మద్యం కోసం బిడ్డ విక్రయానికి యత్నం
కొడుకుతో పరారై వచ్చిన తల్లి
కేసముద్రం: మద్యానికి బానిసైన తండ్రి.. అందుకు డబ్బులు లేకపోవడంతో ఏకంగా కన్నబిడ్డను అమ్మడానికి సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు. బిడ్డను అమ్మొద్దని అడ్డువచ్చిన భార్యను చితకబాదాడు.తప్పించుకున్న ఆమె కొడుకును తీసుకొని వచ్చిన ఘటన వరంగల్ జిల్లా కేసముంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది. విజయవాడలోని కొత్తపేట కనకదుర్గ కాలనీకి చెందిన శేక్ సల్మా, అదే ప్రాంతానికి చెందిన కె.రాజు ప్రేమవివాహం చేసుకున్నారు. తాపీ మేస్త్రీ పనిచేస్తూ రాజుకు కుమారుడు రఫీ (3) ఉన్నాడు. పనిమానేసిన రాజు మద్యానికి బానిసయ్యూడు. ఇంట్లో ఉన్నదంతా అమ్ముకున్నాడు. డబ్బులకు కోసం భార్యను వేధించేవాడు.
అంతటితో ఆగకుండా పుట్టిన బిడ్డను అమ్మడానికి యత్నించాడు. వద్దని భార్య సల్మా వాదించడంతో చితకబాదాడు. ఎలాగోలా భర్త నుంచి తప్పించుకున్న సల్మా కొడుకును తీసుకుని మూడు రోజుల క్రితం విజయవాడలోని రైలు ఎక్కి కేసముద్రం రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. భిక్షాటన చేస్తూ కొడుకు కడుపు నింపుతోంది. గమనించిన స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. మంగళవారం పోలీసులు రైల్వేస్టేషన్ చుట్టుపక్కలా తిరుగుతున్న ఆమెను పోలీస్‌స్టేషన్.. అనంతరం తల్లీబిడ్డను వరంగల్‌లోని స్వధార్ హోంకు తరలించారు.