- త్వరలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప నేతృత్వంలో సీఆర్‌డీఏతో భేటీ
సాక్షి, హైదరాబాద్: కొత్త రాజధానిలో గ్రేటర్ అమరావతి పోలీసు కమిషనరేట్ ఏర్పాటు కానుంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) పరిధి మొత్తాన్ని దీని ఆధీనంలోకి తీసుకురానున్నారు. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో అధికారులు ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. అమలుకున్న అడ్డంకులను అధిగమించేందుకు హోంశాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో త్వరలో సీఆర్‌డీఏ అధికారులతో భేటీ కావాలని పోలీసు విభాగం నిర్ణయించింది.
కమిషనర్‌గా అదనపు డీజీ ర్యాంకు అధికారి..
ప్రభుత్వం రాజధానికి అమరావతి పేరును ఖరారు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటవనున్న కమిషనరేట్.. గ్రేటర్ అమరావతి పోలీసు కమిషనరేట్‌గా అవతరించనుంది. సీనియర్ అదనపు డీజీ ర్యాంకు అధికారిని కమిషనర్‌గా నియమిస్తారు. విజయవాడ కమిషనరేట్, గుంటూరు అర్బన్ పోలీసు జిల్లాలు పూర్తిగా, కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, పామర్రు, గుడివాడ నియోజకవర్గాలు, గుంటూరు రూరల్ పోలీసు జిల్లా పరిధిలోని తెనాలి, తుళ్లూరు, సత్తెనపల్లి, బాపట్ల సబ్-డివిజన్లలోని ప్రాంతాలు దీని పరిధిలోకి రానున్నాయి. పాలనాపరంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గ్రేటర్ కమిషనరేట్‌ను ఉత్తర, దక్షిణ విభాగాలుగా విభజించనున్నారు. విజయవాడ కమిషనరేట్‌తోపాటు కృష్ణా జిల్లా నుంచి వచ్చి కలిసిన ప్రాంతాలు ఉత్తర విభాగం పరిధిలోకి, గుం టూరు జిల్లా నుంచి వచ్చి కలసిన ప్రాంతాలు దక్షిణ విభాగం పరిధిలోకి వస్తాయి.
ఢిల్లీ నమూనా..
విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో ఉన్న మాదిరిగా కాకుండా దేశ రాజధాని ఢిల్లీ కమిషనరేట్ మోడల్‌ను ఇక్కడ అమలు చేయనున్నారు. దీనిప్రకారం గ్రేటర్ పోలీసు కమిషనర్‌కు పరిపాలనా, లెసైన్సుల జారీ తదితర అధికారాలు ఉంటాయి.