ఘరానా దొంగ అరెస్ట్
నెల్లూరు (క్రైమ్) : బస్టాండ్‌ల్లో బ్యాగ్‌లు, పర్సులు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగను నాల్గోనగర పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 4 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నగర డీఎస్పీ జి. వెంకటరాముడు గురువారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను వెల్లడించారు. కలిగిరి మండలం ముస్తాపురానికి చెందిన ఎం. గోపాల్ కొన్నేళ్ల కిందట కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చారు. పడారుపల్లిలో కాపురం ఉంటూ నగరంలోని ఓ ప్రముఖ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. విలాసాలు, వ్యసనాలకు బానిసయ్యాడు. సంపాదనసరిపోకపోవడంతో అక్కడ పని మానివేశాడు. ఆర్టీసీ బస్టాండ్‌లు, నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద కాపుకాసి మహిళల పర్సులు, బ్యాగ్‌లను దొంగలించేవాడు. కొంతకాలంగా నాల్గోనగర ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎస్‌కే అలీసాహెబ్, ఎం. రఘునాథ్ సిబ్బందితో కలిసి అతని కదలికలపై నిఘా ఉంచారు. నిందితుడు బుధవారం రాత్రి ఆచారివీ«ధిలోని బంగారు దుకాణాల వద్ద అనుమానాస్పంగా తిరుగుతుండగా పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి సుమారు రూ.4 లక్షలు విలువ చేసే 16 సవర్ల బంగారు నగలు, రూ. 50 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టుటకు కృషి చేసిన నాల్గోనగర పోలీసు అధికారులు, హెడ్‌కానిస్టేబుల్ ఆర్. సురేష్‌కుమార్, కానిస్టేబుల్స్ జి. వేణు, శివకృష్ణ, మహేంద్రరెడ్డి డీఎస్పీ అభినందించారు. ఎస్పీ విశాల్‌గున్నీ ద్వారా రివార్డులు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో నాల్గోనగర ఇన్‌స్పెక్టర్ సీహెచ్ సీతారామయ్య, ఎస్‌ఐ ఎం. రఘునాథ్ పాల్గొన్నారు.