-సైబరాబాద్ వెస్ట్ పోలీసుల సహాకారంతో ఎస్‌సీఎస్‌సీ రూపకల్పన
-మరో రెండు వారాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు
సాక్షి, సిటీబ్యూరో
ఈ యాప్ షీ సేఫ్ గురూ...అతివల భద్రత కోసం అత్యంత ప్రాధాన్యమిస్తున్న సైబరాబాద్ వెస్ట్ పోలీసులు... సొసైటీఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్(ఎస్‌సీఎస్‌సీ) సహాకారంతో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఐటీ కారిడార్‌లో పనిచేసే మహిళా ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పాటు మహిళలకి కనీస రక్షణ కల్పించడమే ధ్యేయంగా రూపుదిద్దుకున్న ఈ యాప్ ప్రస్తుతం పైలట్ పద్ధతిన అమలుచేస్తున్నారు.
మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా అపదలో చిక్కుకున్న మహిళలను...ప్రయాణంలో దారి తప్పి గమ్యం చేరలేని పరిస్థితి ఉన్నా తక్షణం రక్షించేందుకు వీలుంటుందని పోలీసులు భావిస్తున్నారు. అమ్మాయిల సెల్‌ఫోన్లలో ఈ యాప్ నిక్షిప్తమై ఉంటే నమ్మకమైన నేస్తం వెన్నంటి ఉన్నట్టేనని అంటున్నారు. ఈ యాప్‌ను సెల్‌ఫోన్లలోకి డౌన్‌లోడ్ చేసుకోగానే మహిళలు వివరాలు నమోదుచేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత సైబరాబాద్ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ ప్రతినిధులు ఆ వివరాలన్నింటిని డయల్ 100తో పాటు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయనున్నారు.
ఎక్కడున్నా వచ్చేస్తారు...
ఇప్పుడు చాలా మంది ఆండ్రాయిడ్ సౌకర్యం ఉన్న ఫోన్లనే వినియోగిస్తుండటంతో ఆయా ఫోన్లను జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి వివరాలు పొందుపరిచిన అమ్మాయిలు అపద సమయాల్లో యాప్‌లో ఉన్న మీట నొక్కితే కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి సందేశం వెళ్లేలా ఫీచర్స్ రెడీ చేశారు. బాధితులు వీడియోలు, ఫొటోలు పంపించొచ్చు. ఒంటరి ప్రయాణంలో దారి తప్పి గమ్యం చేరలేని పరిస్థితి ఉంటే అక్కడి ప్రదేశాన్ని వీడియో తీసి పంపించొచ్చు.
వాయిస్ రికార్డు చేసి పోలీసులకు చేరవేసేలా ఫీచర్‌ను రెడీ చేశారు. వీటన్నింటితో పోలీసులు అప్రమత్తమై బాధితురాలి సెల్‌ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేయడం ద్వారా ఎక్కడుందో తెలుసుకొని సమీప పోలీసులను అక్కడికి పంపిస్తారు. ప్రస్తుతం సైబరాబాద్ కమిషనరేట్లలోని పెట్రోలింగ్ వాహనాలన్నింటిలోనూ జీపీఎస్ ఉండడంతో బాధితురాలున్న చోటుకు సమీప గస్తీ వాహనానికి సమాచారమిస్తారు. ఆమె ఫోన్ అందుబాటులో ఉంటే తాము ఎంతసేపట్లో ఘటనాస్థలికి చేరుకోగలుగుతారో చెబుతారు. ఆగంతకులెవరైనా అపహరించి ఆమె సెల్‌ఫోన్‌ని పడవేసినా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆచూకీ కనుగొంటారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ పరిసరాల్లోని దుండగుల ఫోన్ నంబర్లను ట్రాక్ చేసి పట్టుకునేలా కార్యాచరణకు దిగుతారు.
మరో రెండు వారాల్లో అందుబాటులోకి...
మహిళల భద్రత కోసం అత్యంత ప్రాధాన్యమిస్తున్న సైబరాబాద్ పోలీసులు సరికొత్తగా షీ సేఫ్ యాప్‌ను రెడీ చేసేందుకు ఎంతగానో సహకరించారు. అభయలాంటి ఘటనలు పునరావతం కాకుండా ఉండడంతో పాటు మహిళా ఉద్యోగుల సంఖ్య రోజుకోజుకు పెరుగుతుండటంతో వారు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ యాప్ రూపుదిద్దుకుంది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న యాప్‌ల కంటే ఇది భిన్నమైనది. మరో రెండు వారాల్లో దీన్ని అందుబాటులోకి తీసుకరానున్నాం. షీ సేఫ్ యాప్ సెల్‌ఫోన్‌లో ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలపై విస్తత ప్రచారం కల్పిస్తాం.
-భరణి ఆరోల్, కార్యదర్శి, ఎస్‌సీఎస్‌సీ.