శేషాచలం అటవీప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న జీఎం వెంకటేష్ పై పీడీయాక్ట్ నమోదు చేసినట్లు తిరుచానూరు సీఐ సురేంద్రనాయుడు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు...ఎర్రచందనం కేసులో పట్టుబడిన కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జిల్లా , హొస్కోట తాలూకా, జగదానహల్లీ, గోవిందపురం గ్రామానికి చెందిన జి.ఎం. వెంకటేష్ (30), తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులరెడ్డి (33), రేణిగుంట మండలం కురకాల్వకు చెందిన బాలాజీ అలియాస్ బాల (31), తిరుపతిలోని లీలామహల్ వద్ద నివాసం ఉంటున్న హరిబాబు(29)లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో... 2016 ఏప్రెల్ 7వ తేదీన సాయంత్రం తిరుచానూరు గ్రామ పంచాయితీ సమీపంలోని చైతన్యపురం ప్రైమరీ స్కూల్ సమీపంలో వీరిని అదుపులోకి తీసుకున్నారు.
రబ్బరుచెట్ల పొదల వద్ద వీరంతా దాంకొని ఉండగా పట్టుకోవడం జరిగింది. ఎర్రచందనం రవాణా చేసేందుకు ఉపయోగిస్తున్న స్కార్పియోతో పాటు 206 కేజీల బరువు ఉన్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అయితే జీఎం. వెంకటేష్ గతంలో కూడా తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని రేణిగుంట అర్బన్ పీఎస్ , చిత్తూరు జిల్లా పీలేరు పీఎస్, యర్రావారిపాళ్యం పీఎస్, కలకడ పీఎస్ ఇలా 6 కేసుల్లో ఎర్రచందనం అక్రమరవాణా చేస్తూ పట్టుబడ్డాడు.
నిందితుడుపై పీటీ ఆరెంట్ అరెస్ట్ కాబడి ప్రస్తుతం తిరుపతి సబ్‌జైల్‌లో ఉన్నాడు. ఇలా పలుకేసుల్లో నేరస్థులుగా ఉన్న వెంకటేష్‌పై పీడీ యాక్ట్ నమోదు చేస్తూ అర్బన్ జిల్లా పోలీసులు కలెక్టర్ సిద్దార్థజైన్‌కు సిఫార్సు చేశారు. ఈ సిఫార్సు మేరకు సోమవారం జీఎం వెంకటేష్‌పై పీడీయాక్ట్ నమోదు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అతని పై పీడీయాక్ట్ నమోదు చేసి తిరుపతి సబ్‌జైల్ నుంచి కడప సెంట్రల్ జైల్‌కు తరలించామన్నారు.