ఉద్యమంతో సంబంధం లేని కోటనందూరుకు చెందిన బీసీ సామాజివర్గీయుడు, వైఎస్సార్ సీపీ నాయకుడు లగుడు శ్రీనును టీడీపీ నేతల ప్రోద్బలంతోనే ఈ కేసులో అక్రమంగా ఇరికించారని ఆ సామాజికవర్గం ఆగ్రహంతో ఉంది.
ఈ నేపథ్యంలోనే యనమల జిల్లాకు దూరంగా ఉన్నారంటున్నారు. రాజప్పతో పాటు యనమల ఇటీవల జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. తుని ఘటనలో అరెస్టయిన 13 మందికీ ప్రస్తుతం బెయిల్ లభించడంతో ముద్రగడ మంగళవారం దీక్ష విరమించే అవకాశముంది. అంటే.. జిల్లాలో అమాత్యద్వయం దర్శనమిచ్చే సమయమూ దగ్గరపడినట్టే.