మేమున్నాంగా..! | Telugu characters in tollywood | Sakshi
Sakshi News home page

మేమున్నాంగా..!

Published Sat, May 7 2016 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

మేమున్నాంగా..!

మేమున్నాంగా..!

‘తెలుగు క్యారెక్టర్ లేదు’ పేరుతో వచ్చిన వ్యాసం పరిశ్రమలో కుతూహలం రేపిందనే చెప్పాలి. అవును ఇది సత్యం అన్నారు కొందరు. ఏం... మన వాళ్లకు మాత్రం ఏం తక్కువ అని మరికొందరు అన్నారు. పరాయి భాషల నుంచి ఎందరు వచ్చినా తెలుగువారికి మించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కడా ఉండరని ఎక్కువ మంది అభిప్రాయం. చరిత్రను గమనిస్తే ఆ మాటే నిజమనిపిస్తుంది. తెలుగు సినీ కాలర్‌ను గర్వంగా ఎగరేయ బుద్ధేస్తుంది. అందుకే తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక ఝలక్.
 
తెలుగు సినిమా పుట్టడమే క్యారెక్టర్‌తో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌తో పుట్టింది. దాదాపు మన తొలి తెలుగు హీరో అయిన చిత్తూరు నాగయ్య తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులకు తాత వంటి వారైతే తండ్రి హోదాలో ఎస్.వి.రంగారావు రాజ్యాలు ఏలారు. సి.ఎస్.ఆర్, గుమ్మడి, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, నాగభూషణం, రాజనాల, ప్రభాకర రెడ్డి... వంటి హేమాహేమీలు ఆ వరుసలో ప్రేక్షకుల హృదయ డైనమోల మీద గిర్రున తిరిగారు.
 
రావు గోపాలరావు ఏర్పరచిన ఖాళీ...
తెలుగు సినిమా రంగంలో ఒక దశలో రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలా బిజీగా ఉన్నారు. అంటే వీరు లేని సినిమా ఉండేది కాదు. ఈ సందర్భంలో రావు గోపాలరావు అనారోగ్యం, నూతన్ ప్రసాద్‌కు జరిగిన ప్రమాదం దాదాపు తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టుల రంగంలో పెద్ద లోటు ఏర్పరచబోయింది. ఆ ఖాళీని చాలా ప్రతిభావంతంగా కోట శ్రీనివాసరావు పూరించారు. ‘ప్రతిఘటన’తో నలుగురి దృష్టిలో పడ్డ ఈయన ‘శతృవు’ సినిమాతో టాప్ విలన్ అయ్యారు.

ఈయనతో పాటుగా గొల్లపూడి మారుతీరావు, సుత్తి వీరభద్రరావు వంటి నటులు తెలుగు సినిమాలలో ఉండే ముఖ్యమైన పాత్రలను అవి సీరియస్‌గాని హాస్యంగాని స్థిరంగా నిర్వహిస్తూ క్యారెక్టర్‌కే క్యారెక్టర్ తీసుకువచ్చారు. అయితే గుమ్మడి సినీ విరమణ ఇంటి పెద్ద పాత్రలకు ఖాళీ ఏర్పరచింది. ఆ తరహా పాత్రలు చేసే జె.వి.సోమయాజులకు వచ్చిన మూస కూడా పెద్ద వెలితిని ఏర్పరచింది. దీనిని తెలుగు తెలిసిన, ఒక దర్శకుడిగా తెలుగు నటన ఆనుపానులు తెలిసిన కె.విశ్వనాథ్ అంది పుచ్చుకున్నారు. ‘శుభ సంకల్పం’ సినిమాతో మొదలైన ఆ ప్రయాణం ‘నరసింహ నాయుడు’తో పైస్థాయికి చేరుకుని చివరకు ఆయననే ముఖ్యపాత్రగా చేసి కథలు రాసే వరకు వెళ్లింది.
 
రచయితలే నటులు...
రచయితలు తెర మీద తళుక్కుమనడం గతంలో చాలా అరుదుగా ఉండేది. ఆత్రేయ, ఆరుద్రలాంటివారు అడపా దడపా కనిపించారు కూడా. కాని డి.వి.నరసరాజు, మల్లెమాల, త్రిపురనేని మహారథి వంటి రచయితలు సీరియస్‌గానే పాత్రలు పోషించే ప్రయత్నం చేశారు. మల్లెమాల నటించిన ‘అంకుశం’ పెద్ద హిట్ కావడం అందరికీ గుర్తే. అదే ఆనవాయితీని కాశీ విశ్వనాథ్, ఓంకార్, పరుచూరి సోదరులు కొనసాగించినా ప్రొఫెషనల్ స్థాయిలో తనికెళ్ల భరణి, ఎం.ఎస్.నారాయణ, ఎల్.బి.శ్రీరాం, కృష్ణ భగవాన్ నిర్వహించారు. దీనికి కొనసాగింపే ఇప్పుడు దాదాపు ప్రతి సినిమాలో కనిపిస్తున్న పోసాని కృష్ణమురళి చూపిస్తున్న హవా... పొందుతున్న క్రేజ్. దాదాపు వంద సినిమాలకు రాసిన ఈ రచయిత దాదాపు ఆ ఐడెంటిటీని ప్రేక్షకులు మర్చిపోయేంత స్థాయిలో నటుడిగా కొనసాగుతున్నారు.
శరత్‌బాబు, గిరిబాబు...
తెలుగు వారు ఎప్పటికీ విసుగు ప్రదర్శించని క్యారెక్టర్ ఆర్టిస్టులు శరత్‌బాబు, గిరిబాబు... వందల సినిమాల్లో నటించి వీరు తమ ప్రతిభను చాటుకున్నారు. వీరి కంటే ఎక్కువగా క్లాస్‌నూ మాస్‌నూ ఆకర్షించిన మోహన్‌బాబు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉంటూనే హీరోగా సంచలనాలు సాధించే స్థితికి చేరుకోవడంతో ప్రతిసారీ ఆ ఖాళీని పూరించడం మాత్రం తెలుగు తెరకు సాధ్యం కాలేదు. పరభాష నుంచి వచ్చిన చరణ్‌రాజ్, ప్రకాష్ రాజ్ ఈ స్పేస్‌ను ఉపయోగించుకుని ఎదిగినవారే. ఇదే స్పేస్‌ను నింపడానికి వచ్చిన శ్రీహరి తిరిగి హీరో కావడమూ ఆ తర్వాత హటాన్మరణం చెందడంతో దానిని నింపే పని జగపతిబాబు మీద పడింది.
 
నాటి హీరోలే...
హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారే ఆనవాయితీ ముందు నుంచీ ఉన్నా దానిని దుబారా చేయకుండా అందంగా హుందాగా నిర్వర్తించిన నటుడు అక్కినేని. ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన కాంతారావు కూడా మంచి క్యారెక్టర్లతోనే తన ప్రయాణం కొనసాగించారు. అదే వరుసలో మురళీమోహన్, చంద్రమోహన్, సీనియర్ నరేశ్, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, జగపతిబాబు కూడా తెలుగు కేరెక్టర్‌ను సగౌరవ స్థితిలో ఉంచే తరహా పాత్రలు చేస్తూ ఆదరణ పొందుతున్నారు. ముఖ్యంగా యువ హీరోలకు తండ్రి పాత్రధారులుగా రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్, జగపతి బాబు ముందు వరుసలో ఉన్నారు. మొదటి ఇద్దరితో పోలిస్తే విలన్‌గా కూడా వేస్తూ జగపతిబాబు ఎక్కువ అవకాశాలు పొందుతున్నారని చెప్పాలి. ఆయన నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘శ్రీమంతుడు’, ‘నాన్నకు ప్రేమతో’ పేరు తెచ్చి పెట్టాయి.
 
గట్టి నటుడు...
తెలుగులో ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎక్కువ డిమాండ్ ఉన్న నటుడు రావు రమేశ్ అని చెప్పాలి. రావు గోపాలరావు తనయుడిగా తండ్రికి తగ్గ కొడుకుగా మంచి వాచకం, అభినయం, రూపంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడాయన. రావు రమేశ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, ‘ముకుందా’, ‘జులాయి’, ‘సినిమా చూపిస్త మావా’... తదితర చిత్రాలు ఆయనకు భారీగా పేరు తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఒక మంచి పాత్ర ఉంటే రావు రమేశ్ వైపు చూడటం దర్శక నిర్మాతల ఆనవాయితీ అయ్యింది.
 
ప్రతిభకు కొదవలేదు...
తెలుగులో ప్రతిభకు కొదవ లేదు. శుభలేఖ సుధాకర్, చలపతిరావు, రాళ్లపల్లి, సూర్య, బ్రహ్మాజీ, నాగినీడు, రఘుబాబు, రవిబాబు, జీవా, సుబ్బరాజు, జయప్రకాశ్‌రెడ్డి, రాజీవ్ కనకాల, అజయ్, శివాజీ రాజా, రాజా రవీంద్ర, ఉత్తేజ్, చిన్నా, బెనర్జీ, దర్శకుడు కాశీ విశ్వనాథ్, సమీర్ వంటి నటులు ఎందరో తమ ప్రతిభకు సవాలుగా నిలిచే పాత్రలు చేస్తున్నారు. వాటి కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కాకుండా నాటక రంగంలో, టివి రంగంలో కూడా ఎందరో ప్రతిభావంతమైన నటులు ఉన్నారు.
 కావల్సిందల్లా ఆ వజ్రాలను వెతికే ఓపిక.
 
వాటిని సాన పెట్టాల్సిన నైపుణ్యం.
తెలుగులో దాసరి, తమిళంలో కె.బాలచందర్ ఎందరో నటీనటులను అందించారు. ఈతరం దర్శకులు కూడా మనసు పెడితే మన తెర మనవాళ్లతోనే వెలగడం పెద్ద కష్టం కాదు. ఈ తారల మధ్య అప్పుడప్పుడు పరాయి భాషల తారలు తళుక్కుమంటే మనకేం అభ్యం తరం చెప్పండి. పైగా అది చూడ ముచ్చటగా ఉంటుంది కూడా. శుభం.
 - శ్రీ
 
కొన్ని మరువలేని పాత్రలు:
పెద్దమనుషులు (రేలంగి), లవకుశ (చిత్తూరు నాగయ్య), మాయాబజార్ (ఎస్వీరంగారావు), మంచి మనసులు (నాగభూషణం), పండంటి కాపురం (గుమ్మడి), ముత్యాలముగ్గు (కాంతారావు), గోరింటాకు (ప్రభాకర్‌రెడ్డి), శుభలేఖ (కైకాల సత్యనారాయణ), శంకరాభరణం (అల్లు రామలింగయ్య), సాగర సంగమం (శరత్‌బాబు), పట్నం వచ్చిన పతివ్రతలు (నూతన్ ప్రసాద్), మా ఊళ్లో మహాశివుడు (రావు గోపాలరావు), మయూరి (పి.ఎల్. నారాయణ), పుణ్యస్త్రీ (రాజేంద్రప్రసాద్), సంసారం ఒక చదరంగం (గొల్లపూడి), పెళ్లాం చెబితే వినాలి(గిరిబాబు), అల్లుడుగారు (చంద్రమోహన్).... ఇంకా మరెన్నో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement