పెళ్లింట్లో భారీ చోరీ
పెళ్లింట్లో భారీ చోరీ
Published Wed, Apr 26 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 9:46 AM
పెళ్లి జరిగిన ఇల్లు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, బంధువులతో సహా అంతా అర్ధరాత్రి వరకూ కబుర్లతో కాలక్షేపం చేసి అప్పుడే నిద్రించారు. వేసవి రాత్రులు కావడంతో ఉక్కపోత వల్ల తలుపులు బార్ల తెరిచారు. ఇదే అదను కోసం ఎదురుచూస్తున్న దొంగలు నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించారు. మహిళల మెడల్లో బంగారు చై న్‌లతో సహా మొత్తం క్షణాల్లో ఊడ్చేశారు. ఏం జరిగిందో తెలుసుకుని బాధితులు కేకలు వేసే లోగానే చీకట్లో మాయమైపోయారు. వివరాల్లోకి వెళ్తే.. –కొవ్వూరు రూరల్
కొవ్వూరు మండలం ధర్మవరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంటన్నర సమయంలో పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం గ్రామానికి చెందిన బొప్పన శ్రీనివాస్ తన మొదటి కుమార్తె వివాహం ఈ నెల 21వ తేదీన జరిపారు. ఈ క్రమంలో పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు అల్లుడు సురేష్, కుమార్తె అలేఖ్య ఇంట్లో నిద్రిస్తున్నారు. వేసవి కావడంతో ఇంటి తలుపులు తెరుచుకుని నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. డ్రెస్సింగ్ టేబుల్‌పై ఉంచిన పెళ్లి కుమారుడి ఆరు కాసుల బంగారపు చైను, ఆరు కాసుల మూడు ఉంగరాలు, అక్కడే నిద్రిస్తున్న పెళ్లి కుమార్తె మెడలో ఉన్న నాను తాడును లాగేయడంతో మూడువంతుల తాడు దొంగ చేతికి వెళ్లింది. అంతేకాకుండా గుంటూరు నుంచి వివాహానికి వచ్చిన వృద్ధురాలు
నల్లమోతు హనుమాయమ్మ తను నిద్రిస్తున్న మంచం తలగడ కింద ఉంచిన సుమారు 8 కాసుల రెండు గొలుసులను దోచుకుపోయారు. వెళుతూవెళుతూ పక్కగదిలో ఉన్న శ్రీనివాస్ చిన్న కుమార్తె సౌజన్య మెడలో సుమారు 4 కాసుల గొలుసును తెంపే ప్రయత్నం చేశారు. అయితే సౌజన్య మేల్కొని కేకలు వేస్తూ వెంబడించడంతో వారు పారిపోయారు. మొత్తం చోరీకి గురైన బంగారం 27 కాసుల వరకూ ఉండవచ్చని పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. అంతకు ముందు రాత్రి 12 గంటల ప్రాంతంలో ధర్మవరం కొత్తకాలనీలో దోపిడీకి ప్రయత్నించగా అక్కడి వారు గుర్తించి కేకలు వేయడంతో నలుగురు వ్యక్తులు పారిపోయారని చెబుతున్నారు.
డాగ్‌స్కా్వడ్, క్లూస్ టీం పరిశీలన
చోరీ జరిగిన ఇంటిని కొవ్వూరు రూరల్ సీఐ సి.శరత్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో ప్రతి అంగుళాన్ని పోలీసులు ఆధారాల కోసం వెతికారు. రాజమండ్రి నుంచి షాడో అనే జాగిలాన్ని తెప్పించి ఆ ప్రాంతమంతా పరిరక్షించారు. దొంగలు పారిపోతుండగా కంగారులో చేతి నుంచి జారిన పెండ్లి కుమారుడి మనీ çపర్స్‌ను జాగిలానికి వాసన చూపి వదిలారు. అయితే అది ఇంటి వద్ద నుంచి బయలు దేరి ధర్మవరం–కాపవరం ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువ వరకూ వెళ్లి వెనుదిరిగింది. క్లూస్ టీం బృందం నిందితుల వేలి ముద్రలను సేకరించింది.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు సేకరించామని, త్వరలో వారిని పట్టుకుంటామని తెలిపారు. రూరల్ ఎస్సై ఎం.శ్యాం సుందరరావు, సీసీఎస్ ఎస్సై పి. శ్రీనివాస సింగ్, సిబ్బంది
పాల్గొన్నారు.
దొంగ వెంట పరిగెట్టాను
ఎవరో మెడలో చై న్‌లాగడంతో వెంటనే మెలకువ వచ్చింది. భయంతో కళ్లు తెరిచేసరికి మెడలో చై న్ లాక్కుని వెళుతున్న దొంగ కనిపించాడు. పెద్దగా కేకలు వేస్తూ దొంగ వెంట పరిగెట్టాను.. అయినా తప్పించుకుని పారిపోయాడు. బంధువులంతా ఇంట్లో ఉండగానే దొంగలు చొరబడి చోరీ చేయడంతో అంతా ఆందోళనగా ఉన్నాం. –బొప్పన సౌజన్య, ధర్మవరం
Advertisement