
అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అనంతరం అయోధ్యను సందర్శించేవారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
అయోధ్య సందర్శనకు వచ్చే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఏసీ మొదలుకొని స్లీపర్ క్లాస్, జనరల్ సౌకర్యాలతో కూడిన అన్ని రకాల రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. అయోధ్య వైపు వెళ్లే రైళ్ల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నదని సమాచారం.
ప్రస్తుతం అయోధ్యకు 35 రైళ్లు నడుస్తున్నాయి. రోజువారీ రైళ్లతో పాటు, వీక్లీ రైళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు జనవరి 22 నుంచి 37 అదనపు రైళ్లను నడపనున్నారు. దీంతో దేశంలోని 430 నగరాల నుంచి మొత్తం 72 రైళ్లు అయోధ్యకు నడవనున్నాయి. దీని గురించి రైల్వే మంత్రిత్వ శాఖ సమాచార, ప్రచురణ డైరెక్టర్ శివాజీ మారుతీ సుతార్ మాట్లాడుతూ భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు అదనపు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మరిన్ని నగరాలను నేరుగా అయోధ్యకు అనుసంధానం చేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోందని అన్నారు.
ఇది కూడా చదవండి: బాలరామునికి బొమ్మల బహుమానం