నో..యాక్షన్‌..! | The rice WAY that is misleading | Sakshi
Sakshi News home page

నో..యాక్షన్‌..!

Published Mon, Aug 7 2017 3:56 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

నో..యాక్షన్‌..! - Sakshi

నో..యాక్షన్‌..!

సంక్షేమ వసతిగృహాల్లో పక్కదారి  పడుతున్న సన్నబియ్యం
నల్లగొండ :  సన్నబియ్యం అక్రమాల్లో దొరికినోడే దొంగ అన్నట్టుగా జిల్లా అధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. సంక్షేమ వసతి గృహాల్లో సన్నాలు పక్కదారి పడుతున్నాయని రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో బయటపడినా సంక్షేమ అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడటం లేదు. పోలీసులకు చిక్కినప్పుడో లేదంటే టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో బయటపడినప్పుడు మాత్రమే అధికారులు హడావుడి చేస్తున్నారు.

హాస్టల్స్‌ పైన అధికారుల పర్యవేక్షణ లోపించిందనడానికి జిల్లాలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న అక్రమాలే నిలువెత్తు నిదర్శనం. అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్లకు వంతపాడటంలో కూడా అధికారులు ఏమాత్రం వెనకాడటం లేదు. హాస్టల్స్‌లోని స్టాక్‌ రిజిస్టర్‌లో బోగస్‌ లెక్కలు చూపి ప్రతి నెలా లక్షల రూపాయాలు స్వాహా చేస్తున్న సంఘటనలు తనఖీల్లో బయటపడుతున్నప్పటికీ వార్డెన్ల పైన అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి.  

అక్రమాలకు అడ్డుకట్టేది...?
గత మార్చి 27న నార్కట్‌పల్లిలోని బీసీ, ఎస్సీ హాస్టల్స్, చిట్యాల ఉన్నత పాఠశాలల్లో స్టేట్‌ సివిల్‌ సప్‌లై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ నివేధిక ప్రకారం బీసీ హాస్టల్‌లో 4.50 క్వింటాళ్ల బియ్యం తేడా వచ్చినట్లు తేల్చారు. అదే విధంగా ఎస్సీ హాస్టల్‌లో బియ్యం లెక్కలు రిజిస్టర్‌లో ఫిబ్రవరి 28 వరకే రాశారు. మార్చి 1 నుంచి 27 వరకు స్టాక్‌ రిజిస్టర్‌లో ఎంట్రీల్లేవు. మార్చి 1న హాస్టల్‌లో బియ్యం ప్రారంభ నిల్వ 2.14 క్వింటాళ్లు. అదే నెలలో మరొక 8 క్వింటాళ్లు హాస్టల్‌కు వచ్చాయి.

ఈ లెక్కన మొత్తం 10.14 క్వింటాళ్లు హాస్టల్‌లో నిల్వ ఉండాలి. మార్చి 27 వరకు 4.05 క్వింటాళ్లు వాడారు. స్టాక్‌ రిజిస్టర్‌ ప్రకారం ఉండాల్సిన నిల్వ 6.05 క్వింటాళ్లు. కానీ భౌతికంగా ఉన్న నిల్వ 5.40 క్వింటాళ్లు. ఈ రెండింటికి మధ్య 69 కిలోలు తేడా కనిపిస్తోంది. సాధారణంగా హాస్టల్స్‌లో విద్యార్థుల హాజరు రెండు పూటలు తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదని టాస్క్‌ఫో ర్స్‌ అధికారులు రిపోర్ట్‌ ఇచ్చారు. చిట్యాల ఉన్నత పాఠశాలలో కూడా బియ్యం నిల్వలు ఉండాల్సిన దాని కంటే  229.50 కిలోల ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

ఈ తనిఖీలకు సంబంధించి వార్డెన్లు, పాఠశాల హెచ్‌ఎం ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కూడా రికార్డు చేశారు. ఈ సంఘటన జరిగి నాలుగుమాసాలు దాటినప్పటికి ఇంత వరకు శాఖాపరమైన చర్యలేవీ తీసుకో లేదు.  కలెక్టర్‌ వద్దకు ఫైల్‌ పంపినట్లు అప్పట్లో అధికారులు చెప్పారు కానీ దానికి సంబంధించిన యాక్షన్‌ ఏమీ లేకపోవడంతోనే వార్డెన్ల అక్రమాలను నిలువరించే పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలావుండగానే ఇటీవల కాలంలో నల్లగొండలోని బీసీ హాస్టల్‌ వార్డెన్‌ కూడా 7 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తర లిస్తుండగా పట్టణ పోలీసులు పట్టుకున్నారు. శాఖాపరమైన విచారణ అనంతరం ఆమెను విధుల నుంచి తొలగించారు.

స్టాక్‌ రిజిస్టర్‌.. బోగస్‌..
సంక్షేమ వసతి గృహాల్లో స్టాక్‌ రిజిస్టర్‌ అత్యంత కీలకమైంది. బియ్యం, కిరాణం సరుకుల నిల్వల వివరాలను స్టాక్‌ రిజిస్టర్‌లో తప్పనిసరిగా ఎంట్రీ చేయాలి. ప్రతి నెల ముగింపు బ్యాలెన్స్, ప్రారంభపు నిల్వల వివరాలు రిజిస్టర్‌లో పక్కాగా రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రతి రోజు హాస్టల్‌లో ఎంత మంది విద్యార్థులకు భోజనం వండించారు..? కూరలకు, అల్పాహారానికి వినియోగించిన కిరాణ సామగ్రి వివరాలను స్టాక్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలతోపాటు, శనివారం మిర్యాలగూడలో పట్టుబడ్డ సం ఘటనలో కూడా స్టాక్‌ రిజిస్టర్‌ అంతా బోగస్‌ అని తేలింది. స్టాకు రిజిస్టర్‌లో బియ్యం నిల్వలకు, హాస్టల్‌లో భోజనం చేసిన విద్యార్థులకు మధ్య వ్యత్యాసం భారీగానే ఉంటోంది.

ఇన్‌చార్జీల ఇష్టారాజ్యం
బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలు, కాలేజీ హాస్టల్స్, జిల్లా కార్యాలయాలకు శాశ్వత అధికారులు లేకపోవడం, వార్డెన్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇన్‌చార్జీలదే ఇష్టారాజ్యంగా మారింది. జిల్లా అధికారులకు రెండు, మూడేసి శాఖలు అప్పగించడంతో పనిభారం పెరిగి హాస్టల్స్‌పై దృష్టిసారించలేకపోతున్నారు. అన్ని శాఖల్లో కూడా సగాని పైగా వార్డెన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కో వార్డెన్‌ మూడు, నాలుగు వసతి గృహాలకు అదనపు బాధ్యతలు అప్పగించడం అక్రమాలకు తలుపులు తీసినట్లైంది. దీనికితోడు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి కాలేజీ హాస్టల్స్‌ను కూడా సాధారణ హాస్టల్స్‌ మాదిరే నడిపిస్తుండటంతో సన్నాల అక్రమాలకు మార్గం తేలికైంది. మిర్యాలగూడెం ఘటనలో ఎస్సీ బాలిక హాస్టల్‌ వార్డెన్‌కు బీసీ జనరల్‌ హాస్టల్, కాలేజీ హాస్టల్స్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఎస్టీ కాలేజీ హాస్టల్‌ వార్డెన్‌కు ఎస్సీ బాలుర కాలేజీ హాస్టల్‌ ఇన్‌చార్జిగా నియమించారు. ఇలా ఏళ్ల తరబడి ఒక్కో వార్డెన్‌కు రెండు, మూడు హాస్టల్స్‌ అప్పగించడం మూలా నా సన్నాల అక్రమాలకు తెరలేపుతున్నారని తెలుస్తోంది.

రిపోర్ట్‌ పంపించాం
టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నార్కట్‌పల్లి బీసీ, ఎస్సీ హాస్టల్‌లో పాటు, చిట్యాల ఉన్నత పాఠ శాలలో తనిఖీలు చేశారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు లేవనెత్తిన లోపాలకు సంబంధించిన రిపోర్ట్‌ను కలెక్టర్‌కు పంపడం జరిగింది. వారి పైన చర్యలు సంబంధిత శాఖలే తీసుకోవాలి.   
– ఉదయ్‌ కుమార్, డీఎస్‌ఓ

రిపోర్ట్‌ రాలేదు
టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలకు సంబంధించిన రిపోర్ట్‌ మాకు రాలేదు. తనిఖీలు చేశారన్న సమాచారం ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి నివేదిక అందలేదు. నివేదిక అందగానే బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకుంటాం.
– నరోత్తమ్‌ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి

వార్డెన్లపై సస్పెన్షన్‌ వేటు
మిర్యాలగూడ టౌన్‌ : సన్న బియ్యం పక్కదారి పట్టించారన్న అభియోగం మేరకు మిర్యాలగూడలోని  ఎస్సీ బాలికలు, బాలుర కళాశాల హాస్టళ్ల వార్డెన్లను సస్పెండ్‌ చేస్తూ ఆదివారం రాత్రి కలెక్టర్‌ గౌరవ ఉప్పల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ శివారులోని శ్రీలక్ష్మి ప్యాడీ(ఉషా) రైస్‌ మిల్లుపై రూరల్‌ ఎస్‌ఐ శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 70 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. విచారణలో అవి హాస్టళ్ల నుంచి సరఫరా అయిన బియ్యంగా ఆర్డీఓ కిషన్‌రావు గుర్తించారు. ఆయన నివేదిక మేరకు ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్‌ వార్డెన్‌ పార్వతి, ఎస్సీ బాలుర కళాశాల హాస్టల్‌ వార్డెన్‌ ఇ. శేఖర్‌రెడ్డిలను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  

వార్డెన్లపై కేసు
మిర్యాలగూడ రూరల్‌ : సంక్షేమ హాస్టళ్ల నుంచి సన్నబియ్యాన్ని పక్కదారి పట్టించారన్న అభియోగం మేరకు మిర్యాలగూడ పట్టణంలోని నలుగురు వార్డెన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.  మండలంలోని మెంకటాద్రిపాలెం గ్రామ దుర్గానగర్‌ లోని శ్రీలక్ష్మి బిన్నీ మోడ్రన్‌ మిల్లులో 70 క్విటాళ్ల సన్న బియ్యం నిల్వలను రూరల్‌ పోలీసులు శనివారం గుర్తించిన విషయం విధితమే. కాగా ఈ విషయమై దామరచర్ల ఎస్టీ  బాలుర వార్టెన్లు బాలకృష్ణ, నేరేడుచర్ల ఎస్సీ బాలుర వసతి గృహ వార్డెన్‌  సాయిరాంలతో పాటు, మిర్యాలగూడ పట్టణంలోని బీసీ బాలికల కళాశాల, జనరల్‌ ,ఎస్సీ బాలకల వసతి గృహ వార్డెన్‌ పార్వతీతో పాటు నాగార్జున నగర్‌లో ఉన్న ఎస్సీ బాలుర కళాశాల వార్డెన్‌ శేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement