‘సోలార్’ బాధితులకు అండగా పాదయాత్ర
- రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
నంబులపూలకుంట:
మండలంలో ఏర్పాటు చేస్తున్న అల్ట్రామెగా సోలార్‌పవర్ ప్రాజెక్టులో భూములు కోల్పోయి పరిహారం రాని బాధిత రైతుల తరఫున పోరాటం సాగిస్తామని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డా.పి.వి.సిద్దారెడ్డి చేపట్టనున్న పాదయాత్రను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరిగిన వివాహవేడుకకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సరిహద్దు జిల్లాలైన వైఎస్‌ఆర్,అనంతపురం లో దాదాపు 10వేల ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న మెగా సోలార్ ప్రాజెక్టులో రైతులు భూములు కోల్పోయి ఉపాధి లేక వీదిన పడాల్సి వచ్చిందన్నారు. మూడేళ్లుగా రైతులకు మంజూరైన పరిహారాన్ని ఇవ్వకుండా సర్వే పేరుతో ప్రభుత్వం నీరుగార్చేలా ప్రవర్తిస్తోందన్నారు. అక్టోబర్‌లో సోలార్‌హబ్ నుంచి చేపట్టనున్న పాదయాత్రలో ప్రతి రైతూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సోలార్‌హబ్‌తో నష్టపోయిన బాధితుల రైతుల సమస్యను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రానున్న అసెంబ్సీ సమావేశాల్లో పట్టాలున్న 104 మంది రైతులతోపాటు పట్టాలులేని రైతులకు ఇవ్వాల్సిన పరిహారంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు.
బీమా పంపిణీలోనూ రైతులకు తీవ్ర అన్యాయం :
వర్షాబావంతో నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన బీమా పరిహారంలోనూ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని డా.పి.వి.సిద్దారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం మండలాల వారీగా ప్రకటించిన బీమా పరిహారానికి ప్రస్తుతం రైతులకు ఇస్తున్న పరిహారానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. బ్యాంకులు రైతుల వద్ద పట్టాదారు పాసుపుస్తకంలో ఉన్న విస్తీర్ణానికి బీమా ప్రీమియం చెల్లించుకున్నప్పటికీ పరిహారం వచ్చే సమయానికి సగం భూమికి మాత్రమే పరిహారం ఇవ్వడం దారుణమన్నారు. దీనిపై పూర్తి వివరాలతో హైకోర్టుకెళ్లి ప్రతి రైతుకూ తగిన పరిహారం అందేలా పోరాటం చేస్తామన్నారు.