కడపలో వెల్లువెత్తిన నిరసన
సాక్షి, కడప :
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామా ఆడటంపై జిల్లా ప్రజలు గరంగరంగా ఉన్నారు. రోజంతా సమాలోచనలు జరిపి చివరకు హోదా ప్రక్కన పెట్టి ప్యాకేజీని ప్రకటించడం....సీమకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంపై పెద్ద ఎత్తున రగిలిపోతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని చట్టం చేసినా....అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ చట్టాన్ని ప్రక్కనపెట్టి నాటకాలాడటంపై అన్ని వర్గాల ప్రజల్లో అసంతప్తి వ్యక్తమవుతోంది. పైగా అధికారంలో ఉన్న టీడీపీ కూడా హోదాపై పెద్దగా మాట్లాడకపోవడం...కేంద్ర మంత్రులను రాజీనామా చేయించకుండా వ్యూహాత్మకంగా బాబు అడుగులు వేస్తుండడంపై అన్ని పార్టీలు ఆందోళనకు సిద్దమయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా శనివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా....గురువారం కడపతోపాటు పలుచోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి.
కడపలో కదం తొక్కిన విద్యార్థులు
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. కడపలోని కోటిరెడ్డి సర్కిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు రాష్ట్ర అధ్యక్షుడు సలాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును సలాంబాబు ఎండగట్టారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థి విభాగం ర్యాలీలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా, నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, వైఎస్సార్ సీపీ గల్ఫ్‌వైడ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, రాష్ట్ర కార్యదర్శి నారు మాధవరెడ్డిలు పాల్గొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ ఎత్తున విద్యార్థుల రాకతో కడపలో కదం తొక్కారు. చంద్రబాబు వ్యవహారిస్తున్న తీరుపై నేతలు మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు
కడపలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. కడపలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంతోపాటు హెడ్ పోస్టాఫీసు, ఎస్‌బీఐ తదితర కార్యాలయాల వద్ద నేతలు నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చల్లా రాజశేఖర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి సునీల్‌కుమార్, వైఎస్సార్ సీపీ గల్ఫ్‌వైడ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు వెంకట శివ, శంకర్, లోక్‌సత్తా జిల్లా కన్వీనర్ పెద్దన్న, వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు షఫీ తదితరులు ర్యాలీగా వెళ్లి కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు.
మైదుకూరు, బద్వేలులలో సీపీఐ....పీఎఫ్ కార్యాలయం ఎదుట ఆర్‌ఎస్‌యూ....
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు గురువారం పెద్ద ఎత్తున జరిగాయి. అఖిలపక్షాలతోపాటు ఇతర పార్టీల నాయకులు ఆందోళన చేపట్టారు. మైదుకూరు, బద్వేలులలోని నాలుగురోడ్ల కూడలి వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించగా, కడపలోని పీఎఫ్ కార్యాలయం వద్ద రాయలసీమ స్టూడెంట్ యూనియన్ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్యాకేజీ ప్రకటన నేపధ్యంలో ఎక్కడికక్కడ ఉద్యమిస్తున్నారు.
నల్లబ్యాడ్జీలతో కాంగ్రెస్ నిరసన
కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక హోదాకు మద్దతుగా నిరసన ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్‌తోపాటు ఇతర నాయకులు రోడ్డుపై బైఠాయించి టీడీపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.