
చెన్నైలో కోరవానిపల్లె యువకుడు మృతి
తొండూరు : మండలంలోని కోరవానిపల్లె గ్రామానికి చెందిన యువకుడు చెన్నైలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కోరవానిపల్లె గ్రామానికి చెందిన కొప్పల పరుశురాముడు(19) అనే యువకుడు చెన్నైలోని ప్రయివేట్ కంపెనీలో డ్యూటీ ముగించుకొని తిరిగొస్తుండగా రైల్వే ట్రాక్ దాటే సమయంలో రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే పరుశురాముడు స్నేహితులు, రైల్వే పోలీసులు అంబులెన్స్‌లో చెన్నై సెంట్రల్‌లోని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు పరుశురాముడు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. వారు చెన్నైకి వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించి పరుశురాముడు మృతదేహాన్ని స్వగ్రామమైన కోరవానిపల్లెకు తీసుకొచ్చారు.
ఉద్యోగం కోసం వెళ్లి మృత్యువాత.. :
కొప్పల పరుశురాముడు మూడు నెలల క్రితం కడప డీఆర్డీఏ సంస్థలో శిక్షణ పొంది అనంతరం ఉద్యోగం నిమిత్తం డీఆర్డీవో అధికారుల ఆదేశాల మేరకు చెన్నైలోని ఓ ప్రయివేట్ కంపెనీలో 6 రోజులక్రితం చేరాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని సమీపంలోని అద్దె గదికి వెళ్లేందుకు. నలుగురు స్నేహితులతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతుండగా మెట్రో రైలు ఢీకొనడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.
కోరవానిపల్లెలో విషాదం
కొప్పల పరుశురాముడు రైల్వే ట్రాక్ దాటుతుండగా మృతి చెందాడన్న విషయం తెలియగానే కోరవానిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు నెలల క్రితం పులివెందుల మండలం ఆర్.తుమ్మలపల్లె వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని 150 గొర్రెలు, ముగ్గురు మృతి చెందిన సంఘటన జరగడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పట్లో రోడ్డుప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబీకులకు పరుశురాముడు సమీప బంధువు కావడంతో వారి కుటుంబాలలో తిరిగి విషాదం అలుముకుంది.