డీమానిటైజేషన్ కార్ల్మార్క్స్ ఐడియా అట
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న డీమానిటైజేషన్ నిర్ణయంపై బీజేపీ మాజీ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి ఉమాభారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్లధనానికి వ్యతిరేకంగా మోదీ మార్క్సిస్టు ఎజెండాను అవలంబించారని పేర్కొన్నారు. తద్వారా భారత ప్రధాని మార్క్సిస్టు మహానాయకుడు కారల్ మార్క్స్ చెప్పిన సమాసమాజంకోసం పాటుపడుతున్నారన్నారు. నిజానికి ఇది మార్క్సిస్ట్ ఎజెండా. ఒకపుడు లోహియా, కాన్షీరామ్ చెప్పిన వాటిని ఇపుడు మన ప్రధానమంత్రి అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా మోదీ యోగి టర్న్డ్ సూపర్ హీరో అని ఉమ భారతి అభివర్ణించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్యూలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు.
మార్క్స్ అసమానతలు లేని సమసమాజం కోరుకున్నారన్నారు. ఒకవైపు ఒక మనిషి 12 గదుల ఇంట్లో ఉంటే, మరొక వైపు 12 మంది ఒకే గదిలోఉండడం ఆమోదయోగ్యం కాదన్నారు. కానీ 12గదులను బలవంతంగా ఆక్రమించు కోకూడదన్నారు. అందుకే పేద, ధనిక మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారన్నారు. నల్లధనాన్ని నిరోధించి, ఆ నగుదును జనధన్ ఖాతాల్లో, ముద్రా యోజన ఖాతాల్లో జమ అయ్యేలా మోదీ చర్యలు చేపట్టారని తెలిపారు. ఇందుకు వామపక్షవాదులు మోదీని అభినందించాలని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా భారత రాజకీయాల్లో అభివృద్ధి ఎజెండా తీసుకురావడం, పేదల సంక్షేమం కోసం అత్యాధునిక టెక్నాలజీ వినియోగం లాంటి మార్పులతోపాటూ యోగి నుంచి మహానాయకుడిగా అవతరించాన్నారు. దేశానికి మోదీలాంటి సూపర్ హీరో అవసరం చాలా వుందని ఉమా భారతి ప్రశంసల జల్లు కురిపించారు.