- రాష్ట్రంలో బీజేపీ యే ప్రత్యామ్నాయం
- టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరిస్తోంది
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి
ప్రధాని సభకు 8 వేల మంది కార్యకర్తలు
Published Sat, Aug 6 2016 11:36 PM | Last Updated on Mon, Oct 8 2018 4:55 PM
డిచ్‌పల్లి : హైదరాబాద్‌లో ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ హాజరవుతున్న బీజేపీ మహా సమ్మేళన్ సభకు జిల్లా నుంచి సుమారు 8 వేల మంది కార్యకర్తలు, నాయకులు తరలివెళుతున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తెలిపారు. శనివారం డిచ్‌పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని హోదాలో మోడీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారని, ఒక వైపు అభివృద్ధి శంకుస్థాపనలు మరో వైపు పార్టీ బలోపేతం కోసం బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. సభకు జిల్లా నుంచి బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో తరలి వెళుతున్నారని తెలిపారు. ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నారని, ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రూ. లక్ష కోట్లు నిధులు ఇచ్చారన్నారు. తెలంగాణలో బీజేపీ యే భవిష్యత్ ప్రత్యామ్నాయమన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. మల్లన్న సాగర్ కోసం తెచ్చిన జీవో నెంబరు 123ను హైకోర్టు కొట్టి వేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదని, ఇప్పటికైనా రైతు వ్యతిరేక విధానాలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి లింగం, జిల్లా ఉపాధ్యక్షుడు గద్దె భూమన్న, నాయకులు మేక బాగారెడ్డి, కేపీరెడ్డి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement