
పొగడ్తలే !
జిల్లాలోని 80 శాతం స్కూళ్లలో కట్టెల పొయ్యి పైనే వంట
► కృష్ణాను పొగరహిత జిల్లాగా ప్రకటించిన ప్రభుత్వం
► అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌపై చేయాలని ఆదేశం
► అయినా అమలుకు నోచుకోని వైనం
కృష్ణాను పొగరహిత జిల్లాగా పాలకులు ప్రకటించారు. అందరికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని గొప్పగా చెప్పారు. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లోని గదులే పొగచూరిపోతున్నాయి. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు గ్యాస్ ధర భారం కావడం... సకాలంలో సిలిండర్లు అందకపోవడంతో 80 శాతం పాఠశాలల్లో స్టౌలు అటకెక్కాయి. కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. ఫలితంగా ‘పొగరహిత జిల్లా’ ప్రకటనలకే పరిమితమైంది.
సాక్షి, మచిలీపట్నం : జిల్లాలోని 80 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీ నిర్వాహకులు కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. గ్యాస్ ధరలు పెరగడం... సకాలంలో సిలిండర్ల దొరక్కపోవడం... గ్యాస్ కన్నా కట్టెలు తక్కువ ధరకు లభించడమే ఇందుకు కారణమని నిర్వాహకులు చెబుతున్నారు.
దీనివల్ల పొరగహిత జిల్లా లక్ష్యం అమలులో అపహస్యం పాలవుతోంది. జిల్లాలో 4,442 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక పాఠశాల మూతపడింది. అన్ ఎయిడెడ్ పాఠశాలలను మినహాయించగా, 3,157 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. దాదాపు 300 వంట ఏజెన్సీలు ఉన్నాయి. ప్రతి రోజూ 5 లక్షల మంది విద్యార్థులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఈ ఏజెన్సీల్లో సుమారు 10 వేల మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు.
పొగ రహితమని ప్రకటించినా...
కృష్ణాను పొగరహిత జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌ పైనే చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల నిధులు నుంచి గ్యాస్ కనెక్షన్లు పొందాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొన్ని పాఠశాలల్లో గ్యాస్ కనెక్షన్లు పొందారు. మరికొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులే కొనుగోలు చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలవుతున్న 3,157 పాఠశాలల్లో ఒక్కో కనెక్షన్‌కు రూ.2,237 చెల్లించి కొనుగోలు చేశారు. అయితే, గ్యాస్ కొనలేక, సకాలంలో అదుబాటులో లేక ఎక్కువ పాఠశాలల్లో స్టౌలు అటకెక్కాయి. దాదుపు 80 శాతం పాఠశాలల్లో కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు.
గుడ్డు పేరుతో కోత...
ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో అన్నం కోసం బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తోంది. అయితే, కూర, చారు, స్వీట్లు తయారు చేయడానికి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కుకింగ్ చార్జీలుగా విద్యార్థికి రూ.6.48, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.8.53 చొప్పున చెల్లిస్తోంది. గతంలో కుకింగ్ చార్జీలతో భోజన పథకానికి కావాల్సిన కూరగాయలు, నూనె, పప్పుదినుసులు, గుడ్లు, స్వీట్లు మార్కెట్లో కొనుగోలు చేసేవారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వమే గుడ్లు పంపిణీ చేస్తోంది. సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్డు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి గుడ్డుకు రూ.2.35 చొప్పున కుకింగ్ చార్జీల నుంచి మినహాయించాలి.
అయితే, గుడ్డుతోపాటు భోజనం పెట్టిన రోజు కాకుండా సోమవారం నుంచి శనివారం వరకు కుకింగ్ చార్జీల నుంచి గుడ్డు డబ్బులను కట్ చేస్తున్నారు. దీంతో తమకు గిట్టుబాటు కావడం లేదని కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 500 నుంచి 1,000 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో వంట చేసేందుకు వారానికి 6 నుంచి 7 సిలిండర్లు అవసరమని, కొనుగోలు చేయలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. అందువల్లే కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నామంటున్నారు.
గిట్టుబాటు కావడంలేదని ఆవేదన...
ప్రభుత్వ నిబంధనల ప్రకారం... 25 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు, 100 మంది కన్నా ఎక్కువ ఉంటే ముగ్గురు, 200 మందికి పైగా ఉంటే నలుగురు వంట నిర్వాహకులు ఉండాలి. ఈ లెక్క ప్రకారం 25 మంది ఉన్న పాథమిక పాఠశాలలో మధ్యాహ్నం వంటలకు పప్పు, ఉప్పు, నూనె, కాయగూరల కోసం ప్రభుత్వం రోజుకు రూ.165 చెల్లిస్తోంది.
ఇప్పుడు అదనంగా రోజూ రూ.2.35 పైసల చొప్పున 25 మంది విద్యార్థులకు రూ.58.75 పైసలు గుడ్డు పేరుతో కుకింగ్ చార్జీల్లో కోత విధిస్తోంది. దీంతో తమకు మిగిలేది రూ.103.25 మాత్రమేనని, ఇద్దరు పని చేసేయగా ఒక్కొక్కరికీ ఖర్చులతో కలిపి రూ.51.50 మాత్రమే లభిస్తుందని చెబుతున్నారు. అందువల్ల గ్యాస్‌ను ప్రభుత్వమే ఉచింతంగా అందిస్తే తమకు గిట్టుబాటు అవుతుందని, పొగరహిత జిల్లా లక్ష్యం కూడా నెరవేరుతుందని పలు ఏజెన్సీల నిర్వాహకులు కోరుతున్నారు.
పెడనలోని భట్టా జ్ఞానకోటయ్య ఉన్నత పాఠశాలలో 1,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి మధ్యాహ్న భోజనం కోసం గ్యాస్ స్టౌపై వంట చేయాలంటే రోజుకు ఒక సిలిండర్ కావాలి. అంటే గ్యాస్‌కు రోజుకు రూ.600 నుంచి రూ.800 అవససం. కట్టెల పోయ్యిపై ఖర్చులో కాస్త వెసలుబాటు ఉంటుంది. రూ.3,000 వెచ్చించి ఓ ట్రాక్టర్ కట్టెలు కొనుగోలు చేస్తే వారం వంట చేయవచ్చు. దీంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నారు.
పెడనలోని బంగళా ప్రాథమిక పాఠశాలలో 70 మంది విద్యార్థులకు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. గ్యాస్ స్టౌ పై వండితే తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు సిలిండర్ అయిపోతే సకాలంలో అందడం లేదని, కట్టెల పొయ్యిపైనే వంట చేస్తున్నామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీలో కోత విధించడంతో రోజు వారి కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.