పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
Published Thu, Aug 11 2016 12:49 AM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
హన్మకొండ అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2004 నుంచి అమలు చేస్తున్న కాంట్రీబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంట్రీబ్యూటరీ ఉద్యోగుల సంఘం (టీసీపీఎస్‌ఈఏ) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో నిరసన ప్రదర్శన, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ స్టాక్ మార్కెట్‌పై ఆధారపడి కొనసాగే సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. సీపీఎస్ ఉద్యోగి రిటైర్డ్ అయితే వందల్లో కూడా పెన్షన్ వచ్చే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. సుమారు 30 ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారికి భద్రత లేని విధంగా ప్రస్తుత సీపీఎస్ పెన్షన్ విధానం ఉందన్నారు. గ్రాట్యూటీ లేకుండా చేసిన జీఓలు 653, 654, 655ను వెంటనే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి ఉద్యోగులను ఆదుకోవాలని వారు కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎన్.శ్రీనివాస్, జిల్లా సహ అధ్యక్షుడు వి.రాంబాబు, ఉపాధ్యక్షులు కుమారస్వామి, కె.శ్రీనివాస్‌రాజు, ఉదయ్‌భాస్కర్, జాయింట్ సెక్రటరీ కె.రమేష్, వినోద్, లింగస్వామి, సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement