హామీల అమలులో ప్రభుత్వం విఫలం
♦ ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌కుమార్ మక్కడ్
సత్తుపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వాగ్దానాలు ఇవ్వడమే తప్ప.. వాటిని అమలుపరిచే పరిస్థితి లేదని ఆలిండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌కుమార్ మక్కడ్ అన్నారు. మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన ప్రధాన వక్తగా వ్యవహరించారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై ఆయన సీపీఎం శ్రేణులకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం మినహా వాటిని అమలు చేసేందుకు శ్రద్ధ చూప డం లేదని విమర్శించారు. పెట్టుబడిదారులు లాభాలు ఆర్జించడం తప్ప ప్రజా ప్రయోజనాలు వారికి పట్టవన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాల నేపథ్యం, తెలంగాణ సాధించుకున్న తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుపై ఆయన వివరించారు. ఇటీవల కొందరు పోలీసులు ఆత్మహత్యలకు ఎందుకు పాల్ప డాల్సి వచ్చింది.. పై స్థాయి అధికారులు పెడుతున్న ఒత్తిడి తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
జిల్లా కమిటీ సభ్యులు వి.మల్సూరు సామాజిక సమస్యలు–పార్టీ వైఖరి అంశంపై బోధించారు. సత్తుపల్లి పట్టణ, రూరల్, వేంసూరు మండల కమిటీల ఆధ్వర్యంలో జరిగిన ఈ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌గా సీపీఎం మండల కార్యదర్శి రావుల రాజబాబు వ్యవహరించారు. పట్టణ కార్యదర్శి మోరంపూడి పాండురంగారావు, వేం సూరు మండల కార్యదర్శి అర్వపల్లి గోపాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం జాజిరి శ్రీనివాసరావు, కొత్తా సత్యనారాయణ, పాకలపాటి ఝాన్సీ, సీఐటీయూ మండల కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు, భాస్కర్‌రావు పాల్గొన్నారు.