మాది విజయవాడ దగ్గరి కానూరు. ఎంసీఏ చేసి, హైదరాబాద్‌లో ఒక ఎమ్మెన్సీలో జాబ్ చేస్తున్నాను. పనిదినాలు ఐదు రోజులే కావటంతో ప్రతి శుక్రవారం సాయంత్రం విజయవాడకు రైల్లో వెళ్తుంటాను. ఆదివారం తిరిగి వస్తుంటాను. ప్రతివారం వెళ్తున్నాకూడా, ప్రతిసారీ సంవత్సరం తర్వాత ఇంటికెళ్తున్నట్టు ఫీలవుతుంటాను.
పెద్దవాళ్ల పలకరింపులు, పిల్లల కేరింతలు, సీట్ల కోసం జరిగే మాటల యుద్ధాలు, టీ, కాఫీ, సమోసా కేకల మధ్య రైలు ప్రయాణం సరదాగా ఉంటుంది.
రకరకాల మనుషులను, మనస్తత్వాలను చూడాలంటే రాష్ట్రాలు, దేశాలు తిరగనక్కరలేదు. రైల్లో వెళ్తే చాలు. ప్రయాణం ఎంతోమందిని ఒకచోట కలుపుతుంది.
ఒక్కొక్కరు ఒక్కోలా ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు ల్యాప్‌టాప్, టాబ్లెట్‌లలో సినిమాలు చూస్తూ, మరికొందరు మౌనంగా పాటలు వింటూ, మరికొందరు అంత్యాక్షరి ఆడుకుంటూ తమవైన ఆనందాల్ని పొందుతారు.
నేను మాత్రం అక్కడున్నవాళ్లతో కబుర్లు చెబుతూనో, బయట కనబడే ప్రకృతిని చూస్తూనో ప్రయాణాన్ని కొనసాగిస్తాను. బంధాలు ఆస్వాదించాలే కాని చాలా బాగుంటాయి. ప్రతిసారీ కొత్తవాళ్లు పరిచయం అవుతారు. వాళ్ల ఊరొచ్చి దిగిపోతుంటే, వాళ్లు పరిచయమై కొద్ది గంటలే అయినా, ఎందుకో బాధగా ఉంటుంది. మళ్లీ కలుస్తామో లేదో తెలియదు! ఆనందం, బాధ! మా ఊరు వస్తుంది, ఇంటికి వెళ్లిపోవచ్చు అని ఆనందం, కలిసి ప్రయాణం చేసిన మనుషులు వెళ్లిపోతున్నారు అని బాధ!
స్టేషన్ రాగానే కొందరు హడావుడిగా దిగిపోతారు. నాకు పరిచయమైనవాళ్లు మాత్రం నాకు బై చెప్పకుండా వెళ్లరు. ఆ కొన్ని గంటలు నాకు గోల్డెన్ గంటలు!
విజయవాడ స్టేషన్ రాగానే మా ఇంటికి వెళ్లిపోవడం, మా పేరెంట్స్‌తో గడపటం, తిరుగు ప్రయాణం... మళ్లీ కథ మొదలు. నన్ను కలిసినవాళ్లు నన్ను మరిచిపోయుండొచ్చు కాని, నేను మరిచిపోలేను. వాళ్లంతా సంతోషంగా ఉన్నారని ఆశిస్తూ నా రైలు ప్రయాణాన్ని ముగిస్తున్నాను.
- కఠారి నరేంద్రబాబు, కానూరు
నా రైలు ప్రయాణం
Published Sun, Nov 30 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement