Telugu character
-
మేమున్నాంగా..!
‘తెలుగు క్యారెక్టర్ లేదు’ పేరుతో వచ్చిన వ్యాసం పరిశ్రమలో కుతూహలం రేపిందనే చెప్పాలి. అవును ఇది సత్యం అన్నారు కొందరు. ఏం... మన వాళ్లకు మాత్రం ఏం తక్కువ అని మరికొందరు అన్నారు. పరాయి భాషల నుంచి ఎందరు వచ్చినా తెలుగువారికి మించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కడా ఉండరని ఎక్కువ మంది అభిప్రాయం. చరిత్రను గమనిస్తే ఆ మాటే నిజమనిపిస్తుంది. తెలుగు సినీ కాలర్‌ను గర్వంగా ఎగరేయ బుద్ధేస్తుంది. అందుకే తెలుగు ఆర్టిస్టుల గురించి ఒక ఝలక్. తెలుగు సినిమా పుట్టడమే క్యారెక్టర్‌తో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌తో పుట్టింది. దాదాపు మన తొలి తెలుగు హీరో అయిన చిత్తూరు నాగయ్య తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులకు తాత వంటి వారైతే తండ్రి హోదాలో ఎస్.వి.రంగారావు రాజ్యాలు ఏలారు. సి.ఎస్.ఆర్, గుమ్మడి, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, నాగభూషణం, రాజనాల, ప్రభాకర రెడ్డి... వంటి హేమాహేమీలు ఆ వరుసలో ప్రేక్షకుల హృదయ డైనమోల మీద గిర్రున తిరిగారు. రావు గోపాలరావు ఏర్పరచిన ఖాళీ... తెలుగు సినిమా రంగంలో ఒక దశలో రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చాలా బిజీగా ఉన్నారు. అంటే వీరు లేని సినిమా ఉండేది కాదు. ఈ సందర్భంలో రావు గోపాలరావు అనారోగ్యం, నూతన్ ప్రసాద్‌కు జరిగిన ప్రమాదం దాదాపు తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టుల రంగంలో పెద్ద లోటు ఏర్పరచబోయింది. ఆ ఖాళీని చాలా ప్రతిభావంతంగా కోట శ్రీనివాసరావు పూరించారు. ‘ప్రతిఘటన’తో నలుగురి దృష్టిలో పడ్డ ఈయన ‘శతృవు’ సినిమాతో టాప్ విలన్ అయ్యారు. ఈయనతో పాటుగా గొల్లపూడి మారుతీరావు, సుత్తి వీరభద్రరావు వంటి నటులు తెలుగు సినిమాలలో ఉండే ముఖ్యమైన పాత్రలను అవి సీరియస్గాని హాస్యంగాని స్థిరంగా నిర్వహిస్తూ క్యారెక్టర్‌కే క్యారెక్టర్ తీసుకువచ్చారు. అయితే గుమ్మడి సినీ విరమణ ఇంటి పెద్ద పాత్రలకు ఖాళీ ఏర్పరచింది. ఆ తరహా పాత్రలు చేసే జె.వి.సోమయాజులకు వచ్చిన మూస కూడా పెద్ద వెలితిని ఏర్పరచింది. దీనిని తెలుగు తెలిసిన, ఒక దర్శకుడిగా తెలుగు నటన ఆనుపానులు తెలిసిన కె.విశ్వనాథ్ అంది పుచ్చుకున్నారు. ‘శుభ సంకల్పం’ సినిమాతో మొదలైన ఆ ప్రయాణం ‘నరసింహ నాయుడు’తో పైస్థాయికి చేరుకుని చివరకు ఆయననే ముఖ్యపాత్రగా చేసి కథలు రాసే వరకు వెళ్లింది. రచయితలే నటులు... రచయితలు తెర మీద తళుక్కుమనడం గతంలో చాలా అరుదుగా ఉండేది. ఆత్రేయ, ఆరుద్రలాంటివారు అడపా దడపా కనిపించారు కూడా. కాని డి.వి.నరసరాజు, మల్లెమాల, త్రిపురనేని మహారథి వంటి రచయితలు సీరియస్‌గానే పాత్రలు పోషించే ప్రయత్నం చేశారు. మల్లెమాల నటించిన ‘అంకుశం’ పెద్ద హిట్ కావడం అందరికీ గుర్తే. అదే ఆనవాయితీని కాశీ విశ్వనాథ్, ఓంకార్, పరుచూరి సోదరులు కొనసాగించినా ప్రొఫెషనల్ స్థాయిలో తనికెళ్ల భరణి, ఎం.ఎస్.నారాయణ, ఎల్.బి.శ్రీరాం, కృష్ణ భగవాన్ నిర్వహించారు. దీనికి కొనసాగింపే ఇప్పుడు దాదాపు ప్రతి సినిమాలో కనిపిస్తున్న పోసాని కృష్ణమురళి చూపిస్తున్న హవా... పొందుతున్న క్రేజ్. దాదాపు వంద సినిమాలకు రాసిన ఈ రచయిత దాదాపు ఆ ఐడెంటిటీని ప్రేక్షకులు మర్చిపోయేంత స్థాయిలో నటుడిగా కొనసాగుతున్నారు. శరత్‌బాబు, గిరిబాబు... తెలుగు వారు ఎప్పటికీ విసుగు ప్రదర్శించని క్యారెక్టర్ ఆర్టిస్టులు శరత్‌బాబు, గిరిబాబు... వందల సినిమాల్లో నటించి వీరు తమ ప్రతిభను చాటుకున్నారు. వీరి కంటే ఎక్కువగా క్లాస్‌నూ మాస్‌నూ ఆకర్షించిన మోహన్‌బాబు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉంటూనే హీరోగా సంచలనాలు సాధించే స్థితికి చేరుకోవడంతో ప్రతిసారీ ఆ ఖాళీని పూరించడం మాత్రం తెలుగు తెరకు సాధ్యం కాలేదు. పరభాష నుంచి వచ్చిన చరణ్‌రాజ్, ప్రకాష్ రాజ్ ఈ స్పేస్‌ను ఉపయోగించుకుని ఎదిగినవారే. ఇదే స్పేస్‌ను నింపడానికి వచ్చిన శ్రీహరి తిరిగి హీరో కావడమూ ఆ తర్వాత హటాన్మరణం చెందడంతో దానిని నింపే పని జగపతిబాబు మీద పడింది. నాటి హీరోలే... హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారే ఆనవాయితీ ముందు నుంచీ ఉన్నా దానిని దుబారా చేయకుండా అందంగా హుందాగా నిర్వర్తించిన నటుడు అక్కినేని. ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన కాంతారావు కూడా మంచి క్యారెక్టర్లతోనే తన ప్రయాణం కొనసాగించారు. అదే వరుసలో మురళీమోహన్, చంద్రమోహన్, సీనియర్ నరేశ్, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, జగపతిబాబు కూడా తెలుగు కేరెక్టర్‌ను సగౌరవ స్థితిలో ఉంచే తరహా పాత్రలు చేస్తూ ఆదరణ పొందుతున్నారు. ముఖ్యంగా యువ హీరోలకు తండ్రి పాత్రధారులుగా రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్, జగపతి బాబు ముందు వరుసలో ఉన్నారు. మొదటి ఇద్దరితో పోలిస్తే విలన్‌గా కూడా వేస్తూ జగపతిబాబు ఎక్కువ అవకాశాలు పొందుతున్నారని చెప్పాలి. ఆయన నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘శ్రీమంతుడు’, ‘నాన్నకు ప్రేమతో’ పేరు తెచ్చి పెట్టాయి. గట్టి నటుడు... తెలుగులో ప్రస్తుతం కేరెక్టర్ ఆర్టిస్టుగా ఎక్కువ డిమాండ్ ఉన్న నటుడు రావు రమేశ్ అని చెప్పాలి. రావు గోపాలరావు తనయుడిగా తండ్రికి తగ్గ కొడుకుగా మంచి వాచకం, అభినయం, రూపంతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడాయన. రావు రమేశ్ నటించిన ‘అత్తారింటికి దారేది’, ‘ముకుందా’, ‘జులాయి’, ‘సినిమా చూపిస్త మావా’... తదితర చిత్రాలు ఆయనకు భారీగా పేరు తెచ్చి పెట్టాయి. ప్రస్తుతం ఒక మంచి పాత్ర ఉంటే రావు రమేశ్ వైపు చూడటం దర్శక నిర్మాతల ఆనవాయితీ అయ్యింది. ప్రతిభకు కొదవలేదు... తెలుగులో ప్రతిభకు కొదవ లేదు. శుభలేఖ సుధాకర్, చలపతిరావు, రాళ్లపల్లి, సూర్య, బ్రహ్మాజీ, నాగినీడు, రఘుబాబు, రవిబాబు, జీవా, సుబ్బరాజు, జయప్రకాశ్‌రెడ్డి, రాజీవ్ కనకాల, అజయ్, శివాజీ రాజా, రాజా రవీంద్ర, ఉత్తేజ్, చిన్నా, బెనర్జీ, దర్శకుడు కాశీ విశ్వనాథ్, సమీర్ వంటి నటులు ఎందరో తమ ప్రతిభకు సవాలుగా నిలిచే పాత్రలు చేస్తున్నారు. వాటి కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కాకుండా నాటక రంగంలో, టివి రంగంలో కూడా ఎందరో ప్రతిభావంతమైన నటులు ఉన్నారు. కావల్సిందల్లా ఆ వజ్రాలను వెతికే ఓపిక. వాటిని సాన పెట్టాల్సిన నైపుణ్యం. తెలుగులో దాసరి, తమిళంలో కె.బాలచందర్ ఎందరో నటీనటులను అందించారు. ఈతరం దర్శకులు కూడా మనసు పెడితే మన తెర మనవాళ్లతోనే వెలగడం పెద్ద కష్టం కాదు. ఈ తారల మధ్య అప్పుడప్పుడు పరాయి భాషల తారలు తళుక్కుమంటే మనకేం అభ్యం తరం చెప్పండి. పైగా అది చూడ ముచ్చటగా ఉంటుంది కూడా. శుభం. - శ్రీ కొన్ని మరువలేని పాత్రలు: పెద్దమనుషులు (రేలంగి), లవకుశ (చిత్తూరు నాగయ్య), మాయాబజార్ (ఎస్వీరంగారావు), మంచి మనసులు (నాగభూషణం), పండంటి కాపురం (గుమ్మడి), ముత్యాలముగ్గు (కాంతారావు), గోరింటాకు (ప్రభాకర్‌రెడ్డి), శుభలేఖ (కైకాల సత్యనారాయణ), శంకరాభరణం (అల్లు రామలింగయ్య), సాగర సంగమం (శరత్‌బాబు), పట్నం వచ్చిన పతివ్రతలు (నూతన్ ప్రసాద్), మా ఊళ్లో మహాశివుడు (రావు గోపాలరావు), మయూరి (పి.ఎల్. నారాయణ), పుణ్యస్త్రీ (రాజేంద్రప్రసాద్), సంసారం ఒక చదరంగం (గొల్లపూడి), పెళ్లాం చెబితే వినాలి(గిరిబాబు), అల్లుడుగారు (చంద్రమోహన్).... ఇంకా మరెన్నో. -
తెలుగు 'క్యారెక్టర్' లేదు
అల్లు అర్జున్ తండ్రి క్యారెక్టర్ వేయడానికి తెలుగులో ‘సరైనోడు’ లేడట! తమిళ జయప్రకాశ్‌ను తెచ్చుకున్నారు! ‘మిర్చి’లో ప్రభాస్ తండ్రి పాత్ర చేయడానికి తెలుగువాళ్ళలో గుంటూరు కారం లేదట! సత్యరాజ్‌ను ఇంపోర్ట్ చేసుకున్నారు! ‘అత్తారింటి’ని ‘దారి’లో పెట్టాలనుకున్న కల్యాణ్‌కి తెలుగు తాత దొరకలేదట! బాంబే ‘దారి’ పట్టాల్సి వచ్చింది! బొమన్ ఇరానీని తేవాల్సి వచ్చింది! ‘భలే భలే మగాడి’కి భలే భలే తెలుగు మామా కరవేనట! హిందీ నుంచి మురళీశర్మను పిలిపించాల్సి వచ్చింది! ...