డబ్బింగ్ సీరియళ్లపై మరోసారి ఉద్యమం
సాక్షి, సిటీబ్యూరో: డబ్బింగ్ సీరియళ్లతో తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్ల జీవితాలు రోడ్డున పడుతున్నాయని ‘తెలుగు టెలివిజన్ యూనియన్’ మరోసారి ఉద్యమానికి సిద్ధమైంది. ఫిలిం చాంబర్‌లో ‘తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ యూనియన్’ సభ్యులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘డబ్బింగ్ సీరియళ్లతో ఇక్కడ ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉపాధి కోల్పోతున్నారు. వీటిని ఆపేయాలని ఒకసారి ఉద్యమం చేశాం.
మరోసారి ఉద్యమం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని అడ్డుకుంటామ’ని చెప్పారు. అనంతరం బుల్లితెర నటీనటుల డైరెక్టరీని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేశారు. నిర్మాత గురురాజ్, టీవీ ఫెడరేషన్ చైర్మన్ మేచినేని శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. తెలుగు టెలివిజన్ ఆర్టిస్టు సంఘం అధ్యక్షుడు వినోద్‌బాల, సెక్రటరీ విజయ్ యాదవ్, నటులు శివాజీ రాజా, రామ్‌జగన్, నాగమణి, సుబ్బారావు పలువురు టీవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు.