ఎన్నికా.. ఏకగ్రీవమా..?
చిత్తూరు (అర్బన్): చిత్తూరు కార్పొరేషన్‌లో మేయర్ స్థానం భర్తీ కోసం ఎట్టకేలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 2015 నవంబరు నుంచి ఇన్‌చార్జ్ మేయర్ పాలనలో సాగుతున్న చిత్తూరు కార్పొరేషన్‌కు శాశ్వత ప్రజాప్రతినిధి రానున్నారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కావడంతో టీడీపీలోని ఓ వర్గానికి ఉపశమనం ఇస్తుంటే.. సొంత పార్టీలోని మరోవర్గం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తెరవెనుక అభ్యర్థుల్ని రంగంలోకి దించడానికి వ్యూహరచన చేస్తోంది.
చిత్తూరులోని 33వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన కటారి అనురాధ కార్పొరేషన్ తొలి మహిళా మేయర్‌గా ఎన్నికై 2015 నవంబరు 17న హత్యకు గురయ్యారు. ఆ మరుసటి నెలలో 38వ డివిజన్ కార్పొరేటర్ శివప్రసాద్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. బీసీ మహిళకు రిజర్వు చేసిన మేయర్ స్థానం అనురాధ మృతితో భర్తీకి నోచుకోలేదు. దీంతో డిప్యూటీ మేయర్‌గా ఉన్న సుబ్రమణ్యం ఇన్‌చార్జ్ మేయర్‌గా కొనసాగుతున్నారు. ఇలా దాదాపు 17 నెలలుగా చిత్తూరులో ఇన్‌చార్జ్ మేయర్‌తో పాలన సాగుతోంది. అయితే ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో రెండు డివిజన్లలోని స్థానాలు ఏకగ్రీవమవుతాయా..? ఎన్నికలు జరగుతాయా..? అనే దానిపై సందిగ్దత నెలకొంది.
పోటీ తప్పదా..?
గంనగపల్లెలో అనురాధ మరణం తరువాత ఆ కుటుంబానికే మేయర్ పదవి ఇస్తానని సీఎం చంద్రబాబునాయుడు గతంలోనే హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఓపెన్ కేటగిరికి చెందిన 38వ డివిజన్‌లో అనురాధ కోడలు హేమలత టీడీపీ నుంచి పోటీ చేయనున్నారు. అయితే కటారి కుటుంబానికి చెక్ పెట్టడానికి సొంత పార్టీలోని కొందరు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గంగనపల్లెకు చెందిన కొందరిని స్వతంత్ర అభ్యర్థులుగా ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేయించనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మిట్టూరులో శివప్రసాద్‌రెడ్డి కుటుంబం నుంచి ఎవరైనా పోటీచేస్తే ఇక్కడ ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. అలా కాదని బయటి వాళ్లు ఎవరైనా నామినేషన్ వేస్తే ఎన్నికలు అనివార్యం కానున్నాయి. మొత్తంమీద చిత్తూరు కార్పొరేషన్‌కు విడుదలైన ఉప ఎన్నికల షెడ్యుల్ టీడీపీలో సిగపట్లకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాగా రెండు డివిజన్లలో ఉప ఎన్నికలు పూర్తయితే పరోక్ష పద్ధతిలో మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. బీసీ–మహిళా విభాగంలో గెలుపొందిన ఒకరిని మేయర్‌గా ఎప్పుడు ఎన్నుకోవాలనే దానిపై ఇంకా షెడ్యుల్ విడుదల చేయలేదు. మరో వచ్చే వారం దీనిపై ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
కోడ్ అమలు
కాగా నగరంలోని రెండు డివిజన్ల ఎన్నికలకు కలెక్టర్ ఆదేశాలతో కార్పొరేషన్ కమిషనర్ జి.బాలసుబ్రమణ్యం గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 20వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్లు వేయడానికి ఆఖరు గడువన్నారు. 9న పోలింగ్, 11న కౌంటింగ్ జరుగుతుందన్నారు. చిత్తూరు నగర పరిధి అంతటా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని, రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు వాళ్ల సొంత ప్రచార బోర్డులను తొలగించాలని కమిషనర్ ఆదేశించారు.