ఇలా తెలుగు సినిమా ఇప్పుడు దారి మళ్ళింది. తెలుగు ‘క్యారెక్టర్’లపై మాకు గాలి మళ్ళింది. లేటెస్ట్ సమ్మర్ రిలీజ్ ‘సరైనోడు’లో హీరో అల్లు అర్జున్ అచ్చ తెలుగు తండ్రి పాత్ర చూశారా? ఆ పాత్ర వేసింది - తమిళ యాక్టర్ జయప్రకాశ్. ఆయనొక్కడే కాదు... ఇవాళ మన తెలుగు తెరపై కనిపిస్తున్న చాలామంది తండ్రులు, బాబాయ్‌లు పరాయిభాషల నుంచి వలస వచ్చిన యాక్టర్లే! ఇప్పుడు తెలుగు తెరపై క్యారెక్టర్లన్నీ వాళ్ళతోనే పండుతున్నాయి. పొరుగింటి పుల్లకూరే రుచా?! ‘‘మాకు వచ్చే అవకాశాలే తక్కువ. ఒక వేళ ఒకటీ అరా వచ్చినా, ఇచ్చినా - షూటింగ్లో వసతులుండవు. సరైన పారితోషికమూ ఇవ్వరు. కానీ, పరాయి రాష్ట్రాల నుంచి రప్పించిన నటీనటులకు మాత్రం మన దర్శక, నిర్మాతలు ఫైవ్‌స్టార్ హోటళ్ళు, వ్యక్తిగత మేకప్, హెయిర్స్టైలిస్ట్లతో సహా రాజభోగాలు అందిస్తారు’’ అని తెలుగువారైన సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకరు వాపోయారు. కళకు కులం, మతం, భాష, ప్రాంతం లాంటి ఎల్లలు ఉండవు. కరెక్టే! కానీ, పక్కా తెలుగు సినిమాలో అచ్చ తెలుగు పాత్రల్ని కూడా ఈ అరువు తారలతో నింపేయడం ఏమిటన్నది అవకాశాలు కోసం ఆకలితో ఎదురుచూస్తున్న ఈ స్థానిక తెలుగు కళాకారుల ఆవేదన. కానీ, బాహాటంగా ఆ విమర్శ చేస్తే, వచ్చే ఆ నాలుగు చిన్న వేషాలు కూడా రాకుండా పోతాయేమోనని చాలామంది ఆర్టిస్టులు పెదవి విప్పడం లేదు. కోట శ్రీనివాసరావు లాంటి ఒకరిద్దరు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లే ఈ అన్యాయంపై బాహాటంగా ఒకటికి రెండుసార్లు గతంలో వ్యాఖ్యానించారు. మనకి మనవాళ్ళు లేరా? పనికిరారా? నిజానికి, తెలుగులో తెలుగువాళ్ళయిన క్యారెక్టర్ ఆర్టిసులు లేరా అంటే, ఉన్నారు. అద్భుతమైన నటులున్నారు. కోట శ్రీనివాసరావు నుంచి ఇప్పుడు మళ్ళీ కొత్త ఊపందుకున్న నరేశ్, రాజేంద్రప్రసాద్ దాకా సీనియర్లున్నారు. నిన్నటి సాయికుమార్ మొదలు ఇవాళ్టి కొత్త తరం రావు రమేశ్, అజయ్, సుబ్బరాజు దాకా అనేకమంది ఉన్నారు. అంతమంది ఉన్నా గత సినిమా సక్సెస్‌ను బట్టే తప్ప, వాళ్ళ అసలుసిసలు ప్రతిభను గుర్తించి, ప్రోత్సహిస్తున్న సందర్భాలు అరుదని వాపోతున్నారు. మనవాళ్ళకు వచ్చే అవకాశాలు, ఇచ్చే పారితోషికాలతో పోలిస్తే, పరభాషా నటులదే పైచేయి! వెరసి, స్థానిక కళాకారులు ఇప్పుడు ‘ద్వితీయ శ్రేణి పౌరులు’గా మిగిలిపోతున్నారు. ఈ విషయంలో ఏదైనా చేసి, స్థానిక కళాకారులకు ఛాన్స్‌లు వచ్చేందుకు తమ వంతుగా ఏదో ఒకటి చేయాలని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. బడ్జెట్... తడిసి మోపెడు! ఆ మాట ఎలా ఉన్నా, సినిమా బడ్జెట్ పైనా ఈ ప్రభావం పడుతోంది. ‘‘పరాయి రాష్ట్రాల నుంచి వస్తున్న నటులకు వారి వారి స్థాయిని బట్టి రోజుకు లక్ష పైగానే పారితోషికం ఇస్తున్నాం. వారి వెంట వచ్చే అసిస్టెంట్స్‌కూ రాజభోగాలే. ఇక, రానూపోనూ విమానం టికెట్లు, షూటింగ్లో ప్రత్యేకంగా క్యారవాన్ల ఖర్చు సరేసరి. ఇవాళ తెలుగు సినిమా బడ్జెట్ తడిసిమోపెడవడానికి ఇదీ ఒక కారణమే’’ అని సినీరంగంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ప్రొడక్షన్ కంట్రోలర్ ఒకరు వ్యాఖ్యానించారు. పెద్దవాళ్ళయిన పరాయి నటులు కొందరికైతే పాతిక లక్షల పైగా చెల్లిస్తున్నారు. తాజాగా ‘జనతా గ్యారేజ్’లో నటించడానికి మోహన్‌లాల్‌కు ఎనిమిది అంకెల పారితోషికం చెల్లించినట్లు కృష్ణానగర్ గుసగుస. వట్టి ఇంపోర్టేనా? ఎక్స్పోర్ట్ లేదా? బ్లాక్ అండ్ వైట్ సినిమాల యుగంలో ఎస్వీ రంగారావు, కన్నాంబ, సావిత్రి లాంటి వాళ్ళు స్వచ్ఛమైన ఉచ్చారణతో ‘అచ్చమైన అరవవాళ్ళ’ను మించి మరీ తమిళనాడును ఏలారు. తమిళ ప్రేక్షకులకు ఇంట్లో మనుషులయ్యారు. కానీ, ఇప్పుడు తెలుగుగడ్డ నుంచి ఇతర భాషల్లోకి వెళ్ళి అక్కడ నటిస్తున్నవారు కొద్దిమందే! కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం లాంటి ఒకరిద్దరు మటుకే పరాయి భాషల సినిమాల్లో అప్పుడప్పుడు మన ఉనికిని గుర్తుచేస్తున్నారు. హీరో నుంచి క్యారెక్టర్ యాక్టర్‌గా మారిన జగపతిబాబు మాత్రం ఒకట్రెండు తాజా ఛాన్సలతో తెలుగు నుంచి తమిళ, మలయాళాలకూ ఎగుమతి అయ్యారు. కానీ, అప్పుడూ ఇప్పుడూ మన నుంచి ఎగుమతి కన్నా దిగుమతే ఎక్కువ. అందుకే, ఇవాళ తెలుగు తెర అరవ, హిందీ తారలతో నేటివిటీని వదులుకొని, పరాయి అత్తరు పులుముకొంటోంది. ‘‘అవార్డ్స కూడా సాధించిన ఇన్నేళ్ళ తరువాత కూడా సినీరంగంలోకి కొత్తగా కాలుపెట్టినవాడిలాగే ఉంది నా పరిస్థితి. మా కోసం రాసిన పాత్రలు లేవు. ఎవరి కోసమో రాసిన పాత్రలు ఆఖరి క్షణంలో మా కొస్తే, వాటితో సర్దుకోవాల్సి వస్తోంది’’ అని సాక్షాత్తూ సాయికుమార్ కూడా ఆ మధ్య కడుపు చించుకున్నారు. కానీ, ఆవేదన నిండిన ఈ మాటల్ని వినేవాళ్ళెవరన్నది ప్రశ్న. మార్కెట్ విస్తరణ వ్యూహమా? అసలు ఇలా పరాయివాళ్ళతో మన వెండితెరను ముంచెత్తుతున్న పాపం ప్రధానంగా మన దర్శకులదేనని ఒక ఆరోపణ. కానీ, దర్శకుల వాదన మాత్రం వేరుగా ఉంది. ‘పరాయిభాషల వాళ్ళయినంత మాత్రాన వారి ప్రతిభను మనం ఉపయోగించుకోకూడదా’ అన్నది వారి ప్రశ్న. పైగా, ప్రపంచీకరణ నేపథ్యంలో భాష, ప్రాంతాల సరిహద్దులు చెరిగిపోతున్నప్పుడు ఇంకా భాషాభేదాల్ని పట్టుకు వేలాడడం తప్పంటున్నారు. పెపైచ్చు, దీనికి ఒక మార్కెట్ కోణాన్ని కూడా ఆపాదిస్తున్నారు. తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు తమిళ, మలయాళ, కన్నడ, ఉత్తరాది ప్రాంతాలకు కూడా క్రమంగా విస్తరిస్తోంది. అక్కడ మన సినిమాకు వ్యాపారం, వసూళ్ళు బాగా ఉండాలంటే - అక్కడ సుపరిచితమైన ఆ స్థానిక తారల్ని ఉపయోగించడం కూడా మార్కెట్ వ్యూహంలో భాగమే అన్నది దర్శక, నిర్మాతల వాదన. కానీ, ఎవరి వాదన ఎలా ఉన్నా... కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టులను అన్వేషించి, వారికి అవకాశాలిచ్చి ఆదరించిన దాసరి నారాయణరావు, జంధ్యాల, ఇ.వి.వి. సత్యనారాయణ లాంటి దర్శకుల తరం తరువాత ఇప్పుడు తెలుగు తెర బోసిపోయింది. స్థానికంగా నటుల్ని తయారుచేసుకొని, ప్రోత్సహించలేకపోతోంది. వెరసి, తెలుగు ‘క్యారెక్టర్’ మారిపోయింది! ఇంకా చెప్పాలంటే, తెలుగు ‘క్యారెక్టర్’ ఆల్మోస్ట్ లేకుండా పోయింది! - రెంటాల జయదేవ భారీగా పారితోషికాలు గతంలో ‘సినిమాకింత’ అని పారితోషికమిచ్చేవారు. నయా రియల్ ఎస్టేట్ నిర్మాతలు, వాళ్ళని మభ్యపెట్టిన కొందరు మేనేజర్ల వల్ల ‘రోజుకు ఇంత’ అనే సంస్కృతి వచ్చింది. మన తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల్లో చాలామంది పారితోషికం రోజుకి లక్ష లోపే. పరాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్‌కి మాత్రం పాపులారిటీ, గత సక్సెస్‌ని బట్టి రోజుకు లక్షల్లో ఇస్తున్నారని సినీవర్గాల మాట! ప్రకాశ్‌రాజ్: రూ. 75 లక్షలు- 1.5 కోట్లు (సిన్మాకిచ్చే డేట్స్ బట్టి) మోహన్‌లాల్: రూ. 1 కోటి పైనే (‘జనతా గ్యారేజ్, మనమంతా’) ఉపేంద్ర: రూ. 1.40 కోట్ల దాకా (‘సన్నాఫ్ సత్యమూర్తి’) సత్యరాజ్: రూ. 75 లక్షలు- కోటి (‘బాహుబలి2, బ్రహ్మోత్సవం’) సోనూసూద్: రూ. 80 లక్షలు - 1 కోటి (‘అతడు’కి రూ.4లక్షల్తో మొదలై, ‘జులాయి’కి 80 లక్షలకెదిగి, ఇప్పుడు కోటి తీసుకుంటున్నారు) ‘మిర్చి’ సంపత్‌రాజ్: రూ. 50 లక్షల పైనే (‘లౌక్యం, శ్రీమంతుడు’) బొమన్ ఇరానీ: 40లక్షలు (‘అత్తారింటికి దారేది, బెంగాల్ టైగర్’) మురళీశర్మ: రూ. 50 లక్షలు (‘సావిత్రి, భలేభలే మగాడివోయ్’) ముఖేశ్ బుషి: రోజుకు 1.5 - 2 లక్షలు (‘స్పీడున్నోడు, ఒక్కడు’) ఆశిష్ విద్యార్థి: రోజుకు 1 లక్ష పైనే (‘కల్యాణవైభోగమే, కిక్2’) మహేశ్‌మంజ్రేకర్: రోజుకు 1లక్ష పైనే (‘గుంటూర్ టాకీస్, అఖిల్’) జయప్రకాశ్: రోజుకు రూ. 1 లక్ష పైనే (‘సరైనోడు’) రహమాన్: రోజుకు1లక్ష పైనే (‘గోవిందుడు అందరివాడేలే, సింహ’) నాజర్: రోజుకు రూ. 1 లక్ష పైనే (‘బాహుబలి’) ‘‘ఇదివరకూ పరభాషా నటులున్నారు. ఈ మధ్య ఎక్కువయ్యారు. స్టార్ డెరైక్టర్ - స్టార్ హీరో కాంబినేషన్ల ట్రెండ్ వచ్చాక, ఇతర భాషల నుంచి నటీనటులను తీసుకుంటే అది పెద్ద ప్రాజెక్ట్ అవుతుందనే తప్పుడు ఆలో చనతో ఈ సంస్కృతి ఎక్కువైంది. మనకిక్కడ ఆర్టిస్టులు లేరనుకోవడం కరెక్ట్ కాదు! పరిశ్రమే నటీనటుల్ని తయారుచేసుకోవాలి. రంగస్థలం నుంచి నటుల్ని ప్రోత్సహించాలి.’’ - దర్శకుడు దాసరి నారాయణరావు