అనంతలో మావోల ప్రభావం లేదు
పుట్టపర్తి టౌన్ : జిల్లాలో మావోలు పూర్తిగా కనుమరుగయ్యారని, మావోలతో కలసి పనిచేసేందుకు కూడా ఇక్కడి వారు సుముఖంగా లేరని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన ఆయన డీఎస్పీ కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో శాంతి భద్రతలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు చెప్పారు.ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దులో పెద్ద ఎత్తున మావోలను ఎన్‌కౌంటర్ చేయడం జరిగిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న హత్యలలో వివాహేతర సంబంధాలే కారణాలుగా ఉన్నాయన్నారు. కొన్ని చోట్ల మాత్రమే ఫ్యాక‌్షన్ వల్ల చోటు చేసుకుంటున్నాయన్నారు. మొబైల్ గ్యాంబ్లింగ్, మట్కా, గుట్కా తయారీ తదితర అసాంఘిక కార్యకలాపాలను అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేదరికం వల్ల మహిళల అత్మహత్యలు పెరిగాయని, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. పేదరికం,అవసరాలను ఆసరాగా చేసుకుని మహిళలను విదేశాలకు, ఇతర ప్రాంతాలకు తరలించేందుకు కొందరకు పాల్పడుతున్నారని, వారి ఆటకట్టించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
దాదాపు 140 మంది మహిళలు ఇరత ప్రాంతాల కు తరలివెళ్లినట్లు సమాచారం ఉందని, వారిని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. టెక్నాలజీని వినియోగించుకోవడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందంజలో ఉందన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ విధానాన్ని కొనసాగిస్తూ సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ముక్కా శివరామిరెడ్డి పాల్గొన్నారు.