కడప అగ్రికల్చర్ :
రైతులకు చేయితనిచ్చి వారికి వ్యవసాయ శాఖ తరఫున ఏమేమి కావాలో తెలుసుకుని సాయం అందించాలని ఒక్క పక్క జిల్లా సంయుక్త సంచాలకుడు పదే పదే చెబుతున్నా.. ఆ అధికారులు అవేమి చెవికెక్కించుకోవడం లేదు. ‘పచ్చ’ కండువా వేసుకోక పోయినా నరనరాన ఎక్కుంచుకుని పని చేస్తున్నారని రైతులు, ఎరువులు, పురుగు మందుల డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంతకం కావాలా?.. చేయితడుపు:
‘సార్..! మా షాపునకు ఎరువులు కావాలి, ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు కురుస్తున్నందున అవసరం అవుతోంది. మా లెటర్‌కు మీరు అనుమతి ఇప్పిస్తే తెచ్చుకుని వ్యాపారం చేసుకుంటాం’ అని అడిగితే... చేయి తడిపితేనే సంతకం చేస్తామని మొండి కేస్తున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు. ఇదేంది సార్..! తాము వ్యాపారం చేసుకోకపోతే ఎలా బతికేదని బతిమలాడినా కనికరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మా అన్న లెటర్ ఉందా? అయితే ఓకే’ అని కొంత మంది డీలర్లకు మాత్రం వెనువెంటనే సంతకం చేసి పంపుతున్నారు. ‘అన్నతో ఫోన్ చేయించుకోపో అని మరీ చెబుతుండడంతో మేం ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి, ప్రభుత్వానికి డబ్బులు కట్టి లైసెన్స్‌లు తెచ్చుకుని ఎరువులు అమ్ముకుంటున్నాం’ అని ఏ డీలరైనా ఎదురు ప్రశ్నిస్తే.. వారి దుకాణాలపై పడి తనిఖీల పేరుతో వేధించడం, కేసులు పెడతామని బెదిరిస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. ‘అన్న వద్దకు పోయి అన్నా తప్పు చేశామని చెప్పుకుని పార్టీ మారుతున్నట్లు చెప్పి.. ఒప్పించుకుని ఫోన్ చేయిస్తే ఎలాంటి ఇబ్బందులు పెట్టబోమని ఆ వ్యవసాయాధికారులు తెగేసి చెబుతున్నారు’ అని మైదుకూరు, కడప వ్యవసాయ డివిజన్లలోని ఇద్దరు డీలర్లు ‘సాక్షి’కి ఆవేదనతో తెలిపారు. ఇంత దారుణంగా గతంలో ఏ వ్యవసాయాధికారులు వ్యవహరించ లేదని ఎరువుల, పురుగు మందుల దుకాణదారులు వాపోతున్నారు. ఈ వ్యవసాయాధికారులతో వేగలేక చస్తున్నామని మైదుకూరు, కడప డివిజన్లలోని డీలర్లు తెలిపారు. ‘ఫిర్యాదులు చేశారో ఏవి అమ్ముకోలేరు. జిల్లా వ్యవసాయ శాఖ చైర్మన్ అయిన కలెక్టర్‌కైనా, జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులకు, చివరికి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఏమి కాదు. ఎందుకంటే మా అన్న ఉన్నంత వరకు ఎవరు మమ్ములను ఏమి చేయలేరు.. తెలుసా?’ అని డీలర్ల వద్ద అంటున్నారని తెలిపారు.
సీట్లో కూర్చుని విధులు నిర్వహించేది మా అన్న:
‘డీలర్లా...రా..! రైతన్నల్లా...రా! వినండి చెబుతున్నాం. ఇక్కడ విధులు నిర్వహిస్తున్నది మేం కాదు.. మా అన్న. ఆయన మాట ప్రకారమే మేం నడుచుకుంటాం. యాంత్రీకరణ పథకంలో దరఖాస్తులు మీరు మీ– సేవా కేంద్రంలోకి వెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మా చేతికి ఇస్తే మేం పంపుతాం. అందుకు గాను దరఖాస్తు ఫీజు రూ. 1000, అదనంగా మరో రూ. 5000 ఇస్తే యంత్ర పరికరాలు మీకు చేరుతాయి. అలా ఇవ్వకపోతే యంత్రం కాదు కదా.. యంత్రంలోని నట్టు కూడా రాదు’ అంటున్నారని రైతులు ఆవేదన చేస్తున్నారు. దీంతో కొందరు రైతులు చేసేదేమి లేక ముడుపులు ముట్ట చెబుతున్నారు. అన్ని రూపాయల ముట్టచెప్పలేమని, ఆ కార్యాలయాలకు వెళ్లడమే మానుకున్నామని మరికొందరు అంటున్నారు.
వారి రూటే సప‘రేటు’
Published Sun, Jul 24 2016 10:57 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement